అలా పొదుపు చేసి తొమ్మిదేళ్లలో రెండిళ్లు కొంది!

భవిష్యత్తు అవసరాల కోసం ఎంతోకొంత పొదుపు చేయాలంటారు ఆర్థిక నిపుణులు. కానీ, చాలామందికి వచ్చిన జీతం నెలవారీ ఖర్చులకే సరిపోతుంటుంది. కొంతమందికైతే క్రెడిట్‌ కార్డు బిల్లులు, EMIల వల్ల ఇలా జీతం రాగానే అలా ఖర్చవుతుంది. అయితే చైనాకి చెందిన ఓ మహిళ తన జీతంలో ప్రతి నెలా 90 శాతం వరకు దాచుకుంటూ 32 సంవత్సరాల వయసులో రెండు ఇళ్లను కొనుగోలు చేసింది.

Updated : 08 Nov 2021 17:33 IST

(Photo: Screengrab)

భవిష్యత్తు అవసరాల కోసం ఎంతోకొంత పొదుపు చేయాలంటారు ఆర్థిక నిపుణులు. కానీ, చాలామందికి వచ్చిన జీతం నెలవారీ ఖర్చులకే సరిపోతుంటుంది. కొంతమందికైతే క్రెడిట్‌ కార్డు బిల్లులు, EMIల వల్ల ఇలా జీతం రాగానే అలా ఖర్చవుతుంది. అయితే చైనాకి చెందిన ఓ మహిళ తన జీతంలో ప్రతి నెలా 90 శాతం వరకు దాచుకుంటూ 32 సంవత్సరాల వయసులో రెండు ఇళ్లను కొనుగోలు చేసింది. అది కూడా రద్దీ ప్రాంతమైన జియాంగ్‌సు ప్రావిన్సు రాజధాని నాన్‌జింగ్ పట్టణంలో. ఈ క్రమంలో ఆమె తన పొదుపు వివరాలను ఓ సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి, ఇంతకీ తను నెలకు ౯౦ శాతం మేర ఎలా పొదుపు చేయగలిగిందో చూద్దాం రండి..

డబ్బులు పైకి ఎగరేసేది!

చైనాకు చెందిన వాంగ్‌ షెనాయ్ (Wang Shenai) పేద కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్నప్పుడు వారి కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే ఆమెకు డబ్బు విలువ తెలిసేలా చేసింది. వాంగ్‌ తల్లి డబ్బులను ఫ్రిజ్‌లో దాచిపెట్టేదట. ఎప్పుడైనా పిల్లలకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటిని పైకి ఎగరేసి ఇచ్చేదట. దాని ఉద్దేశం డబ్బులు సంపాదించడం చాలా కష్టమని వారికి తెలియజేయడమే. ఈ అర్థిక ఇబ్బందులు, అనుభవాలే పెద్దైన తర్వాత ఎలాగైనా సొంతంగా ఇల్లు కొనాలనే ఆశయాన్ని కల్పించాయని చెబుతోంది వాంగ్.

ఆ సత్యం తెలుసుకున్నా!

ఈ క్రమంలో ఎన్నో కష్టాలను దాటుకుంటూ వాంగ్‌ డిజైనింగ్‌లో డిగ్రీ పట్టా పొందింది. తర్వాత ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాతే ఎక్కువగా ఖర్చు పెట్టడం మానేశానని చెబుతుంది వాంగ్. వ్యాపార సంస్థలు లాభాల కోసం తమ ఉత్పత్తులను కొనేవిధంగా ఏదోవిధంగా ప్రజలను ఆకర్షిస్తుంటాయని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అందుకు కారణమంటుంది వాంగ్.

కేవలం వాటినే మాత్రమే కొనేదాన్ని...

వాంగ్‌.. ధరించే దుస్తుల నుంచే తన పొదుపును మొదలుపెట్టింది. ఆమె బట్టలు బయట అస్సలు కొనదట. తన స్నేహితులు వేసుకున్న దుస్తులనే ఉపయోగించేది. ‘నేను సంవత్సరానికి సుమారు ౧౨౦౦ రూపాయల కన్నా తక్కువే దుస్తులపై ఖర్చు పెడతాను. అవి కూడా లోదుస్తుల కోసం మాత్రమే.. నాకు ఓ స్నేహితురాలు ఉంది.. తనకి దుస్తులు కొనడమంటే చాలా ఇష్టం. తను కొన్న దుస్తులను ఎక్కువగా వేసుకోకుండానే పక్కన పెట్టేస్తుంటుంది. తను ఉపయోగించిన దుస్తుల్లో నీకు నచ్చినది తీసుకోమని నాకు చెప్పేది’ అని వివరించింది.

ప్రజా రవాణాతోనే..

దుస్తుల తర్వాత తను ఎక్కువగా డబ్బులు ఆదా చేసింది రవాణా ఖర్చుల పైనే. వాంగ్‌ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రజా రవాణా వ్యవస్థనే ఉపయోగించుకునేదట. అలాగే ఇతర వస్తువులు కొనేటప్పుడు సైతం ఆన్‌లైన్‌లో దొరికే ఉచిత కూపన్లను ఎక్కువగా ఉపయోగించుకునేది. ఇక ఫర్నిచర్ లాంటి వస్తువులు సింహభాగం సెకండ్‌ హ్యాండ్‌వేనట. ఈ పద్ధతి వల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయ్యేదంటోంది వాంగ్.

‘కొంతమంది విపరీతంగా ఖర్చు చేయడం ద్వారా సంతోషపడుతుంటారు. నాకైతే, అలా చేస్తే కొంచెం కూడా సంతోషం ఉండదు. ఖర్చు చేయడం వల్ల నాలో తెలియని భయం, ఆందోళన కలుగుతుంటాయి. దానికి బదులు డబ్బులు పొదుపు చేస్తే కొంచెం భరోసా కలుగుతుంది’ అని చెబుతోంది.

అతను కూడా...

వాంగ్‌ తన జీవనశైలిని భర్తకు కూడా అలవాటు చేసింది. ‘నా భర్త పాత మొబైల్‌నే ఉపయోగిస్తున్నాడు. అందులో మెమరీ కొంచెమే ఉంటుంది. దాంతో Wechat (Social Media)ను ఉపయోగించుకుంటాడు. అది కూడా సమాజంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి  మాత్రమే..’ అని చెప్పుకొచ్చింది. ఇక పార్టీల పేరుతో స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడమంటే డబ్బులు వృథా చేయడమే అంటోంది వాంగ్.

‘ఇలా నా ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తొమ్మిది సంవత్సరాల నుంచి ఇదేరకమైన జీవనశైలిని పాటిస్తున్నాను. నా జీతంలో 90 శాతం సొమ్మును పొదుపు చేసుకుంటూ వచ్చాను. ఆ డబ్బులతోనే నాన్‌జింగ్ లో రెండు ఇళ్లను కొన్నా’ అని చెప్పుకొచ్చింది.
‘ఒక మహిళ సొంతంగా ఇంటిని కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యమైన విషయం. అది చిన్నదా? పెద్దదా? అనే విషయం కంటే సొంతమా? కాదా? అన్నదే ముఖ్యం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ఇల్లే మనకు ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది’ అని చెబుతోంది వాంగ్. స్వయంగా తను పెద్ద మొత్తంలో పొదుపు చేయడమే కాదు... ఓ ఆన్‌లైన్ గ్రూప్ ద్వారా మరెంతోమందికి పొదుపు పాఠాలు కూడా చెబుతోంది వాంగ్.

అయితే వాంగ్ పొదుపు పాఠాలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో- పొదుపు పేరుతో ఎవరో వాడిన దుస్తులు వాడడం ఏమిటి అంటూ కొందరు విమర్శిస్తే; ప్రతి విషయంలోనూ పొదుపు పాటిస్తూ జీతంలో ౯౦ శాతం మేర డబ్బు దాయడం అంత సులభం కాదంటున్నారు మరికొంతమంది.

మరి ఇంతకీ- వాంగ్ పొదుపు పద్ధతుల పైన మీ అభిప్రాయం ఏమిటి? అసలు పొదుపంటే ఎలా ఉండాలి? మీరు ఎలా పొదుపు చేస్తున్నారు... మాతో పంచుకోండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్