Published : 16/01/2022 13:35 IST

Thyroid:జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?

హలో అండీ.. నిన్న షాపింగ్‌కి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ సునీత, శ్రావణి, భవాని కనిపించారు. ఎంత ఆనందమేసిందో వాళ్లను చూసి..! మేం కలిసి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వాళ్లలో చాలా మార్పు. ముగ్గురూ చాలా లావయ్యారు. ఆ తర్వాత మాటల్లో తెలిసింది.. వాళ్ల ముగ్గురికీ థైరాయిడ్ సమస్య ఉందని. నిజమేనండీ.. ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. పిరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం, బరువు పెరగడం, ఇతర అనారోగ్యాలు.. ఇలా ఒక్కటేమిటి థైరాయిడ్‌తో వచ్చే అనారోగ్యాలు అనేకం. ‘జాతీయ థైరాయిడ్‌ అవగాహన మాసం’ సందర్భంగా అసలీ థైరాయిడ్ ఎందుకొస్తుంది? దీన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా? వంటి ప్రశ్నలన్నింటికీ నిపుణులు చెబుతోన్న సమాధానాలు ఏంటో తెలుసుకుందామా?

తెలుసుకోవడం సులువే..

మనలో చాలామంది థైరాయిడ్ వచ్చిందనే అనుమానం ఉన్నా, అవునో.. కాదో.. తెలుసుకోలేక సతమతమవుతుంటారు. అయితే కొన్ని లక్షణాల ద్వారా థైరాయిడ్‌ను గుర్తించవచ్చు.. ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేకపోవడం.. మొదలైన సూచనలు కనిపిస్తే దానిని 'హైపో థైరాయిడిజం'గా భావించాలి.. సరిగానే తింటున్నా విపరీతంగా బరువు తగ్గడం, నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటపోయడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లవలసి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దానిని 'హైపర్ థైరాయిడిజం'గా పరిగణించాలి.

అసలెందుకు వస్తుంది?

చాలామందికి థైరాయిడ్ ఉందనగానే ఒకటే అనుమానం వస్తుంది. నాకే ఎందుకీ వ్యాధి వచ్చింది? అని. థైరాయిడ్ రావడానికి శరీరంలోని హార్మోన్ స్థాయుల్లో తేడాలే కారణం. T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వల్ల థైరాయిడ్ గ్రంథి వేగంగా లేక నెమ్మదిగా పని చేస్తుంది. హార్మోన్లు ఎక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి వేగంగా పనిచేస్తుంది. దాన్ని ‘హైపర్ థైరాయిడిజం’ అంటారు. అదే తక్కువగా విడుదలైతే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోతుంది. దీన్ని ‘హైపో థైరాయిడిజం’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే హైపర్ థైరాయిడిజంలో శరీరంలోని అవయవాలు వేగంగా పనిచేస్తాయి. గుండె కొట్టుకునే వేగం కూడా ఎక్కువే. దీంతో క్యాలరీలు త్వరగా కరిగిపోయి సన్నగా అవుతూ ఉంటారు. హైపో థైరాయిడిజంలో అవయవాలు నెమ్మదిగా పనిచేయడం వల్ల క్యాలరీలు అంత త్వరగా కరగవు. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. హైపో థైరాయిడిజంలో గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది.

ఏం చేయాలి?

ఇది అంత సులభంగా తగ్గే సమస్యµ కాదు. అదుపులో ఉంచుకోవడం ఒకటే మనం చేయగలిగింది. దాని కోసం కనీసం ఆరు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లు సూచించిన ప్రకారం మందులు వాడాలి. వాళ్ల సూచనలు లేకుండా మందులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదం. అలాగే ఆహార నియమాలను పాటించడమూ ముఖ్యమే.. ఎందుకంటే కేవలం మందుల వల్ల బరువు అదుపులో ఉండే అవకాశాలు తక్కువ. హైపో థైరాయిడిజం ఉన్నవారు బరువు అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు వాకింగ్, యోగా లాంటివి చేయాలి.

ఎలాంటి ఆహారం?

ఒకసారి థైరాయిడ్ వచ్చిందనగానే ఇది తినాలి, ఇది తినకూడదు అని చెప్పేవారు మన చుట్టూ ఉంటారు. ఒకరు ఫలానా కూర తినకూడదంటే మరొకరు తినొచ్చంటారు. ఇలా వాళ్ల సలహాలు గందరగోళాన్ని కలిగిస్తుంటాయి. థైరాయిడ్ ఉన్నవాళ్లు క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకలీ, సోయా చిక్కుళ్లు వంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అయొడిన్, జింక్, ఇనుము, కాపర్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఆకుకూరలు, చేపలు, పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రతి స్త్రీ రోజుకు 150మి.గ్రా ల అయొడిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో కాస్త ఎక్కువగా అంటే సుమారు 200మి.గ్రాలు తీసుకుంటే వారి ఆరోగ్యంతో పాటు బిడ్డల ఆరోగ్యాన్నీ కాపాడుకున్నవాళ్లవుతారు.

సరైన ప్రణాళిక ముఖ్యం

థైరాయిడ్ సమస్య ఉందని తెలియగానే కంగారు పడకుండా దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో డాక్టర్ల సలహాలను పాటిస్తూ, యోగాసనాలు, వ్యాయామాలతో బరువును అదుపులో ఉంచుకుంటే థైరాయిడ్ కారణంగా ఇతర అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. పూర్తిగా తిండి మానేయకుండా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు.. రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది. రోజూ మర్చిపోకుండా ఒకే సమయానికి మందులు వేసుకోవాలి. ఇలా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి.


Advertisement

మరిన్ని