Published : 22/11/2021 21:16 IST

మధుమేహులు పండ్లు తినొచ్చా?!

మధుమేహులు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉండేందుకు తీసుకునే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే ఈ క్రమంలో కొంతమందిలో కొన్ని రకాల అపోహలు, సందేహాలు నెలకొన్నాయి. ‘చక్కెరకు బదులుగా ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ తీసుకోవచ్చా?’, ‘పండ్లు తినడం మంచిదేనా?’, ‘మందులు వాడినా పథ్యం చేయాలా?’.. ఇలాంటి ప్రశ్నలెన్నో వారి మెదడును తొలిచేస్తుంటాయి. మరి, ఇలాంటి సందేహాలపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

కార్బోహైడ్రేట్లను పక్కన పెట్టాలా?

మధుమేహుల్లో చాలామంది కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తి దూరం పెడుతుంటారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్లను శరీరం గ్లూకోజ్‌గా మార్చుతుంది.. తద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయన్న భయమే ఇందుకు కారణం. అయితే అన్ని కార్బోహైడ్రేట్లూ ఈ సమస్యను తెచ్చిపెట్టవంటున్నారు నిపుణులు. కాయగూరలు, పండ్లు, నట్స్‌, గింజలు.. వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మోతాదులో ఈ పోషకాలను అందించచ్చు. అదే పాస్తా, వైట్‌ బ్రెడ్‌, సెరెల్స్‌.. వంటి అనారోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయుల్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికీ మంచివి కావు. కాబట్టి కార్బోహైడ్రేట్లను తీసుకునే విషయంలో ఇవి గుర్తుంచుకోవడం ఉత్తమం.

ఆ ప్రత్యామ్నాయాలు మంచివేనా?

డయాబెటిస్ బాధితుల్లో చాలామంది చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ వాడుతుంటారు. అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలని కఠినమైన ఆహార నియమాలు పాటించేవారు వీటిని దూరం పెట్టడమే మంచిదని చెబుతోంది ఓ అధ్యయనం. అంతేకాదు.. వీటిని మోతాదుకు మించి తీసుకున్నా మధుమేహం ఎక్కువవడంతో పాటు స్థూలకాయం బారిన పడే ప్రమాదమూ ఉందంటోంది. ఒకవేళ కచ్చితంగా తీసుకోవాలనుకుంటే స్టీవియా, డేట్‌ షుగర్‌.. వంటివి ఎంచుకోమంటున్నారు నిపుణులు.

పండ్లు తినడం మంచిదా? కాదా?

నిజానికి మధుమేహులకు పండ్లు మేలే చేస్తాయంటోంది అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ‘టైప్‌-2 మధుమేహం’ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతోంది. అయితే ఈ క్రమంలో ఆయా పండ్ల గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు పరిగణనలోకి తీసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు నిపుణులు. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి (20-69) ఉన్న పండ్లు.. ఉదాహరణకు - యాపిల్స్‌, అవకాడో, బ్లాక్‌బెర్రీస్‌, చెర్రీస్‌, కివీ, ద్రాక్ష, అరటిపండ్లు.. వంటివి తీసుకోవడం మేలంటున్నారు. అయితే అతి అనర్థం అన్నట్లు పండ్ల విషయంలోనూ మోతాదుకు మించకుండా తీసుకోవడం మర్చిపోవద్దు.

మందులు వాడుతూ స్వీట్స్‌ తినచ్చా?

మందులు వాడుతున్నాం కాబట్టి స్వీట్స్‌ తిన్నా మధుమేహం అదుపులోనే ఉంటుందనుకుంటారు కొంతమంది. కానీ ఇలాంటి నిర్లక్ష్యం పనికి రాదంటున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక సమస్య కాబట్టి దీన్ని అదుపులో ఉంచుకోవడానికి వేసుకునే మందులు ఎంత కీలకమో.. తీసుకునే ఆహారమూ అంతే ముఖ్యమంటున్నారు. చక్కెరలు అధికంగా ఉండే స్వీట్స్‌ని అమితంగా తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదంటున్నారు. కాబట్టి ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో అది కూడా మోతాదులో స్వీట్స్‌ తీసుకుంటూ మనసును తృప్తి పరచుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం!

అయితే ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకున్నప్పటికీ.. మితంగా తీసుకుంటూ.. మోతాదు గురించి నిపుణులను అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. తద్వారా ఇటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.. అటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండానూ జాగ్రత్తపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని