ఆత్మన్ పూలకుండీలు సెలబ్రిటీలకూ నచ్చేస్తున్నాయ్!

ఇంట్లో అమ్మను చూసి ఆడపిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటి పని, వంట పని, అణకువగా మెలగడం.. ఇలా ప్రతిదీ అమ్మ నేర్పించే పాఠమే! అయితే కొంతమంది వీటిని ఒంటబట్టించుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.. వాటిలో సక్సెసవుతారు.

Published : 11 Sep 2021 14:00 IST

(Photo: Instagram)

ఇంట్లో అమ్మను చూసి ఆడపిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటి పని, వంట పని, అణకువగా మెలగడం.. ఇలా ప్రతిదీ అమ్మ నేర్పించే పాఠమే! అయితే కొంతమంది వీటిని ఒంటబట్టించుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు.. వాటిలో సక్సెసవుతారు. 26 ఏళ్ల చండీగఢ్ అమ్మాయి ఆత్మన్‌ సంధు కూడా ఇదే చేసింది. అమ్మను చూసి అలంకరణపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇందులోనే ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఆ ఆలోచనలకు ప్రతిరూపంగానే ఆకర్షణీయమైన పూల కుండీలు తయారుచేస్తోంది. పర్యావరణహితంగా, కిందపడ్డా పగిలిపోకుండా ఉండేలా తాను తయారుచేస్తోన్న పూలకుండీలు ఎంతోమంది సెలబ్రిటీల మనసు దోచుకుంటున్నాయి.. ఏడాది తిరక్కుండానే కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఆత్మన్‌ సంధు.. 26 ఏళ్ల ఈ చండీగఢ్ అమ్మాయికి చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలనేది కోరిక. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఇంటిని అందంగా అలంకరించే విషయంలో అమ్మను చూసి స్ఫూర్తి పొందిన ఆమె.. ఇంటీరియర్‌ డిజైనింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఇందులోనే తన బిజినెస్‌ కెరీర్‌ను వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. అలాగని అందరూ చేసేలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఇలా ఆలోచిస్తోన్న క్రమంలోనే ఎకో-ఫ్రెండ్లీ ప్లాంటర్స్‌ ఆలోచన తన మనసులో మెదిలిందంటోంది సంధు.

అమ్మను చూశాకే..!

దిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌-మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలోనే తన ఆలోచనకు పదును పెట్టానని చెబుతోంది. 
‘అమ్మను చూశాక ఇంటి అలంకరణపై నాకు మక్కువ పెరిగింది. ఇందులోనే ఏదైనా కొత్తగా, పర్యావరణహితంగా చేయాలనుకున్నా. అప్పుడొచ్చింది ఈ పూల కుండీల ఆలోచన. మార్కెట్లో దొరికే ప్లాంటర్స్‌ని ఓసారి పరిశీలిస్తే.. వాటి బరువు ఎక్కువ.. కింద పడితే పగిలిపోతాయి కూడా! అలాకాకుండా తక్కువ బరువుతో, కింద పడ్డా పగిలిపోకుండా, ఇంటి అలంకరణకు ఉపయోగించుకునే విధంగా ఆకర్షణీయమైన ప్లాంటర్స్‌ని తయారుచేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో పర్యావరణహితమైన పదార్థాల కోసం సుమారు మూడు నాలుగు నెలల పాటు అన్వేషణ సాగించా. ఫైబర్‌ గ్లాస్‌, ఇసుక, రెజిన్‌ (Resin), నీళ్లు.. వంటివి ఉపయోగించి వాటర్‌ప్రూఫ్‌, తేలికపాటి, కింద పడ్డా పగిలిపోని ప్లాంటర్స్‌ తయారుచేయచ్చన్న విషయం తెలుసుకున్నా..’ అంటూ తన ఐడియా గురించి చెప్పుకొచ్చింది సంధు.

రంగులతో హంగులు!

గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఈ పరిశోధనంతా కొనసాగించిన ఆమె.. ఈ ఏడాది జనవరిలో ‘shibui.india’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని, ‘shopshibui’ పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ఇలా తాను రూపొందించే ఎకో-ఫ్రెండ్లీ ప్లాంటర్స్‌ని అలాగే మార్కెట్లోకి తీసుకెళ్లకుండా రంగులద్ది మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకుంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న చేతి వృత్తుల కళాకారులు, రంగులద్దే కళాకారుల్ని సంప్రదించి వారికి ఈ పనిని అప్పగించింది. వాళ్లు తమ సృజనతో ఈ కుండీలకు రంగులద్దడం, విభిన్న డిజైన్లు వాటిపై తీర్చిదిద్దడం.. వంటివి చేస్తూ వాటిని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేసేవారు. ఇలా పూర్తిగా తయారైన ఈ ప్లాంటర్స్‌ని స్థానికంగా ఏర్పాటుచేసే ఎగ్జిబిషన్లలో అమ్మకానికి ఉంచడంతో పాటు తన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లోనూ విక్రయించడం మొదలుపెట్టిందామె. మొదట్లో కొన్ని అడ్డంకులు, సవాళ్లు ఎదురైనా అనతి కాలంలోనే తన వ్యాపారం సెలబ్రిటీలనూ చేరిందంటోంది సంధు.

సెలబ్రిటీల నుంచి ఆర్డర్లొస్తున్నాయ్!

‘నా బిజినెస్‌ను విస్తరించడానికి ప్రస్తుతం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లతో మమేకమయ్యా. మొదట్లో కొన్నాళ్లు వ్యాపారం బాగానే ముందుకు సాగినా.. లాక్‌డౌన్‌ సమయంలో ముడిసరుకుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్లాంటర్స్‌ని కొనేవారూ తగ్గిపోవడంతో ఒక దశలో వ్యాపారం ఆపేయాలన్న ఆలోచనలూ వచ్చాయి. కానీ అమ్మానాన్నలు నాపై నమ్మకముంచి నన్ను ప్రోత్సహించారు. ముందు నీపై నువ్వు నమ్మకం పెట్టుకోమని సూచించారు. బహుశా వాళ్ల మాట చలువ వల్లేనేమో ప్రస్తుతం నా వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగుతోంది. దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌.. వంటి నగరాల నుంచి ప్రస్తుతం నాకు ఆర్డర్లొస్తున్నాయి. అంతేకాదు.. సోహా అలీఖాన్‌, మహీప్‌ కపూర్‌.. వంటి తారలు కూడా ప్లాంటర్స్‌ కావాలంటూ ఆర్డర్లు పెడుతున్నారు. ప్రస్తుతం మా వద్ద పదికి పైగా కళాకారులు పనిచేస్తున్నారు. వీళ్లకు తోడు స్థానికంగా ఉన్న చేతివృత్తుల వారికీ ఈ నైపుణ్యాలు నేర్పిస్తూ వారికీ ఉపాధి కల్పిస్తున్నా..’ అంటోంది సంధు.

ప్రస్తుతం నెలకు సుమారు వంద ప్లాంటర్స్‌ దాకా తయారుచేసి విక్రయిస్తోన్న సంధు.. ముందు ముందు వీటిని పలు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్స్‌లోనూ అందుబాటులో ఉంచనున్నానని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్