కరోనా తర్వాత జుట్టు రాలుతోందా?అయితే ఈ చిట్కాలు పాటించండి!

కరోనాను జయించామనుకునే లోపే చాలామంది బాధితుల్లో వివిధ రకాల సమస్యలు బయటపడుతున్నాయి. వైరస్‌ శరీరంలోని రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడం...కరోనా చికిత్సలో భాగంగా వివిధ రకాల మందులు వాడడంతో ఈ పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ సమస్యలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Published : 13 Aug 2021 16:35 IST

కరోనాను జయించామనుకునే లోపే చాలామంది బాధితుల్లో వివిధ రకాల సమస్యలు బయటపడుతున్నాయి. వైరస్‌ శరీరంలోని రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడం...కరోనా చికిత్సలో భాగంగా వివిధ రకాల మందులు వాడడంతో ఈ పోస్ట్‌ కొవిడ్‌ సిండ్రోమ్‌ సమస్యలు బయటపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సమతులాహారంతో చెక్‌ పెడదాం!

ఈ క్రమంలో కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలామంది అమ్మాయిల్లో జుట్టు రాలిపోతుండడంతో వారికి కంటి మీద కునుకు ఉండడం లేదు. అయితే సమతులాహారంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఇందులో భాగంగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌-ఇ, ఫోలేట్‌తో నిండి ఉన్న ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలంటూ కొన్ని చిట్కాలను ఓ వీడియో రూపంలో పంచుకున్నారామె.

ఈ సమస్య తాత్కాలికమే!

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అలసట, నీరసం, ఒత్తిడి, జీర్ణాశయ సమస్యలు...వంటివి కొంతమందిలో కనిపిస్తున్నాయి. అలాగే కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిన చాలామంది మహిళల్లో జుట్టు రాలే సమస్య తలెత్తుతోంది. వైరస్‌ శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థతో పాటు ఇతర అవయవాలపై దాడి చేస్తుందని, దీని ఫలితంగానే హెయిర్‌ ఫాల్‌ సమస్య ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అసహజమైన పరిస్థితేమీ కాదని... ఎలాంటి ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకునే క్రమంలోనైనా కొన్ని వెంట్రుకలు రాలిపోతాయని, అది కూడా తాత్కాలికమేనని చెబుతున్నారు.

వాటికోసం నెట్‌లో వెతకద్దు!

ఈ క్రమంలో కొవిడ్‌ తర్వాత జుట్టు రాలిపోతుంటే చింతించడం మానుకోవాలంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. ఈ సమస్య నుంచి బయటపడదామని హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులు, హెయిర్‌ ప్యాక్‌లు, మాస్క్‌లు, పౌడర్ల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయించొద్దంటున్నారు.  వీటికి బదులు వంటగదికి వెళ్లి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్‌ - ఇ, ఫోలేట్‌ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలంటూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారామె.

⇴ జుట్టు రాలడం తగ్గాలన్నా, వెంట్రుకలు పెరగాలన్నా కొన్ని ఆహార పదార్థాలు రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. వెన్న కూడా అందులో ఒకటి. ఈ క్రమంలో ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక టీస్పూన్‌ వెన్నను చేర్చుకోవాలి. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, విటమిన్‌-ఎ, డి, కెలు శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

⇴ అలివ్‌ గింజల్లో విటమిన్‌-సి, ఎ, ఇ, ఐరన్‌, ఫోలేట్‌, క్యాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఈ గింజలతో చేసిన లడ్డూను రోజూ కనీసం ఒకటైనా తినాలి.

⇴ డిన్నర్‌లో దాల్‌-రైస్‌, నెయ్యిని భాగం చేసుకోవాలి. లేకపోతే పన్నీర్‌-పరాఠానైనా తీసుకోవాలి.

⇴ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్‌ కాకండి.

⇴ ఆహారంలో రైస్‌ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

⇴ రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కోవద్దు.

ఈ జాగ్రత్తలన్నీ ప్రధానంగా కొవిడ్‌ బాధితుల కోసమే...అయితే మామూలుగా ఉండి జుట్టు సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని పాటించవచ్చని రుజుత చెప్పుకొచ్చారు.

జీవనశైలిని ఇలా మార్చుకోండి!

కొవిడ్‌ తర్వాత జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంతో పాటు లైఫ్‌స్టైల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

⇴ కొవిడ్‌ తగ్గాక జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే సమస్య అంత త్వరగా తగ్గుతుందట! ఈ క్రమంలో వెంట్రుకల్ని ఇష్టమొచ్చినట్లుగా దువ్వడం, బ్లో డ్రయర్స్‌ వాడడం, కాస్త వేడిగా ఉండే నూనెతో మసాజ్‌ చేయడం.. వంటివి చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మరింతగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందట!

⇴ జుట్టును అలాగే వదిలేయడం, బిగుతుగా హెయిర్‌స్టైల్స్‌ వేసుకోవడం, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌ వాడడం.. అస్సలు మంచిది కాదు.

⇴ ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ధ్యానం, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి చక్కటి ఫలితాన్ని అందిస్తాయి.

⇴ ఆకుకూరలు, మాంసం, చేపలు.. వంటివి రోజువారీ మెనూలో చేర్చుకోవడం మంచిది. తద్వారా వీటిలోని పోషకాలు జుట్టు రాలే సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం కలిగిస్తాయి. 

వీటితో పాటు నిపుణుల సలహా మేరకు ఇంటి చిట్కాలను సైతం ప్రయత్నించచ్చు. అయితే ఇలా కొవిడ్‌ రికవరీ తర్వాత మీరు ఏది చేసినా సొంత వైద్యం కాకుండా.. ఓసారి నిపుణుల సలహా తీసుకున్నాకే ఫాలో అవడం మంచిది. తద్వారా ఉన్న సమస్యకు తోడు అదనంగా మరిన్ని దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్