Updated : 11/10/2022 19:53 IST

నా భర్త ఎందుకు భయపడుతున్నాడో ఎలా తెలుసుకోవాలి?

నా భర్త ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తారు. ఆయనకు ఒక పార్టనర్‌ కూడా ఉన్నాడు. ఈ మధ్య నా భర్తకి, తనకి గొడవలు అయ్యాయి. ప్రస్తుతం విడిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. మా వారు మా ఆస్తులు కొన్నింటిని మా అమ్మానాన్న పేర్ల మీదకు మార్చారు. అయితే ఈ మధ్య తను చాలా ఆందోళనగా ఉంటున్నారు. నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త అని ఏవేవో మాట్లాడుతున్నారు. ‘ఏం జరిగిందో చెప్పండి. అవసరమైతే పోలీసుల రక్షణ తీసుకుందామం’టే చెప్పడం లేదు. తనకు మొదటి నుంచి ధైర్యం తక్కువే. ప్రతి విషయానికీ భయపడుతుంటారు. ఈ క్రమంలో- ఊరికే కంగారు పడుతున్నారా? లేక నిజంగానే ఏవైనా సమస్యలు ఉన్నాయా? అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ తన పార్టనర్‌తో నేను, మా పేరెంట్స్ మాట్లాడడం మంచిదంటారా? అసలు మా వారు ఎందుకు భయపడుతున్నారో ఎలా తెలుసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ ఆందోళన అర్ధమవుతోంది. అయితే భయస్తులు, సున్నిత మనస్తత్వం ఉన్నవారిలో చాలామంది లేని సమస్యను ఎక్కువగా ఊహించుకుని దిగులు పడుతుంటారు. ఇలాగే మీ భర్త కూడా లేని సమస్యను ఎక్కువగా ఊహించుకుంటూ ఉండచ్చు. లేదంటే నిజంగానే ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తూ ఉండచ్చు. ఆ సమస్య చిన్నదా? పెద్దదా? అనేది ఆయనకే తెలియాలి. అయితే ఇలాంటి సున్నిత మనస్తత్వం ఉన్నవారి దగ్గర్నుంచి అసలు విషయం రాబట్టడం కొంచెం కష్టం.

ఈ క్రమంలో మీరు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి మీ భర్త పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి కనుక్కోవడం.. లేదంటే నేరుగా మీ భర్త పార్టనర్‌ని అడగడం. ‘నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త’ అని మీ వారు చెప్పారంటున్నారు. దీనిని బట్టి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అర్థమవుతోంది. అయితే తన సమస్యను మీతో చెప్పడం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందిపడతారన్న భయం ఆయనకు ఉందేమో. కాబట్టి, మీరే ఒక అడుగు ముందుకేయాలి. మీ తల్లిదండ్రులతో కలిసి ఆయన పార్టనర్‌తో సానుకూల వాతావరణంలో అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో అతనిని నిందించకుండా.. మీ భర్తను కాపాడుకోవడానికి మాత్రమే ఈ విషయాలు అడుగుతున్న సందేశం అతనికి ఇవ్వండి. అసలు విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలనేది చూడచ్చు. దీనిద్వారా మీకు రెండు విధాలుగా లాభం కలుగుతుంది. ఒకటి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాన్ని తప్పించచ్చు. రెండోది మీ వారి మానసిక భారాన్ని కొంతమేర తగ్గించచ్చు. ఏదిఏమైనా మీ వారిని ఓ కంట కనిపెడుతూ ఉండడం మంచిది. సాధ్యమైనంతవరకు ఆయన ఒంటరిగా ఉండకుండా జాగ్రత్తపడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని