Published : 28/07/2021 15:44 IST

Work From Home : సవాళ్లను సవాల్‌ చేద్దాం!

ఇంటి నుంచి పని.. ఇది అనుకున్నంత ఈజీ కాదు! ఓవైపు ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు.. మరోవైపు ఆఫీస్‌ పనులు.. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలంటే కత్తి మీద సామే! దీనికి తోడు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే క్రమంలో పనులు, అదనపు బాధ్యతల రీత్యా అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇంత చేసినా కెరీర్‌లో ఎదుగుదల విషయంలో మహిళలకు మొండిచెయ్యే ఎదురవుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ఇన్ని సవాళ్ల మధ్య ధైర్యంగా ముందుకు సాగుతోన్న వారు కొందరైతే.. ఈ పనిభారం మా వల్ల కాదంటూ మధ్యలోనే ఉద్యోగానికి రాజీనామా చేస్తోన్న వారు మరికొందరు! ఏదేమైనా ఇలా వెనక్కి తగ్గడం కంటే ఇలాంటి సవాళ్లను సవాల్‌ చేసినప్పుడే కెరీర్‌లో దూసుకుపోగలం అంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. ఈ క్రమంలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకోమంటున్నారు. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

పంచుకుంటే తగ్గుతుంది!

కరోనా వచ్చినప్పట్నుంచి మహిళలపై పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పనులు, ఆఫీస్‌ పనుల్ని సమన్వయం చేసుకోలేక ఒత్తిడితో చిత్తవుతున్నారు అతివలు. ఇక పదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు కరోనా ముందు కంటే ఇప్పుడు అదనంగా ఐదు గంటలు ఇంటి పనుల కోసం వెచ్చించాల్సి వస్తోందని ఓ అధ్యయనం చెబుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇంట్లో పనులు వారికి ఊపిరి సలపకుండా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితి వారిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. అయితే దీన్ని అధిగమించాలంటే భార్యలు ఇంటి పనుల్ని భర్తలకు సమానంగా పంచడానికీ వెనకాడకూడదంటున్నారు నిపుణులు. ఇప్పటికే చాలామంది భర్తలు ఇంటి పనులు, వంట చేయడంలో భార్యలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. వీటితో పాటు పిల్లల బాధ్యతల్ని కూడా ఇద్దరూ సమానంగా చూసుకుంటే మహిళలకు అదనపు పనిభారం తగ్గుతుంది.. ఫలితంగా కెరీర్‌లోనూ వారు రాణించగలరు.

కష్టే ఫలి!

అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరుగుతున్నా, కెరీర్‌లో పురుషులతో సమానంగా రాణిస్తున్నా.. జీతం, ప్రమోషన్ల దగ్గరికొచ్చే సరికి మాత్రం ఉద్యోగినులకు మొండిచెయ్యే ఎదురవుతోందని చెప్పచ్చు. ఇక ఈ కరోనా కాలంలో ఇంటి నుంచి పనిచేస్తోన్న మహిళా ఉద్యోగినులపైనే ఎక్కువగా వేటు పడుతోంది. ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చినా, జీతభత్యాల్లో కోత విధించాల్సి వచ్చినా.. అంతిమంగా మహిళలపైనే వివక్ష చూపుతున్నాయి కొన్ని కంపెనీలు. అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగే అసహనానికి, నిరాశకు లొంగిపోతే కెరీర్‌లో ఉన్నతి సాధించలేమంటున్నారు నిపుణులు. దీన్ని అధిగమించే మార్గాల గురించి అన్వేషించమంటున్నారు. ఈ క్రమంలో పడే కష్టాన్నే నమ్ముకోమంటున్నారు. నిజంగా మనలో కష్టపడేతత్వం, నైపుణ్యాలుంటే.. ఈ కంపెనీ వాటిని గుర్తించకపోతే.. మరోచోట మీకు గుర్తింపు లభించచ్చు. అందుకే మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఫలితం కూడా పాజిటివ్‌గానే వస్తుంది.

ఒంటరితనాన్ని జయించాలంటే..!

ఇంటి పనులతో ఎంతగా సతమతమైనా, కుటుంబ సభ్యుల నుంచి తగిన ప్రోత్సాహం లేకపోయినా.. ఇలాంటి ప్రతికూలతలన్నీ ఆఫీస్‌కెళ్లగానే మర్చిపోయి హాయిగా కొలీగ్స్‌తో కలిసి పనిచేసుకుంటారు మహిళలు. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆ ఆప్షన్‌ కూడా లేకుండా చేసింది. ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు.. అన్నీ ఇంటి నుంచే అయ్యే సరికి స్నేహపూర్వక పని వాతావరణాన్ని మిస్సవుతున్నామంటున్నారు చాలామంది ఉద్యోగినులు. ఓ రకంగా ఇది తమలో ఒంటరితనాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి భావనతో పనిచేయడమంటే ఓ సవాలే అని చెప్పాలి. మరి, దీన్ని అధిగమించడం కూడా మన చేతుల్లోనే ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇంటి వాతావరణాన్నే స్నేహపూర్వకంగా మార్చుకోమంటున్నారు. ఆఫీస్‌ పనులున్నప్పుడు ఎలాగూ కొలీగ్స్‌తో/టీమ్‌తో జూమ్‌ కాల్స్‌లో మాట్లాడుతుంటాం.. ఇక ఖాళీ దొరికినప్పుడు పనులంటూ వాటినే పట్టుకొని అలసిపోకుండా కుటుంబ సభ్యులతో, పిల్లలతో సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా బూస్టర్‌ డోస్‌లా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

‘అన్నీ నేనే చేయాల’నుకోకండి!

ఉద్యోగినుల్లో ఉండే నాయకత్వ లక్షణాలు, అదనపు బాధ్యతల్ని అందిపుచ్చుకోవడం.. వంటివి కెరీర్‌ పరంగా వారి ఉన్నతికి కారణమైనా.. ఒక్కోసారి అవే మీకు సవాలుగా మారే అవకాశాలూ లేకపోలేదంటున్నారు నిపుణులు. ఎలాగూ ఇంటి నుంచే పని చేస్తున్నాం కదా అని కొందరు ఉద్యోగినులు అన్ని పనుల్ని తామే మీదేసుకొని చేయడం, తమపైనే అదనపు పనిభారం ఉన్నా.. వాటిని కొలిగ్స్‌తో పంచుకోకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితులే అటు మీకు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా సవాలు విసరచ్చు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే పనుల్ని పంచడం అలవాటుగా మార్చుకోమంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఆ రోజు మీరు చేయాల్సిన పనులు, కొలీగ్స్‌కి/మీ కింది ఉద్యోగులకు అప్పగించాల్సిన పనులు.. వంటివన్నీ షెడ్యూల్‌ వేసుకుంటారు కాబట్టి ఆయా పనుల్ని సహోద్యోగులతో పంచుకోవడం, మీ పైఅధికారులు అప్పగించిన పనుల్లోనూ ముందు చేయాల్సిన వాటికే ప్రాధాన్యమివ్వడం వల్ల మీపై పని భారం కాస్త తగ్గుతుంది. దాంతో ఉన్న పనిపై ఏకాగ్రత పెట్టి మంచి ఉత్పాదకతను అందించచ్చు. ఇది కెరీర్‌కూ ప్లస్‌ పాయింటే అని చెప్పచ్చు.

ఇవన్నీ చదువుతుంటే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా మీరు ఎదుర్కొంటోన్న సవాళ్లు గుర్తొస్తున్నాయా? అయితే అవేంటో? వాటిని మీరు ఎలా అధిగమిస్తున్నారో? మాతో పంచుకోండి. ఇలా మీరిచ్చే సలహాలు, సూచనలు మరెంతోమంది ఉద్యోగినులకు చిట్కాల్లా ఉపయోగపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి