Updated : 21/10/2021 19:37 IST

మెనోపాజ్ దశలో లైంగిక కోరికలు తగ్గితే...

44 ఏళ్ల కవితకు ఈ మధ్య నెలసరి క్రమం తప్పుతోంది.. దాంతో పాటు విపరీతమైన చెమటలు, నీరసం.. వంటివి ఆమెను వేధిస్తున్నాయి. ఇవి మెనోపాజ్‌ లక్షణాలే అని తెలిసినా దానికింకా సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తోందామె.

సవితకు పదేళ్లు నిండకముందే పిరియడ్స్‌ మొదలయ్యాయి. ఇప్పుడు తనకు 28 ఏళ్లు. అయితే ఇలా చిన్న వయసులోనే రుతుచక్రం మొదలైతే మెనోపాజ్‌ కూడా త్వరగా వస్తుందని ఎవరో చెప్పడంతో తెగ కంగారు పడిపోతోందామె.

మెనోపాజ్‌కు చేరువవుతోన్న మహిళలు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, వేడి ఆవిర్లు, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం, మూడ్‌ స్వింగ్స్‌.. వంటి లక్షణాలతో బాధపడడం ఒకెత్తయితే.. ఈ దశ గురించి వారిలో నెలకొన్న సందేహాలు, భయాలు మరొక ఎత్తు. ఇలా ఇవన్నీ వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తున్నాయి. మరి, ఈ దశలోనూ మహిళలు భయాందోళనలకు గురికాకుండా, మానసికంగా దృఢంగా ఉండాలన్నా.. ఎలాంటి శారీరక మార్పునైనా పాజిటివిటీతో స్వీకరించాలన్నా మెనోపాజ్‌ గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం. అక్టోబర్‌ను ‘ప్రపంచ మెనోపాజ్‌ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న నేపథ్యంలో మెనోపాజ్‌ గురించి సాధారణంగా ఉండే కొన్ని అభిప్రాయాలు, వాటి వెనకున్న అసలు వాస్తవాల గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..

* 50 ఏళ్లు నిండితే గానీ మెనోపాజ్‌ రాదు!

సాధారణంగా 45-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో మెనోపాజ్‌ దశ ఆరంభమవుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇది మహిళలందరికీ వర్తించచ్చు.. వర్తించకపోవచ్చు.. ఎందుకంటే కొంతమంది 45 ఏళ్లు దాటకుండానే మెనోపాజ్‌లోకి ప్రవేశించచ్చు.. మరికొందరికి 50 ఏళ్ల తర్వాత కూడా రావచ్చు. మెనోపాజ్ దశ ప్రారంభమవడానికి, జీన్స్‌కి దగ్గరి సంబంధం ఉంది. ఉదాహరణకు.. మీ కుటుంబంలో మీ తల్లి, అమ్మమ్మ ఇలా ఎవరైనా చిన్న వయసులో లేదంటే ఆలస్యంగా ఈ దశలోకి అడుగుపెట్టి ఉంటే.. ఆ జన్యువుల ప్రభావం మీలో కూడా ఉంటుంది. ఇక కొంతమందిలోనైతే 30-35 ఏళ్లలోనే మెనోపాజ్‌ దశ ప్రారంభమవుతుంది. అందుకు వాళ్ల జీవనశైలి అలవాట్లను ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మద్యపానం వంటి చెడు అలవాట్లు, దీర్ఘకాలిక వ్యాధులు, అధిక బరువు.. వంటివి ముందస్తు మెనోపాజ్‌ రావడానికి కారణాలు. అందుకే ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటూనే ఎప్పటికప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వస్తోన్న మార్పుల్ని గమనించాలి. ఈ క్రమంలో ఏవైనా తేడాలున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.

* మెనోపాజ్‌ దశలో బరువు పెరగడం సహజం!

మెనోపాజ్‌కు చేరువవుతోన్న మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులొస్తాయి. వాటి ప్రభావం జీవక్రియలపై పడుతుంది. తద్వారా బరువు పెరగడం సహజం. అలాగే చాలామంది స్త్రీలలో 45-50 ఏళ్ల మధ్య మెనోపాజ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వయసులో జీవనశైలిలో సైతం మార్పులొస్తాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వ్యాయామాలు చేయకపోవడం, వయసు పెరిగే కొద్దీ శరీరం ఉత్సాహాన్ని కోల్పోవడం.. వంటివీ మెనోపాజ్‌ దశలో బరువు పెరగడానికి పలు కారణాలు. కాబట్టి కేవలం మెనోపాజ్‌ వల్లే బరువు పెరుగుతామనడం కూడా సరికాదంటున్నారు నిపుణులు. అందుకే ఈ వయసులో యాక్టివ్‌గా, పాజిటివ్‌గా ఉండాలంటే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించి ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, పాలు, పాల పదార్థాలు, మాంసం, గుడ్లు, తాజా పండ్లు, కాయగూరలు.. వంటివి తీసుకోవాలి. అలాగే నిపుణుల సలహా మేరకు వ్యాయామాలు చేయడమూ మంచిదే!

* మెనోపాజ్‌ దశలో లైంగిక కోరికలు తగ్గుతాయి!

సాధారణంగా మెనోపాజ్‌ దశలో శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది.. లైంగిక పరమైన కోరికలు తగ్గడానికి ఇది ఒక కారణం. అలాగని అదే ప్రధాన కారణం అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ దశలో వచ్చే శారీరక మార్పులు, మానసిక ఒత్తిడి, మూడ్‌ స్వింగ్స్‌, ఇతర సమస్యల వల్ల అలసట, నీరసం.. వంటివి తలెత్తుతాయి.. మరోవైపు మహిళలకు వృత్తిఉద్యోగాలు, ఇంటి పని వల్ల అసలు తీరికే దొరకదు. ఇలా ఇవన్నీ వారి శరీరంపై, మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక ఈ దశలో వెజైనా పొడిగా మారడం, బిగుతుగా మారడం, తద్వారా కలయికలో పాల్గొన్నప్పుడు నొప్పి రావడంతో ఆ ఆసక్తి, ఆలోచన తగ్గిపోతుంది. అందుకే ఈ దశలో లైంగిక కోరికల్ని కలిగించే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయుల్ని పెంచే ఆహారం తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సోయా బీన్స్‌, అవిసె గింజలు, నువ్వులు, మొక్కల ఆధారిత కాయగూరలు-ఆకుకూరలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కటి వలయంలోని కండరాల్ని దృఢంగా మార్చుకోవడానికి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

* చిన్న వయసులో రుతుచక్రం మొదలైతే మెనోపాజ్‌ కూడా త్వరగా వస్తుంది.. ఆలస్యంగా మొదలైతే ఆలస్యంగా వస్తుంది..!

రుతుచక్రం మొదలవడానికి మెనోపాజ్‌కు అసలు సంబంధం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుట్టుకతో మన అండాశయాల్లో ఉండే అండాల సంఖ్య మీదే మెనోపాజ్‌ ముందొస్తుందా? ఆలస్యంగా వస్తుందా? అన్నది ఆధారపడి ఉంటుందట! సాధారణంగా అమ్మాయిలు పుట్టే సమయానికి వారి అండాశయాల్లో సుమారు 1 మిలియన్‌ (10 లక్షల) అండాలుంటాయి. అయితే నెలసరి మొదలయ్యే నాటికి వాటి సంఖ్య 3 లక్షలకు పడిపోతుంది. వీటిలోనూ మహిళల పునరుత్పత్తి కాలంలో కేవలం 300-400 అండాలు మాత్రమే ఉత్పత్తవుతాయట! ఇక వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఎవరికైతే పుట్టుక సమయంలో అండాల సంఖ్య తక్కువగా ఉంటుందో వారు చిన్న వయసులోనే మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అదే ఎక్కువ సంఖ్యలో అండాలుంటే మెనోపాజ్‌ ఆలస్యం కావచ్చు.. అంతేకానీ నెలసరి ప్రారంభం కావడానికి, మెనోపాజ్‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

* మెనోపాజ్‌కు చేరువవుతోన్న ప్రతి ఒక్కరిలో కనిపించే లక్షణం వేడి ఆవిర్లు!

మెనోపాజ్‌ దశలోకి అడుగుపెట్టే మహిళలందరిలోనూ వేడి ఆవిర్లు సమస్య ఉంటుందని చెప్పలేం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే 75 శాతం మంది మహిళల్లో ఈ లక్షణం కనిపించినా.. మిగతా 25 శాతం మంది మహిళల్లో మాత్రం దీని ఊసే ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే నెలసరి క్రమం తప్పడం, కీళ్ల నొప్పులు, కడుపు ఉబ్బరం, మూడ్‌ స్వింగ్స్‌, అలసట, నీరసం, హార్మోన్ల స్థాయుల్లో మార్పుల వల్ల వక్షోజాల్లో నొప్పి రావడం.. వంటి ఇతర లక్షణాలు కనిపించచ్చు.

ఇక ఈ లక్షణాల వల్ల చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు.. మెనోపాజ్‌ వచ్చిందంటే జీవితం ముగిసినట్లే అన్న నెగెటివిటీలోకి జారుకుంటారు.. నలుగురిలోకీ వెళ్లడానికి ఇష్టపడరు. ఈ దశలో ఇలాంటి ఆలోచనలు అస్సలు మంచివి కావు.. కాబట్టి శారీరక మార్పుల్ని స్వాగతించేలా సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి.. నచ్చిన పనులు చేయడం, యోగా, ధ్యానం, పాజిటివిటీని పెంచే పుస్తకాలు చదవడం.. ఇందుకు దోహదం చేస్తాయి. అలాగే మీ సమస్యల్ని మీలోనే దాచుకోకుండా నలుగురితో పంచుకోవడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది.

అంతేకాదు.. మెనోపాజ్‌ కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా.. అవసరమైనప్పుడు డాక్టర్‌ని సంప్రదించడం, రెగ్యులర్‌ చెకప్స్‌, డాక్టర్‌ సలహా మేరకే మందులు వాడడం, నిపుణుల సలహాలు తీసుకుంటూ వ్యాయామాలు చేయడం.. ఇవన్నీ ముఖ్యమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని