Updated : 29/06/2021 20:18 IST

మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా?

మనందరిలాగే సంహితకు కూడా మామిడి పండ్లంటే మహా ఇష్టం. అలాగని ఎక్కువగా తినాలనిపించినా ఆ కోరికను అదుపు చేసుకుంటుంది. ఇందుకు కారణం తనకు ఇప్పటికే మొటిమల సమస్య ఉండడమే!

వేదిక ఇప్పుడు ఏడు నెలల గర్భిణి. ఈ సమయంలో మామిడి పండ్లు తింటే వేడి చేస్తుందని వాళ్లమ్మ చెప్పడంతో ఈ సీజన్‌లో వాటికి పూర్తి దూరంగా ఉందామె.

వేసవి కాలంలో విరివిగా వచ్చే మామిడి పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! సీజన్‌ పూర్తయ్యేకల్లా వాటిని అమితంగా తినేస్తూ మనసును తృప్తి పరచుకుంటాం. అయితే కొంతమంది మాత్రం ఈ పండు తింటే వేడి చేస్తుందని, ఇందులో అధిక చక్కెరలు, కొవ్వు పదార్థాలు ఉన్నాయని.. వీటిని పూర్తిగా దూరం పెడతారు.. మరికొంతమంది తినాలనిపించినా ఆ కోరికను అదుపు చేసుకుంటూ చాలా మితంగా తింటుంటారు. మరి, నిజంగానే మామిడి పండు తింటే వేడి చేస్తుందా? వీటిలోని అధిక కొవ్వులు బరువు పెరిగేలా చేస్తాయా? ఇలా చాలామందిలో నెలకొన్న సందేహాలపై నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

మామిడి పండు తింటే మొటిమలొస్తాయి.

మామిడి పండ్లు వేడి చేస్తాయని, వాటిని తినడం వల్ల శరీరంలో వేడి పెరిగి.. ఫలితంగా మొటిమలొస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. ఇంకా చెప్పాలంటే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు.. వంటివన్నీ చర్మ ఆరోగ్యానికి మరింతగా దోహదం చేస్తాయంటున్నారు. అయితే ఇప్పటికే మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలతో బాధపడే వారు వీటిని మరీ ఎక్కువగా తీసుకోకుండా మితంగా తినడం ఉత్తమం అని చెబుతున్నారు.

మధుమేహం ఉంటే మామిడి పండ్లు తినకూడదు.

ఇది కొంత వరకు నిజమే అయినా.. మితంగా తింటే ఎలాంటి సమస్యా ఉండదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణంగా మధుమేహంతో బాధపడే వారికి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ 55 కంటే తక్కువగా ఉండే పండ్లను తీసుకోమని సూచిస్తారు వైద్యులు. అయితే మామిడి పండు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ విలువ 51. కాబట్టి ఈ పండును మధుమేహులు నిస్సందేహంగా తీసుకోవచ్చంటున్నారు.

ఈ పండ్లు తింటే బరువు పెరుగుతాం.

మామిడి పండ్లలో క్యాలరీలు, చక్కెరలు అధిక మొత్తంలో ఉన్న మాట వాస్తవమే.. అలాగని దాని అర్థం బరువు పెరుగుతామని కాదు.. మితంగా తీసుకున్నంత వరకు ఈ పండ్లు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ‘ఎ’, ‘సి’ విటమిన్లు.. ఐరన్‌, పొటాషియం, కాపర్‌, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు.. వంటివన్నీ శరీరానికి తగిన మోతాదులో వీటి నుంచే అందుతాయట! కాబట్టి వీటిని పక్కన పెట్టి మామిడి పండ్లు తినాలన్న కోరికను చంపుకోకుండా.. మితంగా ఈ పండ్ల రుచిని ఆస్వాదించమంటున్నారు.

గర్భంతో ఉన్నప్పుడు వీటిని తీసుకోవద్దు!

నిజానికి ఇది చాలామందిలో ఉన్న అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులోని పోషకాలు సాధారణ వ్యక్తులకు ఎంత అవసరమో.. గర్భిణులకూ అంతే అవసరం! అయితే ఇప్పటికే అధిక బరువు, జెస్టేషనల్‌ డయాబెటిస్‌తో బాధపడే గర్భిణులు వీటిని అమితంగా కాకుండా మితంగా.. అది కూడా పగటి పూట వారి న్యూట్రిషనిస్ట్‌ సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం. తద్వారా ఇటు మామిడి పండు తినాలన్న కోరికా తీరుతుంది.. అటు ఎలాంటి సమస్యా ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

వేసవిలో మామిడి పండు మరింత వేడి చేస్తుంది.

మన జీర్ణ వ్యవస్థ తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడం, దాన్ని శక్తిగా మార్చడంలో ఎంత బిజీగా ఉంటే శరీరంలో అంత వేడి జనిస్తుందంటున్నారు నిపుణులు. అంటే వేళాపాళా లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి నమలడం, అమితంగా ఆహారం తీసుకోకూడదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతేతప్ప మామిడి పండ్లు తినడానికి, శారీరక వేడికి సంబంధమే లేదంటున్నారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండడం ఉత్తమం అంటున్నారు. ఇంకా ఈ విషయంలో మీకు సందేహంగా ఉంటే.. మామిడి పండ్లను కాసేపు చల్లటి నీటిలో నానబెట్టి.. ఆపై తీసుకుంటే చలువ చేస్తుందని సలహా ఇస్తున్నారు.

ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.

మామిడి పండ్లు పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టమంటున్నారు నిపుణులు. అప్పుడే అవి మరింత రుచిగా ఉంటాయంటున్నారు. అలాగే ఈ పండ్లకు ఎంత గాలి తగిలితే అవి అంత తాజాగా, రుచిగా ఉంటాయట! కాబట్టి వీటిని ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగుల్లో అస్సలు నిల్వ చేయకూడదని, తద్వారా అవి త్వరగా పాడైపోతాయని చెబుతున్నారు.

సో.. ఇవండీ.. మామిడి పండ్ల గురించి చాలామందిలో ఉండే సందేహాలు/అపోహలు.. వాటి వెనకున్న అసలు వాస్తవాలు. అయితే వీటిని ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏ సమయంలో తింటే మంచిది? అన్న విషయాలు పోషకాహార నిపుణుల్ని అడిగి తెలుసుకోవచ్చు.. ఫలితంగా వీటితో ఆరోగ్యపరంగా, సౌందర్య పరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని