Mother’s Day: ఒంటరిగానే పిల్లల్ని పెంచగలం!

పిల్లల పెంపకంలో, వారికి విలువలు-విద్యాబుద్ధులు నేర్పడంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర సమానం. అయితే వివిధ కారణాల వల్ల భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వస్తే..? పిల్లల బాధ్యత పూర్తిగా తల్లి పైనే పడితే..? వాళ్లు సమర్థంగా ఈ బాధ్యతను....

Updated : 15 May 2023 19:05 IST

(Photos: Instagram)

పిల్లల పెంపకంలో, వారికి విలువలు-విద్యాబుద్ధులు నేర్పడంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర సమానం. అయితే వివిధ కారణాల వల్ల భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వస్తే..? పిల్లల బాధ్యత పూర్తిగా తల్లి పైనే పడితే..? వాళ్లు సమర్థంగా ఈ బాధ్యతను నిర్వర్తించలేరనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు సెలబ్రిటీ తల్లులు. భర్త నుంచి విడిపోయినా.. తమ పిల్లలకు నాన్న లేని లోటు తెలియకుండా పెంచుతున్నారు. కెరీర్‌లోనూ ఆత్మవిశ్వాసంతో రాణిస్తూ.. తమ పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి సెలబ్రిటీ సింగిల్‌ మదర్స్‌ గురించి ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మీకోసం..!

కరిష్మా కపూర్

పిల్లలకు ఊహ తెలిసినా, తెలియకపోయినా.. తమ తల్లిదండ్రులు విడిపోయారన్న నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేరు. ఇలాంటప్పుడు వాళ్ల పసి మనసులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఈ సున్నితమైన విషయాన్ని వారితో నెమ్మదిగా అర్థం చేయించే ప్రయత్నం చేయాలని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార కరిష్మా కపూర్‌. 2003లో వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ను వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ.. కూతురు సమైరా, కొడుకు కియాన్‌కు జన్మనిచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల 2014లో విడాకుల కోసం అప్లై చేసుకున్న ఈ జంటకు.. 2016లో విడాకులు మంజూరయ్యాయి. అప్పట్నుంచి ఒంటరిగానే తన ఇద్దరు పిల్లల బాధ్యత నిర్వర్తిస్తోందీ బాలీవుడ్‌ మామ్.

‘విడాకులు తీసుకోవడం పొరపాటుగా భావిస్తుంటారు కొందరు మహిళలు. సమాజం నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, భర్త నుంచి విడిపోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులొస్తాయోనన్న భయంతో కుమిలిపోతుంటారు. నిజానికి ఇలాంటి అభద్రతా భావన మంచిది కాదు. అనవసర భయాలు పెట్టుకోకుండా పిల్లల పెంపకం పైనే పూర్తి దృష్టి పెట్టాలి. క్రమశిక్షణతో వాళ్లను పెంచి పెద్ద చేయాలి.. తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికి మన వంతుగా ప్రయత్నించాలి. అయితే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు విడాకులు తీసుకున్న కొంతమంది మహిళలు.. పిల్లలు తమ తండ్రి గురించి అడిగే ప్రశ్నలకు బదులిస్తూ అబద్ధాలు చెబుతుంటారు. నాన్న విదేశాల్లో ఉన్నారని.. ఉద్యోగ బదిలీ మీద వేరే ఊరెళ్లారని.. ఇలా లేనిపోనివి కల్పించి చెబుతుంటారు. నిజానికి అసలు విషయం మూడో వ్యక్తి ద్వారా తెలిసి.. మీ పిల్లలు బాధపడడం, మీ గురించి మరోలా అనుకోవడం.. వంటివి జరగకముందే మీరు జాగ్రత్తపడాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో వారికి సున్నితంగా వివరించే ప్రయత్నం చేస్తే వాళ్లు తప్పకుండా అర్థం చేసుకుంటారు.. అంతేకానీ మీరేదో తప్పు చేసినట్లుగా అబద్ధాలాడడం సరికాదు..’ అంటూ చెప్పుకొచ్చిందీ కపూర్‌ బ్యూటీ. ప్రస్తుతం 50కి చేరువవుతున్నా తరగని అందంతో కట్టిపడేస్తోన్న కరిష్మా.. పలు ఫ్యాషన్‌ బ్రాండ్లకు మోడలింగ్‌ చేస్తోంది. మరోవైపు దర్శకురాలిగా, ఇంకోవైపు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.


శ్వేతా తివారీ

‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది బాలీవుడ్‌ బుల్లితెర నటి శ్వేతా తివారీ. ఆపైనా ఆమె పలు సీరియల్స్‌లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. 1998లో నటుడు రాజా ఛౌదరిని వివాహమాడిన శ్వేత.. పలక్‌ అనే కూతురికి జన్మనిచ్చింది. తన వైవాహిక బంధంలో గృహహింస పేరుతో విసిగిపోయిన ఆమె.. 2007లో ఆ బంధానికి స్వస్తి పలికింది. 2010లో బిగ్‌బాస్‌-4 విజేతగా నిలిచి మరింత పాపులారిటీ సంపాదించిన ఈ బుల్లితెర బ్యూటీ.. 2013లో అభినవ్‌ కోహ్లీని వివాహమాడింది. వీళ్ల ప్రేమకు గుర్తుగా 2016లో రేయాన్ష్‌ అనే కొడుకు పుట్టాడు. అయితే ఆపై ఈ బంధంలోనూ ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. దీంతో ఆ మరుసటి ఏడాదే అభినవ్‌ నుంచి విడిపోయి.. ఒంటరి తల్లిగా ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంది శ్వేత. ఈ క్రమంలో తన అనుభవాల్ని ఓ సందర్భంలో ఇలా పంచుకుందీ బాలీవుడ్‌ మామ్.

‘కుటుంబానికి పెళ్లే ప్రధానమంటే నేను అంగీకరించను. ఒక్కోసారి నా కూతురితో నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని చెబుతుంటాను. కానీ తన జీవితం తన ఇష్టం. ఇలాగే నడుచుకోవాలని ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెట్టను.. నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని మాత్రం చెబుతుంటాను. జీవితంలో పెళ్లి చేసుకోవడం ముఖ్యమే కావచ్చు.. కానీ విడిపోయాక జీవితం ఎలా ముందుకు సాగుతుందన్న సందేహం, భయం వద్దు.. విషపూరితమైన అనుబంధంలో కొనసాగుతూ అనుక్షణం బాధపడడం కంటే.. అందులో నుంచి బయటికొచ్చి సంతోషంగా గడపడం మంచిదన్నది నా సిద్ధాంతం..’ అంటోంది శ్వేత. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ బుల్లితెర మామ్‌.. ప్రస్తుతం నటిగా, మోడల్‌గా కెరీర్‌ని కొనసాగిస్తూ, ఎలాంటి పరిస్థితినైనా పాజిటివ్‌గా తీసుకుంటూ తన పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


జుహీ పార్మర్

నటిగా, తల్లిగా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా.. బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది బాలీవుడ్‌ టీవీ నటి జుహీ పార్మర్‌. ‘కుంకుమ్‌’ సీరియల్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కూడా ప్రస్తుతం ఒంటరి తల్లిగానే తన కూతురు సమైరాను పెంచుతోంది. టీవీ నటుడు సచిన్‌ ష్రాఫ్‌ను వివాహమాడిన జుహీ.. తన తొమ్మిదేళ్ల వైవాహిక బంధానికి 2018లో స్వస్తి పలికింది. అప్పట్నుంచి తన కూతురికి తల్లీ, తండ్రి తానే అయి పెంచుతున్నానంటోంది.

‘ఒకేసారి ఎక్కువ పనులు చేయడానికి ఇబ్బంది పడుతుంటాం.. ఒంటరిగా పిల్లల్ని పెంచే క్రమంలోనూ ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇల్లు-పిల్లలు-వృత్తిని ఏకకాలంలో బ్యాలన్స్‌ చేయాల్సి వస్తుంది. అయినా ఇవన్నీ ఇష్టంతో చేస్తాను కాబట్టి కష్టమనిపించదు. ఇక ఇలాంటి పరిస్థితిలో సమాజం నుంచీ పలు విమర్శలు ఎదురవడం సహజం. అయినా నేను వాటిని పట్టించుకోవట్లేదు. మా విడాకుల గురించీ నా కూతురితో సున్నితంగా వివరించే ప్రయత్నం చేశాను.. తను అర్థం చేసుకుంది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా తన కోసం సమయం కేటాయించే విషయంలో అస్సలు రాజీ పడను. తనను వెకేషన్స్‌కి తీసుకెళ్లడం, ఇంట్లో ఉన్నా తనను సర్‌ప్రైజ్‌ చేయడం.. ఇలా ప్రతి క్షణం తనను సంతోషంగా ఉంచడమే నా కర్తవ్యం!’ అంటూ అమ్మతనంలోని మాధుర్యాన్ని పంచుకుంది జుహీ.


ప్రగతి

అమ్మగా ఎన్నో సినిమాల్లో మెప్పించింది టాలీవుడ్‌ నటి ప్రగతి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె కూడా ప్రస్తుతం సింగిల్‌ మదర్‌గానే తన పిల్లల బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అయితే జీవితంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం కంటే.. జరగాల్సిన దానిపై దృష్టి పెడితే సానుకూల దృక్పథంతో ముందుకు సాగచ్చంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘మా అమ్మ సింగిల్‌ మదర్‌. తనలా నేను కష్టపడకూడదన్న ఉద్దేశంతో నా వైవాహిక జీవితంలో చాలా విషయాల్లో సర్దుకుపోవడానికి ప్రయత్నించాను. ఎంతో ఓపిక వహించాను. కానీ దేనికైనా కొన్ని హద్దులుంటాయి. రాజీ విషయంలోనూ అంతే! తప్పు మనదైనా, కాకపోయినా.. ప్రతి విషయంలోనూ అతిగా రాజీ పడడం వల్ల మనమే మన పిల్లలకు తప్పుడు ఉదాహరణగా నిలిచే ప్రమాదం ఉందనిపించింది. అది నా మనసుకు నచ్చలేదు. అందుకే నా భర్తతో విడిపోదామని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో సమాజం నుంచి వచ్చిన విమర్శల్ని లెక్కచేయలేదు. నా పిల్లల విషయంలో నేను కోరుకున్నది ఒక్కటే.. మంచి జీవితాన్నివ్వాలని! ఒంటరి తల్లిగా కొన్ని ప్రతికూల పరిస్థితులెదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు తోడుంటే బాగుండనిపిస్తుంది. కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం నాకు నచ్చదు. పాజిటివ్‌గా ముందుకెళ్లడమే నాకు తెలిసింది!’ అంటోంది ప్రగతి. ప్రస్తుతం నటిగానే కాదు.. యూట్యూబర్‌గానూ రాణిస్తోందీ టాలీవుడ్‌ మామ్‌. ఫిట్‌నెస్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తూ.. తన పిల్లలకే కాదు.. ఫ్యాన్స్‌కూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రగతి.
బాలీవుడ్‌ నటీమణులు ఊర్వశీ ధోలాకియా, నీనా గుప్తా కూడా భర్త నుంచి విడిపోయినా.. కెరీర్‌లో నిలదొక్కుకొని మరీ.. ఒంటరిగానే తమ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. వాళ్లకు నచ్చిన అంశాల్లో ప్రోత్సహించి.. తమ కాళ్లపై తాము నిలబడడంలో కీలక పాత్ర పోషించారు.

ఇక పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని దత్తత తీసుకొని.. ఒంటరిగానే పిల్లల్ని పెంచుతున్నారు కొందరు తారలు. సుస్మితా సేన్‌, ఏక్తా కపూర్‌, సాక్షి తన్వర్‌.. వంటి సెలబ్రిటీ మామ్స్‌ ఇదే కోవకు చెందుతారు.

మీ అమ్మ నుంచి అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాల గురించి, మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోవడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని