వెతుక్కొంటూ వచ్చింది.. రోజూ మావారికి ఫోన్ చేస్తుంటుంది..!

నాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. నా భర్తతో కలిసి చదువుకున్న ఒకావిడ రెండు నెలల క్రితం మావారిని వెతుక్కొంటూ వచ్చి కలిసింది. వాళ్ల ఆయనకు ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందట. ఆమెకు పిల్లలు లేరు. ప్రతిరోజూ మావారికి ఫోన్‌ చేసి మాట్లాడుతుంటుంది.

Published : 15 Sep 2023 12:10 IST

నాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఇద్దరు పిల్లలు. నా భర్తతో కలిసి చదువుకున్న ఒకావిడ రెండు నెలల క్రితం మావారిని వెతుక్కొంటూ వచ్చి కలిసింది. వాళ్ల ఆయనకు ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందట. ఆమెకు పిల్లలు లేరు. ప్రతిరోజూ మావారికి ఫోన్‌ చేసి మాట్లాడుతుంటుంది. తనకు ఏదైనా అవసరం ఉంటే నా భర్త సహాయం కోరుతుంటుంది. మావారితో ఆమె అంత చనువుగా ఉండడం నాకు నచ్చడం లేదు. ఈ విషయం మావారికి ఎలా చెప్పాలో? అర్థం కావడం లేదు. ఆమె వల్ల నాకు మనశ్శాంతి ఉండడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు. - ఓ సోదరి

జ. మీది పదేళ్ల దాంపత్య బంధం అంటున్నారు. ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగుతోన్న ఈ ప్రయాణంలో మీకు ఒక సమస్య వచ్చింది. ఇది మీ బంధాన్ని ప్రభావితం చేసే సమస్య. కాబట్టి, ఈ సమయంలో మీరు ఓర్పు, సహనంతో ఉండడం ఎంతో ముఖ్యం. మీరు తక్షణమే అతనితో చర్చించాలి, కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.. అనే కోణంలో ఆలోచించకపోవడం మంచిది. ఎందుకంటే మీవారికి, ఆమెకు మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉండచ్చు. అతను ఒక స్నేహితుడిలాగా మాత్రమే ఆమెకు సహాయం చేస్తుండచ్చు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో చాలా చోటు చేసుకుంటున్నాయి. ఒకవేళ మీరు దాన్ని మరొక విధంగా ఆలోచించి అతన్ని అడగకూడని ప్రశ్నలు వేయడం వల్ల సాఫీగా సాగుతోన్న మీ దాంపత్య బంధంలో గొడవలు వచ్చే అవకాశం లేకపోలేదు.

ఆమెకు మీ భర్త చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందేమో ఆలోచించండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే వారిని ఒక కంట కనిపెడుతూనే ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మీ ప్రాంతానికి వచ్చిన ఆమెకు మీ భర్త ఎలాంటి సహాయం చేస్తున్నాడో.. అదే సహాయం మీరు చేయడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో తనతో షాపింగ్‌కు వెళ్లండి. అలా కొన్ని రోజుల పాటు చూడండి. అప్పుడు మీకు వాళ్లిద్దరి మధ్య ఉన్నది స్నేహబంధమా? మరొకటా? అనేది తెలుస్తుంది. కాబట్టి, మీరు అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని