దుప్పట్లు సరిగా శుభ్రం చేస్తున్నారా..?

చాలా రోజుల పాటు శుభ్రం చేయని బెడ్‌షీట్లపై దుమ్ము-ధూళితో పాటు, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు పేరుకుపోతాయి. వీటిని వాడడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు, పలు చర్మ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం...

Published : 26 Jul 2022 22:09 IST

చాలా రోజుల పాటు శుభ్రం చేయని బెడ్‌షీట్లపై దుమ్ము-ధూళితో పాటు, కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు పేరుకుపోతాయి. వీటిని వాడడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో పాటు, పలు చర్మ సంబంధిత వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో- బెడ్‌షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.

ఎప్పుడెప్పుడు?

సాధారణంగా బెడ్‌షీట్లను వారానికి ఒక్కసారైనా ఉతకాలి. కొన్ని రకాల చర్మ వ్యాధులు లేదా ఇతర అనారోగ్యాలతో బాధపడే వారు క్రమం తప్పకుండా బెడ్‌షీట్లను మారుస్తూ ఉండాలి. అలాగే అందరూ వాడుకునేవి కాకుండా ప్రత్యేకంగా వారి కోసం కొన్ని బెడ్‌షీట్లను కేటాయించడం మంచిది.

కొంతమంది తమ పెంపుడు జంతువులను కూడా బెడ్ పైకి తీసుకురావడం, వారి పక్కనే పడుకోబెట్టుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఫలితంగా వాటి వెంట్రుకలు లేదా చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర క్రిములు బెడ్‌షీట్‌కి అంటుకునే ప్రమాదం ఉంది.. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు బెడ్‌ పైకి తీసుకురాకుండా చూసుకోవాలి. ఒకవేళ తీసుకొచ్చినా రెండురోజులకోసారి బెడ్‌షీట్‌ మార్చాలన్న విషయం మర్చిపోవద్దు.

ఎలా ఉతకాలి..?

దుప్పట్లను శుభ్రం చేసే క్రమంలో వేడినీళ్లను ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశించడంతో పాటు వాటికి అంటుకున్న మురికి త్వరగా వదిలిపోతుంది. అయితే ఈ సమయంలో బెడ్‌షీట్‌ నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ నాణ్యత గల బెడ్‌షీట్లను మరీ ఎక్కువగా వేడి చేసిన నీళ్లలో నానబెట్టడం వల్ల అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.. కాబట్టి అలాంటి వాటిని గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్‌ పౌడర్‌ వేసి కాసేపు నానబెట్టి ఆపై ఉతకాలి.

త్వరగా మురికి పోవాలని, సువాసన రావాలని కొంతమంది ఎంత పడితే అంత డిటర్జెంట్‌ పౌడర్‌ని వాడుతుంటారు. అయితే ఈ పౌడర్లను కూడా తగిన మోతాదులోనే ఉపయోగించాలి. ఎక్కువ మొత్తంలో పౌడర్లను ఉపయోగిస్తే అందులో ఉండే రసాయనాలు బెడ్‌షీట్‌ నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉంది.

ఇక ఉతికిన బెడ్‌షీట్లను ఎండలో ఆరేయాలి. ప్రత్యేకించి వర్షాకాలంలో ఎండ లేనప్పుడు డ్రయర్ వాడడం మంచిది. అవి సరిగ్గా ఆరకపోతే వాటి తడిదనం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్‌ వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఇవి కూడా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

ఇలా బెడ్‌షీట్లను ఉతికిన తర్వాత వాటిని ఐరన్‌ చేస్తే అందులో ఇంకా ఏమైనా క్రిములుంటే నాశనమవుతాయి.

ఈ జాగ్రత్తలు కూడా!

కొంతమంది బద్ధకంతో మేకప్‌ తొలగించుకోకుండానే పడుకుంటారు. తద్వారా మేకప్ అవశేషాలు బెడ్‌షీట్‌, దిండు కవర్‌కు అంటుకుంటాయి. ఇవి కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మేకప్ తొలగించుకున్నాకే పడుకోవడం వల్ల బెడ్‌షీట్‌ శుభ్రంగా ఉంటుంది.. మీకూ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

బయటి నుంచి వచ్చాక దుమ్ము-ధూళి చేరిన కాళ్లతోనే బెడ్‌పైకి ఎక్కడం మానుకోండి.. శుభ్రంగా స్నానం చేయడం లేదంటే చేతులు-కాళ్లు కడుక్కొని డ్రస్‌ మార్చుకున్న తర్వాతే బెడ్‌పై కూర్చోవడం ఉత్తమం.

కొందరికి బెడ్‌పైనే ఆహారం, స్నాక్స్‌.. వంటివి తినే అలవాటుంటుంది. తద్వారా ఆహార అవశేషాలు బెడ్‌షీట్‌పై పడి అపరిశుభ్రంగా మారతాయి. కాబట్టి బెడ్‌పై కూర్చొని తిన్నప్పటికీ బెడ్‌షీట్‌పై ఆహార పదార్థాలు పడకుండా చూసుకోవాలి.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో బెడ్‌షీట్లను శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్