Published : 10/11/2021 20:17 IST

బరువు తగ్గాలంటే వంటగదిని మార్చాల్సిందే!

బరువు తగ్గాలనుకునేవారు కేవలం వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు.. వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానాల్లో సైతం మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పద్ధతుల్లో సులభంగా బరువు తగ్గుతారు. ఇలా బరువు తగ్గించుకునే క్రమంలో వంటగది పాత్ర కూడా కీలకమే. ఏంటీ? బరువు తగ్గడానికి, వంటగదికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..

మనం బరువు తగ్గాలంటే ముందుగా చేయాల్సింది- ఉన్న దానికంటే అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తపడడం. అలా బరువు పెరగకుండా ఉండాలన్నా.. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో బరువు తగ్గాలన్నా మన ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ క్రమంలో వంటగది ముఖ్యపాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. మనకు కావాల్సిన ఆహారం రుచికరంగా వండుకోవడం దగ్గర్నుంచి వివిధ రకాల ఆహారపదార్థాలు, పండ్లు.. నిల్వ చేసుకోవడం వరకు అన్నీ వంటగదిలోనే జరుగుతాయి. అందుకే మారిన ఆహార అలవాట్లకు అనుగుణంగా వంటగదిలో కూడా అవసరమైన మార్పులు చేసుకోవాలి.

ఆరోగ్యకరమైనవి..

మామూలుగా వంటలకు అవసరమయ్యే వస్తువులన్నీ నచ్చినవి తీసుకొచ్చి వంటింట్లో సర్దేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు బరువు తగ్గాలనుకుంటున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మనకు అవసరమయ్యే వస్తువులు లేదా ఆహారపదార్థాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండే పదార్థాలను బయటకు కనిపించకుండా సర్దుకోవడం లేదా కొనుగోలు చేయకుండా ఉండటం వంటివి చేయాలి. అప్పుడే వంటింట్లో మన దృష్టి ఆరోగ్యకరమైన, తక్కువ క్యాలరీలుండే పదార్థాల మీదకు మళ్లుతుంది. ఫలితంగా అదనపు బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

ఫ్రిజ్‌లో..

ఫ్రిజ్‌లో కూడా క్యాలరీలు అధికంగా ఉండే ఆహారపదార్థాలకు చోటివ్వకూడదు. ఒకవేళ ఉంచినా వాటిని చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుని, శుభ్రం చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అలాగే నచ్చిన పండ్లు, కాయగూరలు ముక్కలుగా కోసుకుని బాక్సుల్లో వేసి ఫ్రిజ్ తలుపు తీయగానే కనిపించేలా ముందు వరుసలో పెట్టుకోవాలి. వీటిని రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో అమర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల స్నాక్స్ తినాలనిపించినప్పుడు వాటిని తినచ్చు.

కొలతలు..

వంట గదిలో మనం ఉపయోగించే చెంచాలు, గ్లాసుల మీద కొలతలు ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా వాటిని చూసినప్పుడల్లా బరువు తగ్గాలన్న విషయం గుర్తొచ్చి ఆహారం మితంగా తీసుకునే వీలు ఉంటుంది. దీనివల్ల మనల్ని మనం సులభంగా నియంత్రించుకుని బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

తినేటప్పుడు..

ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత వరకు చిన్నసైజు ప్లేట్లోనే తినడం మంచిది. అలాగే తినేటప్పుడు దగ్గర ఇష్టమైన ఇతర చిరుతిళ్లేవీ లేకుండా చూసుకోవాలి. భోజనం చేసే ముందు సలాడ్ తినడం వల్ల ఆకలి అదుపులో ఉండి ఆహారం మితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు కూడా..

* బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్యకరమైన తాజా ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

* వంట చేసేటప్పుడు ఎంత అవసరమో అంతే పరిమాణంలో ఆహారపదార్థాలు వండుకోవడం ఉత్తమం. అంతకంటే ఎక్కువగా వండటం వల్ల తినేటప్పుడు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో తీసుకునే ప్రమాదం ఉంటుంది.

* పండ్లు, కూరగాయల ముక్కల్ని స్నాక్స్‌గా తీసుకోవాలనుకునేవారు వాటిని నిర్ణీత పరిమాణాల్లో ముందుగానే ప్యాక్ చేసి ఉంచుకోవచ్చు.

* కేవలం ఫ్రిజ్‌లోనే కాదు.. వంట గదిలోని అల్మరాల్లో కూడా ఆరోగ్యవంతమైన ఆహారపదార్థాలే కనిపించేలా జాగ్రత్తపడాలి. ఉదయాన్నే ఉపయోగించే పాల దగ్గర్నుంచి ప్రతి దాంట్లోనూ తక్కువ క్యాలరీలు ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వంటగదిని ఆరోగ్యవంతమైన పదార్థాలతో అమర్చుకోవడం ద్వారా అదనపు క్యాలరీలు శరీరంలో చేరకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా బరువు తగ్గాలనుకునే లక్ష్యాన్ని మరింత తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని