Published : 12/12/2021 16:11 IST

థైరాయిడ్‌ ఉన్న వారు గర్భం ధరించలేరా?

నిజానికి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే కొన్ని అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి. దురదృష్టవశాత్తూ వాటి వల్ల మన ఆరోగ్యానికి జరగకూడని నష్టం జరిగేదాకా వాటిని గుర్తించలేం. థైరాయిడ్‌ కూడా అలాంటి వ్యాధే! బరువు పెరగడం/తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్ధకం.. ఇలా దీనివల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలెన్నో! ఇదిలా ఉంటే థైరాయిడ్‌ గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయి. ఒకవేళ దీని బారిన పడితే నయమవుతుందా? థైరాయిడ్‌ ఉంటే పిల్లలు పుట్టరేమో? థైరాయిడ్‌ ఉన్న వాళ్లు గర్భం ధరించినా ఆ సమయంలో మందులు వాడడం మంచిదో? కాదో? ఇలా దీని గురించి ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సందేహాలు, అపోహలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యను అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

హార్మోన్ల అసమతుల్యత మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. థైరాయిడ్‌ కూడా అందులో ఒకటి. T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరు వేగంగా లేక నెమ్మదిగా పనిచేస్తుంది. హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే ఈ గ్రంథి పనితీరు వేగం పుంజుకుంటుంది. దీన్నే ‘హైపర్‌ థైరాయిడిజం’గా పిలుస్తారు. అదే నెమ్మదిస్తే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు నెమ్మదిస్తుంది. తద్వారా ‘హైపో థైరాయిడిజం’ సమస్య తలెత్తుతుంది. ఇదిలా ఉంటే థైరాయిడ్‌ గురించి చాలామందిలో చాలా రకాల అపోహలు నెలకొన్నాయి. అవేంటంటే..!

శారీరక లక్షణాల ద్వారా థైరాయిడ్‌ను గుర్తించచ్చు

ఒకరకంగా చెప్పాలంటే ఇది అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే దాదాపు 60 శాతం మందికి తమకు థైరాయిడ్‌ ఉందన్న విషయం కూడా తెలియట్లేదట! అయితే విపరీతమైన అలసట, నీరసం, శారీరక బరువులో హెచ్చుతగ్గులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, మెడ దగ్గర వాపు.. వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని చెబుతున్నారు. తద్వారా వైద్యులు రక్తపరీక్ష ద్వారా TSH హార్మోన్‌ స్థాయుల్ని పరీక్షించి మీకు థైరాయిడ్‌ ఉందో, లేదో గుర్తిస్తారు. ఒకవేళ ఉంటే సరైన మందులు సూచిస్తారు.. దీంతో పాటు చక్కటి జీవన విధానం అవలంబిస్తూ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును అదుపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.


థైరాయిడ్‌ ఉంటే పిల్లలు పుట్టరు

ఇందులో ఎలాంటి నిజమూ లేదంటున్నారు నిపుణులు. అయితే అది కూడా ఈ సమస్యను గుర్తించడం, సరైన చికిత్స తీసుకున్నంత వరకే దీని ప్రభావం ప్రెగ్నెన్సీ మీద ఉండదని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. T4 (థైరాక్సిన్‌) హార్మోన్‌ స్థాయులు తగ్గిపోవడం వల్ల ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ (పిట్యుటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్‌) స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా అండం సరైన సమయంలో విడుదల కాదు.. కాబట్టి గర్భం ధరించడం కష్టమవుతుంది. హైపోథైరాయిడిజం సమస్య నెలసరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది కూడా సంతానలేమికి దారితీస్తుంది. కాబట్టి సమస్యను గుర్తించి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే సంతాన భాగ్యానికి నోచుకోవచ్చు. అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా డాక్టర్ల సలహా తీసుకొని చికిత్స/మందులను కొనసాగించచ్చు.


థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడాలంటే అయొడిన్‌ ఎక్కువగా తీసుకోవాలి

ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అయొడిన్‌ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరిచినప్పటికీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఇతరత్రా అనారోగ్యాల బారినపడే అవకాశముంటుందట! అందుకే సాధారణ సమయాల్లో, గర్భం ధరించిన తర్వాత, పిల్లలకు పాలిచ్చే సమయాల్లో.. రోజుకు 150mcg సప్లిమెంట్‌ సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే అది కూడా మీ ఆరోగ్యస్థితిని బట్టి ఓసారి నిపుణులను అడిగి వాడడం మంచిది.


థైరాయిడ్‌ గ్రంథిలో ఉండే గడ్డ క్యాన్సర్‌ను సూచిస్తుంది

థైరాయిడ్‌ గ్రంథిలో ఉండే గడ్డలన్నీ క్యాన్సర్‌ గడ్డలు కాదు.. అవి భవిష్యత్తులో కూడా క్యాన్సర్‌కు కారకాలు కావు. అయితే వీటివల్ల థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతింటుందనిపిస్తే మాత్రం వైద్యులు వీటిని తొలగించుకోమని సలహా ఇస్తారు. కాబట్టి వీటి గురించి భయాందోళనలు చెందకుండా ప్రతి ఆరు నెలలకోసారి థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.


థైరాయిడ్‌ హార్మోన్‌ సప్లిమెంట్స్‌ ఎక్కువగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గచ్చు

ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే విషమే అంటున్నారు నిపుణులు. డాక్టర్లు సూచించిన మోతాదులో మాత్రమే థైరాయిడ్‌ సప్లిమెంట్స్‌ వాడమని సలహా ఇస్తున్నారు. అలాకాకుండా ఎక్కువ డోస్‌ తీసుకుంటే అది నిద్రలేమి, ఆకలి పెరిగిపోవడం, గుండె సంబంధిత సమస్యలు, వణుకు.. వంటి దుష్ప్రభావాలకు కారణమవుతుందట! అలాగే మందులతో హార్మోన్‌ స్థాయుల్ని సమతులం చేసుకోవడంతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.


TSH స్థాయులు అదుపులో ఉంటే థైరాయిడ్‌ సమస్య లేనట్లే!

అలా అనుకోవడానికి వీల్లేదట. ఎందుకంటే వయసును బట్టి థైరాయిడ్‌ పనితీరులో మార్పులొస్తాయట! అంటే వయసు పెరుగుతున్న కొద్దీ థైరాయిడ్‌ పనితీరు నెమ్మదిస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి థైరాయిడ్‌ ఉందో లేదో తెలుసుకోవడానికి TSH పరీక్ష ఒక్కటే సరిపోదని, వైద్యుల సలహా మేరకు T3, T4.. వంటి పరీక్షలు కూడా చేయించుకొని, వారు సూచించిన మందులు వాడడం శ్రేయస్కరం.

అలాగే ఈ సమస్య మహిళలతో పాటు పురుషుల్లోనూ, అది కూడా ఏ వయసులోనైనా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి నిపుణుల సలహాలను పాటిస్తూ నిర్ణీత వ్యవధుల్లో థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకుంటే దీనివల్ల ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండచ్చు..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని