Updated : 28/12/2021 18:28 IST

Fat to Fit: అలా అనుకున్నారంతే.. ఇలా స్లిమ్‌గా మారిపోయారు!

(Photo: Instagram)

ఎన్నో అనుకుంటాం.. అన్నీ సాధ్యం కావు.. బరువు తగ్గడం కూడా అందులో ఒకటి. ఏడాది ఆరంభంలో తీర్మానం తీసుకోవడం.. ఆఖరుకొచ్చే సరికి ఇక మా వల్ల కాదంటూ చతికిలపడడం.. చాలామందికి అలవాటే! అయితే తాము మాత్రం ఇందుకు భిన్నం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. నెలల వ్యవధిలోనే కిలోలకు కిలోలు బరువు తగ్గి ‘తలచుకుంటే ఏదైనా సాధ్యమే!’ అని నిరూపిస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. బరువు తగ్గే విషయంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, ఏడాది ముగిసిపోతోన్న సందర్భంగా.. ఈ సంవత్సరంలో బరువు తగ్గి నాజూగ్గా మారిన ఆ ముద్దుగుమ్మలెవరు? వాళ్ల వెయిట్‌లాస్‌ జర్నీ ఏంటో తెలుసుకుందాం రండి..

‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పనికొచ్చింది!

ఏ విషయంలోనైనా సానుకూలంగా స్పందించే బాలీవుడ్‌ అందాల భామ సమీరా రెడ్డి.. సమాజానికి భయపడి వయసును, బరువును దాచుకోవాల్సిన పని లేదంటోంది. ఇటీవలే 43 లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. తన వెయిట్‌ లాస్‌ జర్నీలో ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ ప్రత్యేకమంటోంది.

‘95 కిలోల బరువున్న నేను.. 75 కిలోలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ కొన్ని ప్రతికూలతల వల్ల ఈ జర్నీ కాస్త నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం పదకొండు కిలోలు తగ్గి 81 కిలోలకు చేరుకున్నా. అయితే నా పుట్టినరోజు (డిసెంబర్‌ 14) సందర్భంగా అదనంగా రెండు కిలోలు పెరిగా. అయినా నా లక్ష్యాన్ని మాత్రం వీడను. అయితే నేనో పెద్ద ఎమోషనల్‌ ఈటర్‌ని.. అంటే ఆనందమొచ్చినా, బాధ కలిగినా ఓ పరిమితి లేకుండా తినేదాన్ని. దీన్ని అదుపు చేసుకోవడానికే ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. అంటే ప్రతి శుక్రవారం నా బరువును తూచుకోవడం, దానికి తగ్గట్లుగా నా ఫిట్‌నెస్‌ ప్రణాళికల్ని మెరుగుపరచుకోవడం అలవాటుగా మారింది.

ఇక ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (పరిమిత కాల ఉపవాసం) చక్కటి ఫలితాల్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మూడుసార్లు (11am, 2pm, 6pm) మాత్రమే ఆహారం తీసుకుంటున్నా. నీళ్లు ఎక్కువగా తాగడం, హెర్బల్‌ టీలు లేదా బ్లాక్‌ కాఫీ.. వంటి వాటికి ప్రాధాన్యమిస్తున్నా. వీటితో పాటు వారానికి మూడుసార్లు యోగా, రోజూ బ్యాడ్మింటన్‌, నాలుగుసార్లు సైక్లింగ్‌.. వంటివి నేను క్రమంగా బరువు తగ్గి నాజూగ్గా మారడంలో సహకరిస్తున్నాయి..’ అంటోంది సమీర.


ఇంటి పనులతో 20 కిలోలు!

‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటోంది అలనాటి అందాల తార ఖుష్బూ. ఈ క్రమంలో ఆరోగ్యంగా బరువు తగ్గడమే ఉత్తమమైన మార్గం అని చెబుతోంది. గత కొన్ని నెలల నుంచి సుమారు 20 కిలోలు తగ్గిన ఆమె.. నాజూగ్గా మారిన ఫొటోలతో అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.

‘గత కొన్ని నెలల కష్టానికి ప్రతిఫలంగా 20 కిలోలు తగ్గా. ప్రస్తుతం నేను ఆరోగ్యకరమైన బరువున్నా. ఆరోగ్యానికి మించింది మరొకటి లేదు. అయితే నేను ఇంత నాజూగ్గా మారే సరికి కొంతమంది అనారోగ్యం వల్లేనేమో అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం నేను ఎప్పుడూ లేనంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నా. అంతేకాదు.. చాలామంది నన్ను అడుగుతున్నారు.. ఉన్నట్లుండి ఇంతలా బరువు తగ్గడానికి కారణమేంటని? ఫిట్‌గా మారాలన్న నా ఆలోచనకు లాక్‌డౌన్‌ కూడా తోడైంది. ఆ సమయంలో సుమారు 70 రోజుల పాటు ఇంటి పనులన్నీ నేనొక్కదాన్నే చేసుకున్నా. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమడం, బట్టలుతకడం, గార్డెనింగ్‌.. ఆఖరికి టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా! ఇక వీటితో పాటు యోగా, ప్లాంక్‌ వ్యాయామాలు నా వెయిట్‌లాస్‌ జర్నీలో కీలకంగా మారాయి. అలాగే నాకు నచ్చిన బిర్యానీ, ఐస్‌క్రీమ్‌ వంటి కొన్ని రకాల పదార్థాల్ని సైతం దూరం పెట్టాను. నిజానికి నేను పాటించిన ఈ నియమాలు కనీసం పది మందిలో స్ఫూర్తి నింపినా నాకు ఆనందమే!’ అంటోందీ అందాల అమ్మ. ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ఆపే ప్రసక్తే లేదని, 69 కిలోలకు చేరుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతోంది.


ప్రయత్నం సాగుతోంది!

హాస్యచతురతతో కూడిన పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆలోచనలో పడేస్తుంటారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. అయితే బొద్దుగా ఉండే ఈ లేడీ మినిస్టర్‌.. ఇటీవల నాజూగ్గా మారి.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి బహిరంగంగా చెప్పకపోయినా.. జిమ్‌లో వర్కవుట్లు చేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంటూ.. ‘ప్రయత్నం కొనసాగుతోంది!’ వంటి క్యాప్షన్లతో తాను బరువు తగ్గే పనిలో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు స్మృతి. అయితే ఈ వర్కవుట్ రొటీన్‌తో పాటు పాలు-పాల పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టి.. గ్లూటెన్‌-ఫ్రీ, చక్కెర లేని ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారట! ఇలా ఈ నియమాలన్నీ ఆమెను ఇంతకుముందెన్నడూ లేనంత నాజూగ్గా మార్చాయని చెప్పచ్చు.


జిమ్‌కు వెళ్లకుండానే..!

‘బాలీవుడ్‌ లాఫింగ్‌ క్వీన్‌’గా పేరు గాంచింది భారతీ సింగ్‌. మొన్నటిదాకా బొద్దుగా, క్యూట్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బరువు తగ్గి కాస్త సన్నబడింది. అయితే తాను లావుగా ఉన్నప్పుడే క్యూట్‌గా ఉన్నానని అందరూ అంటున్నారని, కానీ బరువు తగ్గాకే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నట్లనిపిస్తోందంటోందీ స్టాండప్‌ కమెడియన్.

‘91 కిలోలున్న నేను.. ఈ ఏడాది 76 కిలోలకు చేరుకున్నా. అంటే.. సుమారు 15 కిలోలు తగ్గాను. ఇంత నాజూగ్గా మారానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అదే సమయంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నానన్న భావన కలుగుతోంది. ఈ క్రమంలో మధుమేహం, ఆస్తమా కూడా అదుపులో ఉన్నాయి. ఇక బరువు తగ్గేందుకు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ (పరిమిత కాల ఉపవాసం) బాగా పనికొచ్చింది. ఇందులో భాగంగా సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 వరకు ఉపవాసం ఉండేదాన్ని. ఇక ఇందుకోసం ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేసింది కూడా లేదు. అయితే నేను బబ్లీగా ఉన్నప్పుడే క్యూట్‌గా ఉన్నానని కొందరు అంటున్నారు.. మరికొందరు సన్నగా మారాకే బాగున్నానంటున్నారు. ఏదేమైనా నేనెప్పుడూ క్యూట్‌గానే ఉంటా కదా!’ అంటూ ఓ నవ్వు రువ్వుతోందీ బబ్లీ బ్యూటీ.


పీసీఓఎస్‌ అదుపులోకొచ్చింది!

బాడీ పాజిటివిటీతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపే ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా.. ప్రస్తుతం తన వెయిట్‌లాస్‌ జర్నీతోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా బరువు తగ్గి ఫిట్‌గా మారిన ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తన అనుభవాలను సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంటుంటుంది.

‘నా వృత్తికి, అనుబంధాలకు ఎంత ప్రాధాన్యమిస్తానో.. నా ఆరోగ్యానికీ అంతే ప్రాముఖ్యం ఇవ్వాలనుకున్నా. ఈ క్రమంలో నా రొటీన్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. 9 దాకా నడక, యోగా, ఇతర వ్యాయామాలు చేస్తున్నా. ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిస్తున్నా. రాత్రి పార్టీలు, అనవసర విషయాల గురించి ఆలోచించడం, ఒత్తిడికి గురవడం.. వంటివన్నీ మానేశా. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. చుట్టూ ఉన్న వారితో సంతోషంగా గడపడం అలవాటు చేసుకున్నా. ఇవే నేను బరువు తగ్గేందుకు దోహదం చేశాయి. అలాగే పీసీఓఎస్‌ చాలావరకు అదుపులోకొచ్చింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నట్లనిపిస్తోంది. సాధారణంగా చాలామంది అమ్మాయిల్లో అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. ఇది లేనిపోని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. వీటి బారిన పడకూడదంటే హెల్దీ లైఫ్‌స్టైల్‌ని అలవర్చుకోవడమొక్కటే మార్గం..’ అంటోంది మసాబా.

వీరితో పాటు బాలీవుడ్‌ బుల్లితెర నటి శ్వేతా తివారీ, కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా భార్య లిజెల్లే.. వంటి ప్రముఖులు కూడా తమ అధిక బరువును తగ్గించుకొని నాజూగ్గా మారారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.

మరి, మీరూ వీరిలాగే ఈ ఏడాది బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకొని సక్సెసయ్యారా? అయితే మీ వెయిట్‌లాస్ జర్నీని contactus@vasundhara.net వేదికగా మాతో పంచుకోండి. ఈ క్రమంలో మీరిచ్చే సలహాలు, చిట్కాలు మరెంతోమందికి ఉపయోగపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని