Ceramic Cookware: వీటిని ఇలా శుభ్రం చేయండి!
ఇంటికి అతిథులొచ్చినప్పుడు హుందాగా కనిపించడమే కాదు.. వంటా వార్పు విషయాల్లోనూ హుందాగా వ్యవహరిస్తుంటాం. వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రలైనా, వడ్డించేటప్పుడు వాడే ప్లేట్స్ అయినా కాస్త ఖరీదైనవి....
ఇంటికి అతిథులొచ్చినప్పుడు హుందాగా కనిపించడమే కాదు.. వంటా వార్పు విషయాల్లోనూ హుందాగా వ్యవహరిస్తుంటాం. వంట చేసేటప్పుడు ఉపయోగించే పాత్రలైనా, వడ్డించేటప్పుడు వాడే ప్లేట్స్ అయినా కాస్త ఖరీదైనవి ఎంచుకుంటాం. అలాంటి వంట పాత్రల్లో సెరామిక్ కుక్‌వేర్ ముందు వరుసలో ఉంటుంది. అయితే వీటిని వినియోగించడం వరకే కాదు.. శుభ్రపరిచే విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఎక్కువ కాలం మన్నుతాయంటున్నారు. మరి, సెరామిక్ వంట పాత్రల్ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం రండి..
⚛ కొంతమంది సమయం లేకపోవడం వల్లో లేదంటే త్వరగా పని పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతోనో.. వేడిగా ఉన్నప్పుడే సెరామిక్ పాత్రల్ని శుభ్రం చేస్తుంటారు. వాటిని కుళాయి కింద పెడితే చల్లబడతాయనుకుంటారు. అయితే ఇలా ఉష్ణోగ్రతలో ఉన్నట్లుండి మార్పు రావడం వల్ల వాటిపై ఉండే నాన్‌స్టిక్ సెరామిక్ కోటింగ్ తొలగిపోతుందంటున్నారు నిపుణులు. అందుకే వంట పూర్తయ్యాక అవి సాధారణ గది ఉష్ణోగ్రత వద్దకొచ్చాక మాత్రమే వాటిని శుభ్రం చేయాలంటున్నారు.
⚛ సాధారణంగా సెరామిక్ వంట పాత్రలపై ఉన్న నాన్‌స్టిక్ కోటింగ్ అందులో వండే పదార్థాల్ని మాడిపోనివ్వదు. అయినా మాడిపోకుండా ముందే వెన్న పూయడం.. వంటివి చేయాలి.
⚛ ఒకవేళ సెరామిక్ పాత్రలు మాడిపోయినట్లయితే.. అలాంటి వాటిని బేకింగ్ సోడాతో శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పాత్రలో పొడి బేకింగ్ సోడాను చల్లాలి. ఆపై మృదువుగా ఉన్న స్పాంజితో గుండ్రంగా రుద్దాలి. ఆపై సాధారణ డిటర్జెంట్‌తో కడిగేస్తే సరిపోతుంది. ఇక బేకింగ్ సోడా, గోరువెచ్చటి నీళ్ల మిశ్రమంతో ఈ పాత్రల్ని శుభ్రం చేసినా సమాన ఫలితం ఉంటుంది.
⚛ ఒక వంతు వెనిగర్‌కు నాలుగు వంతుల నీళ్లు తీసుకొని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని శుభ్రం చేయాల్సిన సెరామిక్ పాత్రలో పోసి.. రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే సబ్బుతో శుభ్రం చేస్తే.. వంట చేసే క్రమంలో వాటిపై ఏర్పడిన మరకలు, జిడ్డుదనం.. అన్నీ తొలగిపోతాయి.
⚛ టేబుల్‌స్పూన్ చొప్పున ఉప్పు, వెనిగర్ తీసుకొని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీంతో ముందుగా సెరామిక్ పాత్రలు/ప్లేట్స్ శుభ్రం చేసి.. ఆపై డిటర్జెంట్‌తో కడిగేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.
⚛ కొన్నిసార్లు సెరామిక్ పాత్రలపై పసుపు మరకలు పడుతుంటాయి. అవి ఓ పట్టాన వదలవు. అలాంటప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. కొద్దిగా ఈ ద్రావణాన్ని పాత్రలో పోసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై డిటర్జెంట్‌తో శుభ్రం చేస్తే ఫలితం ఉంటుంది.
⚛ వంట త్వరగా పూర్తవ్వాలన్న ఉద్దేశంతో కొంతమంది ఎక్కువ మంటపై వంట చేస్తుంటారు. సెరామిక్ పాత్రల్ని ఇలా పెద్ద మంటపై ఉంచితే వాటిలోని నాన్‌స్టిక్ కోటింగ్ త్వరగా పోతుంది.. కాబట్టి సెరామిక్ పాత్రల్ని చిన్న మంట పైనే పెట్టి వంట చేయడం మంచిది.
⚛ సెరామిక్ ప్లేట్స్‌లో ఆహార పదార్థాలు కట్ చేయడం, వాటిపై పడిన మరకలు తొలగిపోవాలని గరుకైన స్క్రబ్బర్‌తో వాటిని రుద్దడం.. వంటివి చేస్తే వాటిపై ఉండే నాన్‌స్టిక్ కోటింగ్ తొలగిపోయి.. గీతలు పడతాయి. తద్వారా అవి త్వరగా పాడైపోతాయి.
⚛ సెరామిక్ పాత్రల్ని డిష్‌వాషర్‌లో వేయడం, వాటిని శుభ్రం చేయడానికి బ్లీచ్-ఆమ్ల గుణాలున్న పదార్థాల్ని వాడడం.. వంటివి చేసినా అవి త్వరగా పాడవుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.
సెరామిక్ పాత్రలు ఎక్కువ కాలం మన్నాలంటే వాటి ఉపయోగం, వాడకం.. వంటి విషయాల్లోనే కాదు.. వాటిని భద్రపరిచేటప్పుడూ పలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కడిగిన పాత్రల్ని తేమగా ఉన్నప్పుడు కాకుండా.. ఒక కాటన్ క్లాత్‌తో వాటిని పొడిగా తుడిచి.. కాసేపు గాలికి పూర్తిగా ఆరాకే వాటిని అల్మరాలో భద్రపరచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.