Published : 19/09/2022 19:47 IST

ఫ్రెండ్సే ఇబ్బంది పెడుతున్నారా?

పంతొమ్మిదేళ్ల విద్య ఇంజినీరింగ్ చదువుతోంది. కాస్త నెమ్మదస్తురాలు కావడంతో తోటి విద్యార్థినులు ఆమెను ఎక్కువగా ఆటపట్టిస్తుంటారు. వారి ప్రవర్తన తనకు ఇబ్బంది కలిగిస్తున్నా.. ఏమీ అనలేక మౌనంగా భరిస్తోంది. అయితే మాటిమాటికీ తన విషయంలో చేస్తున్న అల్లరిని చూసి తట్టుకోలేకపోతోంది. కానీ ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. అటు వారి అల్లరిని సహించలేక, ఇటు ఏం చేయాలో పాలుపోక తెగ సతమతమైపోతోంది. విద్యలాంటి పరిస్థితి చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటూ ఉంటారు.

చీటికీ మాటికీ జోకులేయడం.. హేళన చేయడం.. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి గొడవ పడడం..  లాంటివి సహాధ్యాయులు చేస్తూ ఉంటారు. అంతేకాదు.. తాజాగా మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయ ప్రాంగణ వసతిగృహంలో- అమ్మాయిలు స్నానం చేస్తుండగా మరో అమ్మాయే తన ఫోన్‌తో ఫొటోలు/వీడియోలు తీయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో- ఫ్రెండ్స్ విషయంలో ఎలా మసలుకోవాలో అమ్మాయిలందరూ తెలుసుకుని ఉండాలి..

చెప్పి చూడాలి..!

స్నేహితులు, సహాధ్యాయుల ప్రవర్తనతో విసిగిపోయేవారిలో ఎక్కువగా మృదుస్వభావులే ఉంటారు. ఇలాంటి వారు ఎవరి మీదైనా కోపమొస్తే లోలోపల బాధపడతారే తప్ప పైకి ప్రదర్శించరు. కానీ ఇలా చేయడం వల్ల మనసుపై ఎంతో ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే మీ స్నేహితుల ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ముందు వారికి సున్నితంగా చెప్పాలి. ఇలా చేస్తే వారిలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది తమ సహాధ్యాయుల దగ్గర నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా.. అవతలి వారు ఏమనుకుంటారో అని మొహమాటపడి స్పందించరు. తమకు ఇబ్బంది కలుగుతున్నా మనసులోనే పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చదువుపై శ్రద్ధ పెట్టలేం. అందుకే మీ క్లాస్‌మేట్స్ నుంచి మీకు చిన్న ఇబ్బంది ఎదురైనా అలా ప్రవర్తించడం తగదని వారికి వెంటనే చెప్పండి. దీనివల్ల అప్పటికి ఫలితం కనిపించకపోయినా.. క్రమంగా వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

కోపం వద్దు..

కొంతమంది సీనియర్స్, జూనియర్స్, క్లాస్‌మేట్స్ అనే తేడా లేకుండా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతూ ఉంటారు. ఈ క్రమంలో మనతో బాగా మాట్లాడుతున్నారు కదా.. అని కొందరు అన్ని విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఎలాంటి తప్పు చేయకపోయినా మనపై కొన్ని రూమర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా కాస్త సహనంతో, తెలివిగా వ్యవహరించాలి. లేదంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని బాధని మనసులోనే పెట్టుకొని కుమిలిపోమని కాదు. సందర్భానికి తగిన విధంగా స్పందించడం మంచిది. వీలుంటే ఈ విషయంలో అధ్యాపకులు, స్నేహితుల సహకారం తీసుకోవడం మంచిది.

జాబితా రూపొందించి..

కాలేజీలో ఎప్పుడైనా స్నేహితుల వల్ల బాగా ఇబ్బంది పడే సందర్భాలు ఎదురైనా, వారు కోపం తెప్పించే పనులు చేసినా.. వారిపై వెంటనే కోపం చూపించలేం. దీనికి స్నేహం చెడిపోతుందనే ఆలోచన కూడా కారణం కావచ్చు. అలాంటప్పుడు వారికి ఈ విషయం గురించి సున్నితంగా చెప్పాలి. అయినా మనసులో ఉన్న కోపం అన్ని సందర్భాల్లోనూ తగ్గదు. అందుకే మీకు ఆ రోజు కోపం తెప్పించిన పనులన్నీ ఓ కాగితంపై రాయండి. అలాగే దానికి కారకులైన వారి గురించి రాయాలి. అంతేకాకుండా ఆ పరిస్థితి ఎదురవడంలో మీ పాత్ర ఎంతవరకు ఉందో దాన్ని కూడా నిజాయతీగా రాయాలి. ఫలితంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలుస్తుంది. భవిష్యత్తులో దాన్ని పునరావృతం కాకుండా చూసుకుంటే మీరు జాబితా తయారు చేసే క్రమంలోనే మీకు వచ్చిన కోపం తగ్గిపోతుంది.

మరీ ఎక్కువైతే..!

ఎన్నిసార్లు చెప్పినా మీ సహాధ్యాయుల ప్రవర్తనలో మార్పు రాకపోతే.. వారి గురించి ఫిర్యాదు చేయడం మంచిది. అయితే చాలామంది మనసులో ఈ ఆలోచన ఉన్నా.. కంప్త్లెంట్ చేస్తే మన గురించి మిగిలినవారు ఏమనుకుంటారో.. అంతా కలిసి నాతో మాట్లాడడం మానేస్తారేమో లేక నన్ను ఇంకా వేధిస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఇలాంటి అనవసరపు భయాలను వదిలేసి ధైర్యంగా ముందడుగు వేయాలి. దీనివల్ల మీ సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు ప్రశాంతంగా కాలేజీకి వెళ్లి రావడానికి అవకాశం లభిస్తుంది.

అలాంటి వాళ్లకు దూరంగా..

అలాగే- ఫ్రెండ్స్‌గా నటిస్తూనే మనల్ని తప్పుదోవ పట్టించేవాళ్లు, మన వెనక గోతులు తీసేవాళ్లు కూడా ఉండకపోరు. అలాంటి వాళ్లని ముందే గుర్తించి వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా- ప్రత్యేకించి హాస్టల్లో ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్‌లో ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉంటారు. ఎవరెలాంటి వాళ్లో గుర్తించకపోతే చాలా ప్రమాదం. అందుకే ఫ్రెండ్స్ విషయంలో సైతం ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి