Updated : 08/09/2021 18:44 IST

జిమ్‌కు వెళ్లకుండానే 15 కిలోలు తగ్గా..!

(Photo: Instagram)

భారతీ సింగ్‌.. బుల్లితెర ‘కామెడీ క్వీన్‌’గా మనందరికీ బాగా తెలిసిన పేరు. ఆమె కనిపించే ఏ కామెడీ షో అయినా తన అధిక బరువుపై కచ్చితంగా రెండో, మూడో జోకులు ఉండి తీరాల్సిందే. అయితే నటిగా వాటన్నింటినీ ఇంతదాకా సానుకూలంగా తీసుకున్నా.. ఇకపై మాత్రం అలాంటి జోకులు కుదరవంటోంది భారతి. అవసరమైతే స్ర్కిప్టు రైటర్స్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ గురించి డైలాగులు రాసుకోవచ్చంటోంది.

10 నెలల్లో 15 కిలోలు తగ్గింది!

‘ద గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’, ‘కామెడీ సర్కస్‌’, ‘ద కపిల్‌ శర్మ షో’ తదితర కార్యక్రమాలతో బాలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతి. సందర్భానికి తగ్గట్టుగా కామెడీ పంచులు వేస్తూ టీవీ షోలను రక్తికట్టించడంలో ఆమె సిద్ధహస్తురాలు. అయితే అది ఏ కార్యక్రమమైనా భారతి అధిక బరువు గురించి కొన్నైనా జోకులు, డైలాగులు ఉండాల్సిందే..! ఇప్పటిదాకా వాటన్నంటినీ సానుకూలంగా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అధిక బరువే తనకు అందమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కానీ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతోన్న ఈ లాఫ్టర్‌ క్వీన్‌ గతేడాది నుంచి బరువు తగ్గే పనిలో పడింది. ఈ క్రమంలోనే గత10 నెలల కాలంలో 15 కిలోల బరువును తగ్గించుకుంది. గతంలో 91 కేజీల బరువుతో ఎంతో బొద్దుగా కనిపించిన ఈ అందాల తార.. ఇప్పుడు 76కిలోలతో కాస్త నాజూగ్గా, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ సందర్భంగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఆరోగ్యంగా ఉండడానికే బరువు తగ్గాను!

‘నేను చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉన్నాను. బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోవాలన్న ఆలోచనలెప్పుడూ నాకు రాలేదు. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆస్తమా, మధుమేహం  నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. కనీసం నా పనులు కూడా నన్ను చేసుకోనివ్వకుండా వేధించాయి. అందుకే నా డైట్‌ విషయంలో కొన్ని మార్పులు చేసుకున్నాను. అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి.. స్లిమ్‌గా మారడానికి నేను ఈ మార్పులు చేసుకోలేదు. ఫిట్‌గా మారి ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను.’

దానివల్లే సాధ్యమైంది!

‘ఇప్పటిదాకా నా శరీరం గురించి, బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఒక క్రమ పద్ధతి లేకుండా ఎలా పడితే అలా తిన్నాను. ముఖ్యంగా శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన అర్ధరాత్రి వేళల్లో ఎక్కువగా తిని నా బాడీని బాగా ఇబ్బంది పెట్టాను. అయితే ఇదెంత తప్పో తర్వాతే తెలిసొచ్చింది. దీని కారణంగానే మధుమేహం బారిన పడ్డాను. దీనికి తోడు ఆస్తమా నన్ను ప్రశాంతంగా షూటింగ్‌ చేసుకోనివ్వలేదు. చిన్న చిన్న పనులకే అలసిపోయేదాన్ని. అప్పుడే నా ఇబ్బందిని గమనించిన నా భర్త హర్ష్‌ లింబాచియా ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ గురించి నాకు సూచించారు. ఇందులో భాగంగా రోజూ రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉపవాసం పాటించడం మొదలుపెట్టాను.’

అర్ధరాత్రి మ్యాగీ తినేదాన్ని!

‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ పాటించడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. దీనిని ప్రారంభించిన మొదటి 10-15 రోజుల్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అర్ధరాత్రి వేళల్లో ఆకలికి తట్టుకోలేక మ్యాగీ చేసుకుని తినేదాన్ని. అది కూడా లేకపోతే డిన్నర్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకునేదాన్ని. అయితే క్రమంగా ఈ అలవాట్లన్నీ వదిలించుకున్నాను. బరువు తగ్గడం కోసం ప్రత్యేకంగా నేను ఎలాంటి డైట్‌ తీసుకోలేదు. నేను పంజాబీ కాబట్టి రెగ్యులర్‌గా పరాఠాలు తింటాను. వీటితో పాటు గుడ్లు, దాల్‌-సబ్జీ, Kadhi Chawal, టీ, కాఫీలనే తీసుకుంటాను. ఇప్పుడు ఫ్యాన్సీ ఫుడ్స్‌పై నాకెలాంటి ఆసక్తి లేదు. ముఖ్యంగా రాత్రి 7గంటల తర్వాత ఆహారం తీసుకోవడానికి నా శరీరం ఏ మాత్రం ఇష్టపడడం లేదు.’

అమ్మను కావాలనుకుంటున్నా!

‘బరువు తగ్గించుకోవడంలో భాగంగా నేను ఎలాంటి వ్యాయామాలు కూడా చేయలేదు. ఎందుకంటే నేను జిమ్‌ పర్సన్‌ని కాను. నా భర్త అందించిన ప్రోత్సాహంతోనే నేను ఇలా ఫిట్‌గా, హెల్దీగా మారాను. ఇప్పుడు నేను బయటిఫుడ్‌ను కూడా అనుమతించడం లేదు. దీంతో మా ఆయన కాస్త చిరాకు పడుతున్నాడు(నవ్వుతూ). బరువు తగ్గడంతో పాటు ఈ లాక్‌డౌన్‌లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. మనల్ని మనం ప్రేమించుకుంటూనే కుటుంబానికి ప్రాధాన్యమివ్వడమెలాగో ఈ ఖాళీ సమయంలో నాకు తెలిసొచ్చింది. ఇప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుంటుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఎంతో తేలికగా ఉన్నట్లనిపిస్తోంది. ఇక గతంలో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకున్నా కొన్ని కారణాలతో వెనక్కి తగ్గాను. ఇప్పుడు అమ్మగా ప్రమోషన్‌ పొందేందుకు మళ్లీ ప్రణాళికలు వేసుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

బరువు తగ్గి నాజూగ్గా మారిన భారతి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఆమె వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి తెలుసుకొని చాలామంది స్ఫూర్తి పొందుతున్నారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి