కిచెన్‌లో కాలుష్యాన్ని ఇలా తగ్గిద్దాం!

వంట చేసే క్రమంలో కొన్ని రకాల వాయువులు వెలువడడం తెలిసిందే! అయితే కొన్ని రకాల పదార్థాలు తయారుచేసేటప్పుడు పొగ అలుముకోవడం, అది ఇల్లంతా వ్యాపించడం చూస్తుంటాం. నిజానికి ఈ పొగ, వాయువుల్ని బయటికి...

Published : 26 May 2023 21:08 IST

వంట చేసే క్రమంలో కొన్ని రకాల వాయువులు వెలువడడం తెలిసిందే! అయితే కొన్ని రకాల పదార్థాలు తయారుచేసేటప్పుడు పొగ అలుముకోవడం, అది ఇల్లంతా వ్యాపించడం చూస్తుంటాం. నిజానికి ఈ పొగ, వాయువుల్ని బయటికి పంపించడానికి ప్రస్తుతం ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్‌, కిచెన్‌ చిమ్నీలు.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. అయినప్పటికీ వీటి వల్ల పర్యావరణం కలుషితమవడంతో పాటు మన ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లుతుందంటున్నారు నిపుణులు. ఇలా జరగకుండా ఉండాలంటే.. వంట చేసే క్రమంలో చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలంటున్నారు. తద్వారా ఇటు కిచెన్‌లో కాలుష్యం తగ్గించడంతో పాటు, అటు వాతావరణం పైనా ప్రతికూల ప్రభావం పడకుండా చేయచ్చంటున్నారు. మరోవైపు గ్యాస్‌/శక్తి వృథానూ తగ్గించచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఓపిక లేకో, సమయం సరిపోకో.. కొంతమంది కాయగూరల్ని పెద్ద పెద్ద ముక్కలుగా తరుగుతుంటారు. కిచెన్‌ వాతావరణం కలుషితమవడానికి ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పెద్ద ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.. గ్యాస్‌ కూడా వృథా! అదే చిన్న ముక్కలుగా కట్‌ చేస్తే.. త్వరగా ఉడికిపోతాయి.. కాలుష్యమూ తగ్గుతుంది.. అంతేకాదు.. కూర రుచిగానూ ఉంటుంది.. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.

వంట చేసే క్రమంలో కొంతమంది పాత్రలపై మూత పెట్టరు. మరికొంతమంది సగం వరకే పెట్టి వదిలేస్తారు. ఇది కూడా వంట ఆలస్యమవడానికి, ఎక్కువ పొగ వెలువడడానికి కారణమవుతుంది. మూత పెట్టకుండా వండుకోవడం వల్ల 20 శాతం అదనంగా ఇంధనం వాడాల్సి వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

కొంతమంది స్టౌపై చిన్న పాత్రల్ని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల మంట వెలిగించినప్పుడు గ్యాస్‌.. గిన్నె అడుగు భాగం దాటి పక్కకు రావడం గమనిస్తుంటాం. ఇంధనం వృథా అవడానికి, కిచెన్‌లో కాలుష్యం పెరగడానికి ఇదీ ఓ కారణమే! ఇలా జరగకూడదంటే పెద్ద పాత్రలు ఉపయోగించడం, చిన్న పాత్రల కోసం ఇండక్షన్‌ స్టౌ వాడడం.. వంటివి చక్కటి ప్రత్యామ్నాయం. తద్వారా కిచెన్‌లో వేడి కూడా తక్కువగా ఉత్పత్తవుతుంది.

కొంతమంది కాయగూరలు త్వరగా ఉడకాలన్న ఉద్దేశంతో.. ముందు వాటిని నీళ్లలో వేసి ఉడికించడం, అవసరం ఉన్నా, లేకపోయినా నీళ్లు వేడి చేయడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల కూడా అటు గ్యాస్‌ వృథా! ఇటు వాయువులూ వెలువడతాయి. పైగా ఈ ప్రక్రియ వల్ల కాయగూరల్లోని పోషకాలూ నశిస్తాయి. అలా జరగకూడదంటే వాటిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని వండుకోవడం ఉత్తమం. అలాగే నీళ్లు మరిగించడానికి ఎలక్ట్రానిక్‌ కెటిల్‌ చక్కటి ప్రత్యామ్నాయం!

ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేయడం ఆరోగ్యకరం కాదు! పైగా దీనివల్ల కూడా గ్యాస్‌ వృథా అవుతుంది. తద్వారా పర్యావరణానికీ నష్టమే!

కిచెన్‌లో పోగయ్యే తడి చెత్త కూడా వాతావరణ కాలుష్య కారకమే! అయితే ఈ వృథాతో పాటు కుళ్లిపోయిన కాయగూరలు/పండ్లు, వాడిన కాఫీ/టీ పొడి పిప్పి, కోడిగుడ్డు పెంకులు, టీబ్యాగ్స్.. వంటివన్నీ కలిపి కంపోస్ట్‌ ఎరువుగా మార్చితే.. అటు కాలుష్యమూ తగ్గుతుంది.. ఇటు దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కలకు ఎరువుగానూ ఉపయోగించచ్చు.

మొక్కల ఆధారిత ఆహారంతోనూ కిచెన్‌లో కాలుష్యాన్ని తగ్గించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ ఓ పూట.. ఆకుకూరలు, దుంపలు, పచ్చి కాయగూరలు, పండ్లతో సలాడ్స్‌ తయారుచేసుకొని తీసుకోవడం మంచిది. తద్వారా ఆ పూట వంట చేసే పని తప్పుతుంది.. తద్వారా ఇంధనం/శక్తి వృథా కాదు.. వాతావరణంపై ప్రభావమూ ఉండదు.. పైగా ఈ గ్రీన్‌ డైట్ ఆరోగ్యానికి మంచిది కూడా!

ఎవరి కిచెన్‌లో చూసినా ప్లాస్టిక్‌ డబ్బాలు, ప్లాస్టిక్‌ కవర్లే దర్శనమిస్తుంటాయి. నిత్యావసరాలు, కాయగూరలు తీసుకురావడానికీ చాలామంది ప్లాస్టిక్‌ సంచుల్నే ఉపయోగిస్తుంటారు. వీటికి బదులుగా క్లాత్‌ బ్యాగ్స్‌ ఉపయోగించడం, నిత్యావసరాల్ని గాజు/స్టీల్‌/సిలికాన్‌తో తయారుచేసిన డబ్బాల్లో భద్రపరచుకోవడం.. వంటివీ కిచెన్‌లో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయాలు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్