ఆ శిఖరాగ్రంపై సూర్య నమస్కారాలు చేసింది!

మౌంట్‌ ఎల్‌బ్రస్‌... యూరప్‌ ఖండంలో అత్యంత ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. గడ్డ కట్టుకుపోయే చలి, విపరీతమైన గాలులు, క్షణక్షణానికి మారిపోయే వాతావరణం...ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు పర్వతారోహకుల శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తుంటాయి.

Updated : 16 Oct 2021 18:19 IST

(Photo: Twitter)

మౌంట్‌ ఎల్‌బ్రస్‌... యూరప్‌ ఖండంలో అత్యంత ఎత్తైన ఈ శిఖరాన్ని అధిరోహించడమంటే మామూలు విషయం కాదు. గడ్డ కట్టుకుపోయే చలి, విపరీతమైన గాలులు, క్షణక్షణానికి మారిపోయే వాతావరణం...ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు పర్వతారోహకుల శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తుంటాయి. అలాంటి ఈ ప్రమాదకరమైన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడమే కాదు...శిఖరాగ్రంపై సుమారు గంటపాటు సూర్య నమస్కారాలు చేసింది చండీగఢ్‌కు చెందిన రమన్‌జోత్‌ కౌర్‌.

ప్రతికూల పరిస్థితులను దాటి!

సముద్ర మట్టానికి సుమారు 18,510 అడుగుల ఎత్తులో ఉండే మౌంట్‌ ఎల్‌బ్రస్‌పై తరచుగా మంచు తుపానులు కూడా సంభవిస్తుంటాయి. రమన్‌ సాహస యాత్రకు ముందు రోజే ఈ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చిన ఐదుగురు పర్వతారోహకుల బృందం ఒక మంచు తుపానులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అందుకే ముందు జాగ్రత్తగా ఇద్దరు గైడ్లను తన వెంట తీసుకువెళ్లిందామె. మైనస్‌ 36 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు తోడు ఏమాత్రం అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితుల మధ్య తన ప్రయాణం కొనసాగించింది. అన్ని అవరోధాలను దాటి ఎట్టకేలకు శిఖరాగ్రాన్ని చేరుకుంది.

శిఖరాగ్రంపై సూర్య నమస్కారాలు!

సాధారణంగా శిఖరాగ్రాన్ని చేరుకున్న పర్వాతారోహకులు ఎక్కువ సేపు అక్కడ ఉండరు. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండేలా కొన్ని ఫొటోలు దిగి వెంటనే తిరుగు ప్రయాణమవుతారు. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత అత్యల్పంగా ఉంటుంది. దీనికి తోడు బలంగా వీచే గాలులు పర్వతారోహకుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అయితే తన సాహస యాత్ర మరింత ప్రత్యేకంగా ఉండాలని భావించిన రమన్‌...అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని సుమారు గంటపాటు సూర్య నమస్కారాలు చేసింది.

సాహస యాత్ర స్పెషల్‌గా ఉండాలనుకున్నాను!

‘నాకన్నా ముందు ఎందరో భారతీయులు మౌంట్ ఎల్‌బ్రస్‌ను అధిరోహించారు. అందుకే నా సాహస యాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నా. పైగా నాకు యోగా, సూర్య నమస్కారాలంటే బాగా ఆసక్తి. అందుకే శిఖరాగ్రానికి చేరుకున్నాక వీటిని చేద్దామనుకున్నాను. ఇందుకోసం అవసరమైన రక్షణ దుస్తులు, ఇతర ఏర్పాట్లు ముందుగానే సమకూర్చుకున్నాను. అయితే మా సాహస యాత్రకు ముందు రోజే ఐదుగురు పర్వతారోహకులు మంచు తుపానులో చిక్కుకొని మరణించారు. ఇది నన్ను కాస్త భయాందోళనలకు గురిచేసింది. అయితే నా యాత్రను మాత్రం ఆపలేకపోయింది. శిఖరాగ్రంపై సూర్య నమస్కారాలు చేయడం సరికొత్త అనుభూతినిచ్చింది..’ అని తన పర్వతారోహణ అనుభవాలను పంచుకుందీ యంగ్‌ మౌంటెనీర్‌.

నా తర్వాతి లక్ష్యం అదే!

25 ఏళ్ల రమన్‌జోత్‌ ప్రస్తుతం పంజాబ్‌ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అథ్లెటిక్స్‌, సాహస క్రీడలు, పర్వతారోహణ అంటే ఆమెకు ఎంతో ఆసక్తి. మారథాన్‌ రన్నర్‌గా పలు పోటీల్లో సత్తాచాటింది. మార్షల్‌ ఆర్ట్స్‌ కాంపిటీషన్లలోనూ రాణించింది. ఇక మౌంటెనీరింగ్‌లో బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు పూర్తిచేసిన ఆమె...2019 ఏప్రిల్‌లో కేవలం 24 గంటల్లోనే కిలిమంజారోను ఎక్కేసింది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన ఈ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన పర్వతారోహకుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. గతేడాది నవంబర్‌లో ‘ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివాలయం’ గా గుర్తింపు పొందిన ఉత్తరాఖండ్‌లోని తుంగ్‌నాథ్‌ యాత్ర పూర్తి చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహణతో పాటు పర్వతారోహకులందరూ కలలు కనే ‘అడ్వెంచరస్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసే పనిలో ఉందీ యంగ్‌ మౌంటెనీర్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్