Updated : 31/08/2021 20:27 IST

మీ పిల్లల్లో ఇలాంటి చర్మ సమస్యలొస్తున్నాయా?

చిన్న పిల్లల చర్మం ముట్టుకుంటే కందిపోయేంత మృదువుగా, దూదిపింజ అంత సుతిమెత్తగా ఉంటుంది. అందుకే కాస్త ఎండ తగిలినా కందిపోవడం, చల్లటి వాతావరణంలో పొడిబారిపోవడం.. వంటి సమస్యలు మన పిల్లల్లోనూ మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. వారి చర్మం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు కూడా త్వరగా లోనయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు వారి చర్మం కింద లిపిడ్లు (చర్మాన్ని సంరక్షించే సహజసిద్ధమైన కొవ్వులు) తక్కువగా, ఆమ్ల స్థాయులు ఎక్కువగా ఉండడమే ముఖ్య కారణమంటున్నారు నిపుణులు. తద్వారా వారి చర్మం మరింతగా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చర్మ సమస్యల నుంచి చిన్నారుల్ని ఇట్టే కాపాడుకోవచ్చట! మరి, ఇంతకీ పిల్లల్లో ఎదురయ్యే ఆ సాధారణ చర్మ సమస్యలేంటి? వాటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

‘ఎగ్జిమా’కు ఏదీ విరుగుడు?!

కొంతమంది చిన్నారుల్లో చర్మమంతా లేదంటే అక్కడక్కడా పొడిగా, ఎర్రగా మారడం.. దురదతో వారు అసౌకర్యంగా ఫీలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి చర్మ సమస్యను ‘ఎగ్జిమా’గా పిలుస్తారు. పదిమంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే చర్మం పైపొరల్లో ఫిలాగ్రిన్‌ (Filaggrin) అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌ లోపించడమే ఈ స్కిన్‌ ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణమట! ఫలితంగా చర్మం త్వరగా తేమను కోల్పోవడం.. వేడి, చలి వంటి వాతావరణ మార్పులతో పాటు బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే సామర్థ్యం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. పసి పిల్లల్లో అయితే భుజాలు, ముఖం, కుదుళ్లు, కాళ్లు.. తదితర భాగాల్లో ఈ సమస్య వస్తుంటుంది. ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలన్నా, ఇది రాకుండా జాగ్రత్తపడాలన్నా ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

* పిల్ల్లల చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్‌ సబ్బును వాడాల్సి ఉంటుంది.

* చర్మానికి అసౌకర్యంగా ఉండే దుస్తుల్ని పిల్లలకు వేయకూడదు.

* చిన్నారుల పొడవాటి గోళ్లలో ఉండే మురికి, దుమ్ము-ధూళి సైతం దురద పెట్టినప్పుడు చర్మంలోకి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి వారి గోళ్లను ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేస్తుండాలి.

* మీ పిల్లల చర్మానికి అలర్జీ కలిగించే ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

* చిన్నారుల చర్మం తేమగా ఉండడం కోసం వారితో నీళ్లు ఎక్కువగా తాగించాలి. ఒకవేళ మరీ పసి పిల్లలైతే డాక్టర్‌ సలహా మేరకు నీళ్లు తాగించడం మంచిది.

* ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీ చిన్నారిని రెగ్యులర్‌ చెకప్స్‌కి తీసుకెళ్లడం.. నిపుణులు సూచించిన మందులు, క్రీమ్స్‌, లోషన్స్‌.. వంటివి వాడడం తప్పనిసరి.

మొటిమలకు అదే కారణం..!

పుట్టినప్పుడు ఎంతో సున్నితంగా ఉండే చర్మం కొన్ని రోజులయ్యాక ఆ మృదుత్వాన్ని కోల్పోతుంటుంది. ఇందుకు కారణం వాతావరణ మార్పులే! అయితే కొంతమంది చిన్నారుల్లో బుగ్గలు, గడ్డం, నుదురు.. వంటి భాగాల్లో చిన్న చిన్న మొటిమలు, గుల్లల్లా వస్తుంటాయి. ఇది చూసి చాలామంది తల్లులు కాస్త భయపడుతుంటారు. నిజానికి ఇలా జరగడానికి తల్లి హార్మోన్లు శిశువుల రక్తంలో ఉండడమే కారణమంటున్నారు నిపుణులు. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ పిల్లల్లో ఉండే తైలగ్రంథుల్ని ప్రేరేపిస్తాయట! తద్వారా ఈ చర్మ సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ముఖాన్ని/చర్మాన్ని గోరువెచ్చటి నీళ్లతో రోజుకు రెండుమూడు సార్లు మృదువుగా తుడవడం, సబ్బులు/లోషన్లు వంటివి వాడకపోవడం మంచిది. అలాగే మొటిమల కోసం పెద్ద వాళ్లు వాడే క్రీమ్స్‌, ఆయింట్‌మెంట్స్‌ అస్సలు వాడకూడదు. కావాలంటే డాక్టర్‌ సలహా మేరకు సురక్షితమైన బేబీ ఉత్పత్తులు ఉపయోగించడం శ్రేయస్కరం.

డైపర్లు మార్చకపోయినా..!

చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే చర్మ సమస్యల్లో డైపర్‌ రాషెస్‌ కూడా ఒకటి. ఎక్కువ సమయం డైపర్లు వేసే ఉంచడం, నిర్ణీత సమయాల్లో వాటిని మార్చకపోవడం.. వంటివి అక్కడి చర్మ ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. ఫలితంగా అక్కడి చర్మం ఎరుపెక్కడం, దురద, మంట.. వంటివన్నీ పిల్లలకు విపరీతమైన అసౌకర్యం కలిగిస్తాయి. అందుకే ఈ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తపడాలన్నా, దీన్నుంచి ఉపశమనం పొందాలన్నా నిర్ణీత సమయాల్లో డైపర్లు మార్చడం; అక్కడి చర్మం ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం; డైపర్‌ మార్చే ముందు మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం.. వంటివి తప్పనిసరిగా చేస్తుండాలి.

కుదుళ్లలో ఈ సమస్య రాకుండా..!

కొంతమంది చిన్నారుల్లో జుట్టు కుదుళ్ల చర్మం కూడా పొడిబారిపోతుంటుంది. దీనికి వాతావరణంతో పాటు జన్యుపరమైన అంశాలు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఇదిలాగే కొనసాగితే కుదుళ్లలో చర్మం పసుపు/తెలుపు రంగులో ప్యాచెస్‌లా కూడా అయ్యే అవకాశముందట! దీన్నే ‘క్రాడిల్‌ క్యాప్‌’ అంటారు. అయితే దీన్నుంచి విముక్తి పొందాలంటే నిపుణుల సలహా మేరకు షాంపూను మార్చడం, నూనెతో కుదుళ్లకు చక్కటి మసాజ్‌ చేయడం, నిర్ణీత వ్యవధుల్లో పిల్లలకు తలస్నానం చేయించడం.. వంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూనే ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదిస్తూ వారు సూచించిన సలహాలు పాటించాల్సి ఉంటుంది.

ఏదేమైనా పిల్లలకు ఎలాంటి చర్మ సంబంధిత సమస్య వచ్చినా కూడా వెంటనే సంబంధిత నిపుణుల దగ్గరికి వారిని తీసుకెళ్లి తగిన చికిత్స అందించండి. తద్వారా మొదట్లోనే సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. అంతేకానీ.. మీ సొంత వైద్యం మాత్రం చేయకండి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని