Updated : 17/08/2021 12:40 IST

గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటే ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరా?

స్నిగ్ధకు ఇటీవలే పెళ్లైంది. ఓ ఏడాది పాటు పిల్లలు వద్దనుకున్న ఆమె గర్భ నిరోధక మాత్రలు వాడుతోంది. అయితే వాటి వల్ల ఇతర సంతాన సమస్యలేవైనా వస్తాయేమోనని భయపడుతోంది. ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌తో బాధపడుతోన్న రోహిణి డాక్టర్‌ సలహా మేరకు కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వాడుతోంది. అయితే ఈ మధ్య క్రమంగా బరువు పెరుగుతోన్న ఆమె ఇదంతా ఈ మాత్రల వల్లేనేమోనని అనుకుంటోంది. అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి, నెలసరి సమస్యలతో బాధపడుతోన్న వారికి కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ ఒక ప్రత్యామ్నాయం. అయితే వీటిని వాడడం వల్ల భవిష్యత్తుల్లో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని, బరువు పెరుగుతామేమోనని, మధ్యమధ్యలో వీటిని మిస్‌ చేసినా పర్లేదని.. ఇలా ఈ మాత్రల గురించి ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన అపోహ నెలకొంది. మరి, ఇలా కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌పై నెలకొన్న సాధారణ అపోహలేంటి? వాటి గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

ఎలా వాడాలంటే..!

గర్భ నిరోధక మాత్రల్లో చాలా వరకు కాంబినేషన్‌ పిల్స్‌గానే లభిస్తాయి. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్లు కలగలిసిన ఈ మాత్రలు రెండు విధాలుగా గర్భం ధరించకుండా అడ్డుకుంటాయి. అండోత్పత్తి సమయంలో అండం విడుదల కాకుండా చేయడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉండే శ్లేష్మాన్ని చిక్కగా చేసి వీర్యం గర్భాశయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.. ఇలా రెండు రకాలుగా కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగపడతాయి. వీటిని 21, 24, 28 రోజుల రుతుచక్రం ఉండే వారు రోజుకొకటి చొప్పున ఒకే సమయానికి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎవరికి వారు సొంతంగా కాకుండా ముందుగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాడాలని సూచిస్తున్నారు నిపుణులు.

కొన్ని అపోహలు - వాస్తవాలు

గర్భ నిరోధక మాత్రల వల్ల బరువు పెరుగుతాం. మొటిమలు, అవాంఛిత రోమాలొస్తాయి. మొదటి తరం కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ వల్ల అరుదుగా అధిక బరువు సమస్య ఎదురైందంటున్నారు నిపుణులు. వాటివల్ల శరీరంలో నీటి శాతం పెరిగి తద్వారా అధిక బరువు సమస్యకు దారి తీసిందంటున్నారు. అయితే కొత్త ఫార్ములా మందుల వల్ల బరువు, మొటిమలు, అవాంఛిత రోమాల సమస్యలు లేవని చెబుతున్నారు. పైగా ఇవి పీసీఓఎస్‌ ఉన్న వారిలో బరువు తగ్గేందుకు దోహదపడడంతో పాటు మొటిమలు రాకుండా చేస్తున్నాయట!

మధ్యమధ్యలో ఈ మాత్రలు వేసుకోకపోయినా పర్లేదు

ఇది పూర్తిగా అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ని మధ్యమధ్యలో ఆపేయడం వల్ల అవాంఛిత గర్భధారణ జరగొచ్చు. అలాగే నెలసరితో సంబంధం లేకుండా స్పాటింగ్‌, బ్లీడింగ్‌.. వంటివీ ఎదురవుతాయి. కాబట్టి మీకు తెలిసో తెలియకో ఈ మాత్రల్ని మానేసినట్లయితే దానివల్ల కలిగే పర్యవసానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. తద్వారా అవాంఛిత గర్భధారణను అడ్డుకునే అవకాశాలుంటాయి.
వీటిని ఎవరికి వారే కొనుక్కొని వేసేసుకోవచ్చు.

గర్భ నిరోధక మాత్రలు సురక్షితమైనవే అయినా.. వాడే ముందు మాత్రం మీ ఆరోగ్యస్థితిని నిపుణుల వద్ద పరీక్షించుకొని వారి సలహా మేరకు మాత్రమే వాడాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తం గడ్డకట్టే సమస్య ఉన్న వారు, స్థూలకాయులు, ధూమపానం అలవాటున్న వారిలో ఇవి తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయట. అందుకే అలాంటి వారికి ఈ మాత్రలు సరిపడకపోవచ్చంటున్నారు నిపుణులు. అయితే కచ్చితంగా వాడాలంటే మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

ఎక్కువ రోజులు వాడితే సంతాన సమస్యలొస్తాయి

సంతాన సమస్యలకు కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌కి అసలు సంబంధమే లేదని, అలా అనడానికి ఎలాంటి ఆధారమూ లేదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ కోర్సు పూర్తయ్యాక పిల్స్‌ని ఆపేస్తే ప్రెగ్నెన్సీ రావడానికే ఎక్కువ శాతం అవకాశాలున్నాయంటున్నారు. అందుకే గర్భం వద్దనుకుంటే ఒక్క రోజు కూడా మానకుండా మాత్ర వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో మాత్రలు వేసుకోవడం ఆపేసినా త్వరగా గర్భం ధరించకపోవచ్చు. అందుకు వారికి గతంలో నెలసరి సమస్యలుండడం, వయసు పైబడడం, సహజసిద్ధంగా గర్భం ధరించలేకపోవడం.. వంటివి కారణాలు కావచ్చట!

గర్భ నిరోధక మాత్రల వల్ల క్యాన్సర్‌ వస్తుంది

ఇది కొంతవరకు నిజమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ మాత్రలు చాలా అరుదుగా రొమ్ము క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌కు కారణమవ్వచ్చట! ఈ మాత్రలు వాడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ రేటు అతి స్వల్పంగా పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అది కూడా కొన్ని రకాల పిల్స్‌ వాడడం వల్లేనట! అందుకే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సురక్షితంగా గర్భ నిరోధక మాత్రలు వాడాలంటే నిపుణుల సలహాలు పాటించడం ఒక్కటే మార్గం. అయితే కొన్ని రకాల మాత్రలు లైంగికాసక్తిని తగ్గించడం, అలసట, నీరసం, రుతుచక్రం మధ్యలో బ్లీడింగ్‌ కావడం.. వంటి దుష్ప్రభావాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఏదేమైనా సొంత వైద్యం కాకుండా వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని వాడాలని మరీ మరీ చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని