New Bride: ప్రతిదీ ‘సమస్య’లా చూడద్దు!

కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు కాస్త నెర్వస్‌నెస్‌ ఉండడం సహజమే! ఈ ఫీలింగ్‌తో వేసే ప్రతి అడుగూ ఓ సమస్యగా అనిపిస్తుంటుంది.

Updated : 09 Dec 2021 16:41 IST

కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు కాస్త నెర్వస్‌నెస్‌ ఉండడం సహజమే! ఈ ఫీలింగ్‌తో వేసే ప్రతి అడుగూ ఓ సమస్యగా అనిపిస్తుంటుంది. కొత్త వాతావరణంలో ఎలా నడుచుకోవాలి? ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో తెలియని బెరుకు ఆవహిస్తుంటుంది. అయితే కలుపుగోలుతనమే మీ మనసులోని ప్రతికూల ఆలోచనలన్నీ దూరం చేసి.. అత్తింటివారికి మిమ్మల్ని దగ్గర చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ప్రతి విషయాన్నీ సమస్యగా పరిగణించకుండా ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యమంటున్నారు.

‘హోమ్‌ సిక్‌’ ఉందా?

పుట్టింటిని విడిచి అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలు.. మళ్లీ పుట్టింట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అని ఎదురు చూస్తుంటారు. పెళ్లి విశేషాలు, అత్తారింటి సంగతులు తమ వాళ్లతో పంచుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ ఆలోచనల్లో పడిపోయి కొత్త వాతావరణానికి అలవాటు పడాలని, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవాలన్న విషయాలే మర్చిపోతుంటారు. ఇలాంటి హోమ్‌సిక్‌నెస్‌ని దూరం చేసుకోవాలంటే అత్తారింటినే పుట్టింటిగా భావించమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇకపై మీరు ఉండబోయేదంతా అక్కడే.. ఏవైనా ప్రత్యేక సందర్భాలు, పండగలప్పుడే పుట్టింటికి వెళ్తారు కాబట్టి.. మీరు శాశ్వతంగా ఉండబోయే వాతావరణాన్ని మీకు బోర్‌ కొట్టకుండా చేసుకోవడం ముఖ్యమంటున్నారు. ఈ క్రమంలో అత్తమామలు, ఆడపడుచులు, బావ-మరుదులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులతో చెలిమి పెంచుకోవడం, కలుపుగోలుగా ఉండడంతో పాటు మీ మనసులోని మాటల్ని/ఇతర సమస్యల్ని వాళ్లతో పంచుకోవడానికీ వెనకాడకూడదు.

కాసేపు ఫ్రీగా వదిలేస్తే బాగుండు!

పెళ్లంటే ఎంతో హడావిడి ఉంటుంది.. ఎన్నో వేడుకలు మిళితమై ఉంటాయి. కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలిని పలకరించడానికి బంధువులు/ఫ్రెండ్స్‌ రాకపోకలు, బంధువుల పిలుపు మేరకు కొత్త జంట వాళ్లిళ్లకు వెళ్లడం.. ఇలా వారం, పది రోజుల దాకా ఖాళీ దొరకమన్నా దొరకదు. ఇలా విశ్రాంతి కరువై ఒక రకమైన అసహనం ఆవహిస్తుంటుంది. ఇలాంటప్పుడే ఓపిగ్గా ఉండాలంటున్నారు నిపుణులు. ఒత్తిడిలో చిరాకుపడడం, ‘కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి!’ అని విసుక్కోవడం.. వంటివి చేస్తే అవతలి వారికి మీపై నెగెటివ్‌ అభిప్రాయం రావచ్చు. అందుకే మనసును మన అధీనంలోకి తెచ్చుకొని.. ఇవన్నీ తాత్కాలికమే అని సర్ది చెప్పుకుంటే ఏ సమస్యా ఉండదు.

తనని ఏమని పిలవాలి?

అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇది! అసలే మన సంప్రదాయ కుటుంబాల్లో వరసలకు చాలా ప్రాధాన్యమిస్తారు. బంధుత్వాన్ని బట్టి పిలవకపోతే తప్పు పడుతుంటారు. అంతేకాదు.. ఒక్కోసారి మనకంటే ఎక్కువ వయసున్న వారు మనకు కూతురు వరస కావచ్చు.. లేదంటే మన వయసులో ఉన్న వారే మనల్ని పిన్ని, ఆంటీ అని పిలవచ్చు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో కోపం రావడం సహజం. అయినా సంయమనం పాటించాలంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎదుటివాళ్లు మిమ్మల్ని అలా పిలవడం ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పడంలో తప్పు లేదు. అలాగే తొలినాళ్లలో మీ అత్తారింట్లో కొంతమందిని ఎలా పిలవాలో మీకు అర్థం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఈ విషయం గురించి మీ వారిని/మీ అత్తయ్యను అడిగి తెలుసుకోవచ్చు.

యూట్యూబ్‌ ఉందిగా.. అనుకోవద్దు!

ఈ కాలపు అమ్మాయిలు పుట్టింట్లో ఉన్నప్పుడు వంటింట్లోకి వెళ్లడమే చాలా అరుదు. అందుకే వంట అంటే ఆమడదూరం పరిగెడుతుంటారు. అయితే అత్తారింటికి వెళ్లాక ఇదో సమస్యగా అనిపిస్తుంటుంది చాలామంది అమ్మాయిలకు! ఎందుకంటే.. అక్కడి వారి అభిరుచులు తెలియకపోవడం ఓ కారణమైతే.. పాకశాస్త్ర ప్రావీణ్యం లేకపోవడం మరో కారణం! ఇలాంటప్పుడే కొంతమంది యూట్యూబ్‌ వీడియోలతో నెట్టుకొస్తుంటారు. ఇది కొంతవరకు ఉపయోగపడినా.. వంట విషయంలో అత్తగారి మెలకువలు తెలుసుకోవడం మరీ మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా వాళ్ల అనుభవాలు మీకు ప్లస్‌ అవడంతో పాటు ఇద్దరి మధ్య సఖ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఏకాంతవాసం ఇలా!

కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువ సమయం ఏకాంతంగా సమయం గడపాలని ఆరాటపడుతుంటారు. అయితే ఉమ్మడి కుటుంబంలో ఇది కుదరకపోవచ్చు.. అలాగే ఎవరి ఉద్యోగాల్లో వారు బిజీగా ఉండడం వల్ల కూడా ఏకాంతవాసం దొరక్కపోవచ్చు. నిజానికి చాలామందికి ఇది కూడా ఓ సమస్యగా అనిపిస్తుంటుంది. దీనికి పరిష్కార మార్గం హనీమూన్ అంటున్నారు నిపుణులు. ఒకవేళ దూరం వెళ్లే వీల్లేని వారు దగ్గర్లోని ప్రదేశాలకు, రిసార్టులకు వెళ్లడం.. వారాంతంలో స్థానికంగా ఉండే ప్రదేశాల్ని సందర్శించడం వల్ల కలిసి గడపలేకపోతున్నామన్న అసంతృప్తికి చెక్‌ పెట్టేయచ్చు.. ఈ హ్యాపీనెస్‌తో ఇతర కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగకుండా కూడా కాపాడుకోవచ్చు.

అలాగే అత్తింటి వాళ్లు కూడా కొత్త కోడలి ఇష్టాయిష్టాల్ని గౌరవిస్తూ.. వీలైనంత త్వరగా తనను తమలో కలుపుకొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆమెలో ఉండే భయాలు, బెరుకు.. వంటివన్నీ దూరమవుతాయి.

ఇవన్నీ చదువుతుంటే.. మీకూ అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త రోజులు గుర్తొస్తున్నాయా? బిడియ పడిన సందర్భాలు జ్ఞాపకమొస్తున్నాయా? అయితే ఆలస్యమెందుకు.. ఆ స్వీట్‌ మెమరీస్‌ని అందరితో పంచుకోండి!

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్