Jasmine Cho: కుకీసే ఆమె కాన్వాస్!

దేశం దశ దిశను మార్చుతూ చరిత్రలో నిలిచిపోయే వారు ఎంతోమంది ఉంటారు.. మనమైతే వాళ్ల గురించి తెలుసుకొని వదిలేస్తాం.. మహా అయితే సందర్భం వచ్చినప్పుడు వాళ్ల విజయగాథల్ని ఓసారి స్మరించుకుంటాం. కానీ ఆసియా-అమెరికన్‌ జాస్మిన్‌ చో మాత్రం....

Published : 10 Jun 2023 17:33 IST

(Photos: Instagram)

దేశం దశ దిశను మార్చుతూ చరిత్రలో నిలిచిపోయే వారు ఎంతోమంది ఉంటారు.. మనమైతే వాళ్ల గురించి తెలుసుకొని వదిలేస్తాం.. మహా అయితే సందర్భం వచ్చినప్పుడు వాళ్ల విజయగాథల్ని ఓసారి స్మరించుకుంటాం. కానీ ఆసియా-అమెరికన్‌ జాస్మిన్‌ చో మాత్రం ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆ దేశ చరిత్రలో నిలిచిపోయిన ఎంతోమంది వ్యక్తులు, ఉద్యమకారుల ఛాయాచిత్రాల్ని కుకీస్‌పై చిత్రీకరిస్తూ.. వారి స్ఫూర్తి గాథల్ని ఎంతోమందికి పరిచయం చేస్తూ.. కుకీస్‌ యాక్టివిస్ట్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకుంది. బేకింగ్‌పై తనకున్న మక్కువతో దీన్నే తన వ్యాపారసూత్రంగా మలచుకున్న ఆమె.. బేకింగ్‌ ఉత్పత్తులతో పాటు కస్టమైజ్‌డ్‌ కుకీస్‌ తయారుచేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ‘బేకింగ్‌ అంటే వంట చేసినంత సులభం కాదు.. మనసుకు ఇదో థెరపీ లాంటిది..’ అంటోన్న జాస్మిన్‌.. తన బేకింగ్ ప్రయాణం గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

జాస్మిన్‌ లాస్‌ ఏంజెల్స్‌లో పుట్టిపెరిగింది. ఆమె తల్లిదండ్రులది దక్షిణ కొరియా. జాస్మిన్ పుట్టకముందే అమెరికా వచ్చి స్థిరపడ్డారు ఆమె పేరెంట్స్‌. దాంతో అమెరికా పౌరురాలిగానే పెరిగిందామె. ఇక చిన్నతనం నుంచి స్వీట్స్‌, బేకింగ్‌ పదార్థాలంటే జాస్మిన్‌ చాలా ఇష్టపడేది. ఇంట్లో, బంధువులిళ్లలో ఏ వేడుకైనా.. ప్రత్యేకంగా చేసిన స్వీట్లు, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌ని నిర్మొహమాటంగా తీసుకొని తినేదామె. ఈ ఇష్టమే క్రమంగా దీన్నే తన కెరీర్‌గా ఎంచుకునేందుకు దోహదం చేసిందంటోందీ కుకీస్‌ లవర్.

స్నేహితురాలి ప్రోత్సాహంతో..!

‘నాకు చిన్నతనం నుంచి స్వీట్స్‌, బేకింగ్‌ పదార్థాలంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు ఓ రోజు నా స్నేహితురాలొకరు మా ఇంటికి వచ్చింది. తనకూ నాలాగే బేకరీ ఐటమ్స్‌ అంటే ఇష్టం. అయితే తనకు దీనికి సంబంధించిన కొన్ని ప్రాథమికాంశాలు తెలుసు. కొలతలు ఎలా తీసుకోవాలి? అవెన్‌ ప్రి-హీట్‌ చేసుకోవడం.. వంటివి ఆ రోజు తను నాకు నేర్పించింది. ఆపై నేను సొంతంగా బేకింగ్‌కు సంబంధించిన పలు నైపుణ్యాలు నేర్చుకున్నా.. ఇక కాలేజీలో ఉన్నప్పుడు నా స్నేహితుల కోరిక మేరకు.. వారి ముఖాన్ని పోలినట్లుగా కుకీస్‌ని తీర్చిదిద్ది వారికి అందించేదాన్ని. అది వారికెంతో నచ్చేది. అలా ఓసారి నా స్నేహితురాలి పుట్టినరోజు పార్టీ కోసం తన రూపాన్ని పోలిన కుకీస్‌ తయారుచేసి పార్టీలో ఉన్న అందరికీ పంచాను.. తనెంతో ఆశ్చర్యపోయింది.. నా నైపుణ్యాలు చూసి పార్టీకొచ్చిన వారు నన్ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఇక నేను తయారుచేసిన ఈ తరహా కస్టమైజ్‌డ్‌ కుకీస్‌కు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేదాన్ని. దాంతో నాకు మరింత గుర్తింపొచ్చింది. బేకింగ్‌పై ఇష్టంతో చిన్నప్పుడే దీన్నే వ్యాపారంగా మలచుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ మక్కువ, ఆ గుర్తింపు.. 2015లో ‘యమ్మీహోలిక్‌’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కారణమయ్యాయి..’ అంటూ తన బేకింగ్‌ ప్రయాణం ప్రారంభించిన తీరును పంచుకుంది జాస్మిన్.

ఆ సమస్యల్ని ప్రతిబింబించేలా..!

ప్రస్తుతం పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో స్థిరపడిన జాస్మిన్‌.. కస్టమైజ్‌డ్‌ కుకీస్‌ తయారుచేయడంలో దిట్ట. అయితే క్రమంగా తన నైపుణ్యాలకు మరింత మెరుగులద్దుతూ.. తన కళతో పలు సామాజిక అంశాల పైనా దృష్టి సారించిందామె. అమెరికాలో స్థిరపడిన ఆసియా దేశస్థులు, పసిఫిక్ దీవులకు చెందిన ప్రజలు.. ఇక్కడ వారు ఎదుర్కొనే పలు సమస్యల్ని తన కుకీస్‌ కాన్వాస్‌పై బొమ్మలు, రాతపూర్వకంగా చిత్రీకరిస్తుందామె. మరోవైపు.. ఆ దేశ చరిత్ర గతిని మార్చిన వ్యక్తులు, ఆయా రంగాల్లో రాణిస్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తోన్న ప్రముఖుల చిత్రాలు, అమెరికా సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని కుకీస్‌పై అందంగా చిత్రీకరించడం జాస్మిన్‌కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు.. కుకీస్‌పై పలువురు మహిళా ప్రముఖుల చిత్రాలు వేసి.. ఆ పక్కనే వారు రాసిన కొటేషన్స్‌నీ క్రీమ్‌తో అక్షరీకరిస్తుంటుందామె. ఇలా కుకీస్‌తో ఆమె చేస్తోన్న ఈ వినూత్న ప్రయత్నం ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది.

‘నేను రియాల్టీనే ఇష్టపడతా. నేను రూపొందించే కుకీస్‌ విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటిస్తున్నా. క్రీమ్‌, చక్కెర, ఫుడ్‌ కలర్‌, మన ఆలోచనలు.. ఇవి చాలు కుకీస్‌పై ఏదైనా సృష్టించడానికి..’ అంటోన్న జాస్మిన్‌.. తన సృజనాత్మక కళతో ఎన్నో అవార్డులు-రివార్డులు అందుకుంది.

బేకింగ్‌.. ఓ థెరపీ!

2019లో ‘క్రిస్మస్‌ కుకీ ఛాలెంజ్‌ - సీజన్‌ 3, ఎపిసోడ్‌ 8’ విజేతగా నిలిచిన జాస్మిన్‌.. రచయిత్రిగానూ పేరు సంపాదించుకుంది. బేకింగ్‌పై తాను రాసిన పలు వ్యాసాలు అక్కడి ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆమె సక్సెస్‌ స్టోరీ కూడా ఆయా మీడియా సంస్థల్లో ప్రచురితమైంది. అలాగే పిల్లల కోసం ‘Role Models Who Look Like Me: Asian Americans and Pacific Islanders Who Made History’ పేరుతో ఓ స్ఫూర్తిదాయక పుస్తకం రాసిందామె. టెడెక్స్‌ పిట్స్‌బర్గ్‌ వేదిక పైనా స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి ప్రపంచవ్యాప్తంగా మరెంతోమందికి చేరువైంది జాస్మిన్‌. ‘పిట్స్‌బర్గ్‌ టెక్నాలజీ కౌన్సిల్‌’ నుంచి ‘క్రియేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2019’, సిటిజెన్స్‌ బ్యాంక్‌ నుంచి ‘స్మాల్‌ బిజినెస్‌ కమ్యూనిటీ ఛాంపియన్‌ అవార్డు’.. వంటి పురస్కారాలు అందుకున్న ఈ మహిళా బేకర్‌ పేరు మీద.. 2020, జనవరి 28న ‘జాస్మిన్‌ చో డే’గా జరుపుకొని అక్కడి ప్రజలు ఆమెను గౌరవించారు. ఈ క్రమంలో వంట చేయడం కంటే బేకింగ్‌ కష్టమైనదే అయినా.. ఇది మనసుకు థెరపీలా పనిచేస్తుందంటోంది జాస్మిన్.

‘నేను రూపొందించే కుకీస్‌, బేకింగ్‌ పదార్థాల రుచిని వినియోగదారులు ఆస్వాదించడంతో పాటు.. వారి మనసులూ సంతోషంతో నిండిపోవాలని కోరుకునేదాన్ని. ఈ ఆలోచనతోనే ఇటీవలే ఆర్ట్‌ థెరపీలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేశా. ప్రస్తుతం బేక్‌ థెరపిస్ట్‌గా.. ఈ విద్యను మరికొంతమందికి నేర్పుతూ.. వారు తమ మానసిక సమస్యల్ని జయించి సంతోషాన్ని సొంతం చేసుకునేందుకు సహకరిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్