Published : 13/01/2022 21:08 IST

Core Exercises : ఆ కండరాల దృఢత్వానికి ఈ వ్యాయామాలు!

చాలామంది మహిళలు అటు ఇంటి పని, ఇటు ఆఫీసు పనితో తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ క్రమంలో చాలామంది తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరు. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. సమతుల ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరిపడా విటమిన్‌ ‘డి’ అందకపోవడం వల్ల చాలామంది మహిళలు కండరాల సమస్యతో బాధపడుతున్నారని పలు సర్వేల్లో కూడా తేలింది. కాబట్టి, మహిళలుగా మనకు కుటుంబ బాధ్యతలు ఎంత ముఖ్యమో.. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడమూ అంతే ముఖ్యం! అందులోనూ అన్ని పనులు చురుగ్గా పూర్తి చేసుకోవాలన్నా, చక్కటి శరీర సౌష్ఠవం పొందాలన్నా.. ప్రధాన కండర వ్యవస్థ (వెన్నెముక, పొట్ట చుట్టూ ఉండే కండరాలు) దృఢంగా ఉండడం చాలా ముఖ్యమంటోంది బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మలైకా అరోరా. ఈ నేపథ్యంలోనే ఈ కండరాల దృఢత్వాన్ని పెంపొందించే వ్యాయామాలు చేసి చూపిస్తూ ఇటీవలే ఓ వీడియో పోస్ట్‌ చేసిందామె.

వశిష్టాసనం

వశిష్టాసనం వేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు దృఢంగా మారతాయి. దీనికోసం సైడ్‌ ప్లాంక్‌ భంగిమలో ఉండాలి. ఈ క్రమంలో కుడిచేతిపై శరీర బరువును మోపి.. ఎడమ చేతిని పైకెత్తాలి. ఆపై ఎడమచేతిపై బరువును మోపి.. కుడిచేతిని పైకెత్తి ఇదే వ్యాయామం చేయాలి. ఈ వర్కవుట్‌ వల్ల భుజాలపై ఒత్తిడి పడి ఆ భాగంలోని అదనపు కొవ్వులు కరుగుతాయి. శరీర సమతుల్యత పెరగడంతో పాటు ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే ఈ ఆసనం వల్ల నడుం భాగానికి, వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలకు వ్యాయామం అంది అవి దృఢమవుతాయి.

భుజంగాసనం

యోగాసనాలు వేయడం కొత్తగా ప్రారంభించిన వారు ఎక్కువగా ఈ ఆసనం సాధన చేస్తుంటారు. ముందుగా బోర్లా పడుకొని శరీరాన్ని సాగదీస్తూ.. ఛాతీని వెనక్కి వంచుతూ, శ్వాస తీసుకుంటూ తలను పైకెత్తాలి. ఆపై కొన్ని సెకన్ల తర్వాత శ్వాస వదులుతూ మామూలు స్థితికి రావాలి. ఈ క్రమంలో శరీర బరువంతా చేతులు, కాళ్లు, పొట్టపై పడుతుంది. తద్వారా ఆయా భాగాల్లోని కండరాలు దృఢమవుతాయి. అలాగే ఈ వ్యాయామం వల్ల..

* వెన్నెముక దృఢమవుతుంది.

* పొట్ట, ఊపిరితిత్తులు, భుజాలు, ఛాతీ సాగి.. ఆయా భాగాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.

* ఉదర కండరాలు ప్రేరేపితమై పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వులు కరుగుతాయి.

* ఒత్తిడి, నీరసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఆస్తమా సమస్య ఉన్న వారికి ఇది చక్కటి వ్యాయామం.

నౌకాసనం

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వులు కరగడానికి నౌకాసనం ఉపయోగపడుతుంది. దీనికోసం శరీర బరువంతా పిరుదులపై పడేలా ‘V’ ఆకృతిలో కూర్చోవాలి. సూర్య నమస్కారాలు చేస్తున్నట్లుగా చేతుల్ని ముందుకు చాపాలి.

* ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట కండరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా ఆ కండరాలు దృఢమవుతాయి.

* భుజాలు, చేతులు, తొడల భాగంలోని కండరాలకు సైతం ఈ ఆసనం వల్ల చక్కటి వ్యాయామం అందుతుంది.

* ఈ వ్యాయామం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది.

* ఇది రక్తప్రసరణను క్రమబద్ధీకరించడంలో సహకరిస్తుంది.

గమనిక: ఈ వ్యాయామాలన్నీ సింపుల్‌గానే ఉన్నప్పటికీ.. కొత్తగా యోగా సాధనను ప్రారంభించే వారు మాత్రం నిపుణుల పర్యవేక్షణలో లేదంటే నిపుణుల సలహాలు తీసుకున్నాక చేయడం మంచిది.


CYjNMtwhgCl

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని