Rama Rajamouli: అందుకే మా అనుబంధం దృఢంగా ఉంది..!

భార్యాభర్తలిద్దరి అభిరుచులు కలవడం చాలా అరుదు.. అందులోనూ ఇద్దరి కెరీర్‌ ఒక్కటే అయినా.. ఎక్కడో ఒక చోట అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ అభిరుచులతో పాటు అభిప్రాయాలూ కలిస్తే అదే రాజమౌళి-రమా రాజమౌళి అనుబంధం అవుతుంది.

Updated : 27 Jun 2024 20:07 IST

(Photos: Instagram)

భార్యాభర్తలిద్దరి అభిరుచులు కలవడం చాలా అరుదు.. అందులోనూ ఇద్దరి కెరీర్‌ ఒక్కటే అయినా.. ఎక్కడో ఒక చోట అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కానీ అభిరుచులతో పాటు అభిప్రాయాలూ కలిస్తే అదే రాజమౌళి-రమా రాజమౌళి అనుబంధం అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ది మోస్ట్‌ వాంటెడ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌’గా పేరు తెచ్చుకున్న రమ.. మిసెస్‌ రాజమౌళిగానే కాదు.. తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నారు. భర్త కలల ప్రాజెక్టుల్లో భాగమవుతూ.. ఆయన విజయాల్లో భాగం పంచుకుంటూ అసలు సిసలైన అర్ధాంగిగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి ఆదర్శ దంపతులు ఇప్పుడు మరో ఘనతనూ కలిసే పంచుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అకాడమీలో చేరాలంటూ ఈ ఏటి ఆహ్వానం అందుకున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమ, దర్శకుల కేటగిరీలో రాజమౌళికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ నేపథ్యంలో రాజమౌళి జీవన సహచరిగా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా.. తన అనుభవాల్ని ఇలా నెమరువేసుకున్నారు రమా రాజమౌళి!

‘కాస్ట్యూమ్‌ డిజైనర్‌’ అవ్వాలనుకోలేదు!

కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌.. పెళ్లయ్యాకే ఈ మాట తొలిసారి విన్నా. నేనెప్పుడూ ఫలానా కెరీర్లో సెటిలవ్వాలని అనుకోలేదు.. నాకు అంత పెద్ద పెద్ద ఆశలు, ఆశయాలు కూడా లేవు. గృహిణిగా ఉంటే చాలనుకునేదాన్ని. పెళ్లయ్యాక నంది (రాజమౌళి)తో కలిసి షూటింగ్స్‌కి వెళ్లేదాన్ని. సెట్స్‌లో కూర్చున్నప్పుడు నటీనటుల దుస్తుల విషయంలో చిన్న చిన్న సలహాలిస్తుండేదాన్ని. అవి నందికి బాగా నచ్చేవి. ‘స్టూడెంట్‌ నం.1’ సినిమా కోసం కాస్ట్యూమ్స్‌ షాపింగ్‌కి నేనూ వెళ్లాను. అందులోని నటీనటుల పాత్రలకు సన్నివేశాల్ని బట్టి ‘అవి సూటవుతాయి.. ఇవి బాగుంటాయి..’ అని చెప్పేదాన్ని. అలా కాస్ట్యూమ్‌ ఎంపికపై నాకు తెలియకుండానే ఇష్టం పెరిగింది. ఈ క్రమంలో నంది కూడా నన్ను ప్రోత్సహించేవాడు. కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌ చాలా ఈజీ అని వెన్నుతట్టేవాడు. ఆపై ‘సింహాద్రి’ సినిమా కాస్ట్యూమ్స్ విషయంలో మరింత ఎక్కువగా ఇన్వాల్వ్‌ అయ్యాను. అయితే నేను పూర్తి స్థాయి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన తొలి చిత్రం ‘సై’. చిన్నప్పట్నుంచి నేను అమర్‌చిత్ర కథ పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. అందులోని చిత్రాలు, పాత్రలు ధరించే దుస్తులు నన్నెంతగానో ఆకర్షించేవి. వీటి స్ఫూర్తితోనే ‘మగధీర’లో కొన్ని కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశాను. ఇక నేను డిజైన్‌ చేసిన పాత్రలన్నింటిలోకెల్లా నాకు నచ్చింది ‘శివగామి’ కాస్ట్యూమ్సే!

చీరే.. నా కాస్ట్యూమ్!

సినిమాకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసేటప్పుడు పాత్ర, పాత్ర చేస్తున్న వ్యక్తి, కథ నేపథ్యం.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తుంటా. చేసే పనిని ఎంజాయ్‌ చేయడం నాకిష్టం. అంతేకానీ ఒత్తిడిగా ఫీలవ్వను. ఆపై ఇతరుల మాటలూ పట్టించుకోను. ఇక చాలామంది నన్నో ప్రశ్న అడుగుతుంటారు. ‘ఇన్ని విభిన్న కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసే మీకు ఇష్టమైన కాస్ట్యూమ్‌ ఏంటి?’ అని! నాకు చీరలంటే చాలా ఇష్టం. ఏ చిన్న సందర్భమైనా చీరకట్టుకే ప్రాధాన్యమిస్తాను. అయితే సెట్స్‌లో చీర సౌకర్యంగా అనిపించదు. అందుకే ఆ ఒక్క సందర్భంలో దాన్ని పక్కన పెట్టేస్తుంటా. ఇక ఏదైనా నేర్చుకోవడమంటే నాకు చాలా ఇష్టం! కష్టపడితే కచ్చితంగా ఫలితం ఉంటుందన్నది నా భావన. చేసే పనిని సమర్థంగా, కచ్చితంగా చేస్తే.. అదే మనమేంటో నిరూపిస్తుంది.

బుల్లితెర పైనా!

చాలామందికి నేను ఒక కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానే తెలుసు. కానీ నటనలోనూ నాకు ప్రవేశం ఉందని తెలిసిన వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. నటిగా నాకు ఆ అవకాశం ఇచ్చింది ‘అమృతం’ సీరియల్‌. ఇందులో ఒక ఎపిసోడ్‌లో న్యూస్‌ రీడర్‌గా కనిపిస్తా. మరో ఎపిసోడ్‌లో నాకు ఇష్టమైన గృహిణి పాత్రలో నటించా.


మాది తొలి చూపు ప్రేమ కాదు!

భార్యభర్తలంటే మనసులే కాదు.. అభిరుచులు, అభిప్రాయాలూ కలిసినప్పుడు అది అందమైన బంధంగా మారుతుందనేది నా నమ్మకం. చాలామంది మా ఇద్దరి మధ్య ఓ పెద్ద ప్రేమకథ ఉందనుకుంటారు. కానీ అలాంటిదేదీ లేదు. మా లవ్‌స్టోరీ చాలా సింపుల్‌. కీరవాణి కజిన్‌ రాజమౌళి. నా సోదరి వల్లితో కీరవాణి పెళ్లి జరిగింది. అప్పుడే రాజమౌళికి, నాకు పరిచయం ఏర్పడింది. ఏ సందర్భం వచ్చినా వాళ్ల కుటుంబం, మా కుటుంబం బాగా కలిసిపోయేవాళ్లం. అప్పుడు నేను ‘అమృతం’ సీరియల్‌ కోసం పని చేస్తున్నాను. అదే సమయంలో రాజమౌళి ‘శాంతి నివాసం’ కోసం పనిచేస్తున్నారు. ‘స్టూడెంట్‌ నం.1’ సినిమా విడుదలయ్యాకే ఒకరి మనసులో ఒకరం ఉన్నామని తెలుసుకున్నాం. అంతేకానీ.. మాది తొలి చూపు ప్రేమ కాదు. ఎన్నో ఏళ్లుగా మా మధ్య ఉన్న పరిచయమే మమ్మల్ని ఒక్కటి చేసింది.


ఇవే మా రిలేషన్‌షిప్‌ సీక్రెట్స్!

నంది పనిపై ఎంత శ్రద్ధ పెడతాడో.. కుటుంబానికీ అంతే ప్రాధాన్యమిస్తాడు. 99 శాతం మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. ఏ విషయమైనా సరే.. ఇద్దరం ఒకే తాటిమీద వెళ్లిపోతుంటాం. మా ఇద్దరికీ ఇగో లేదు. ప్రతిదీ సానుకూలంగానే  స్వీకరిస్తాం. ఇద్దరిదీ ఒకే రంగం కాబట్టి కలిసి గడిపే సమయం కూడా ఎక్కువే! పరిస్థితులు ఎలా ఉన్నా అందుకు తగ్గట్లుగా ఎడ్జస్ట్ అయిపోతాను. బహుశా ఇవే మా దృఢమైన అనుబంధానికి కారణమేమో అనిపిస్తుంది.

ఇంట్లో నేను తనను ‘నంది’ అని పిలుస్తుంటా.. తను నన్ను ‘చిన్ని’ అని పిలుస్తుంటాడు. ఇక మా ఇద్దరికీ పర్యటనలంటే చాలా ఇష్టం. సినిమా తర్వాత ఇంట్లో దీని గురించే ఎక్కువగా చర్చిస్తుంటాం. రిటైరైపోగానే ఏయే దేశాలు తిరగాలి? ఇంకా వెళ్లాల్సిన పర్యటక ప్రదేశాలు ఏమేం ఉన్నాయి? వంటివన్నీ ముందే ప్రణాళిక చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పటికీ ఓ సినిమా పూర్తయిందంటే మూడు నాలుగు చోట్లకు వెకేషన్‌కు వెళ్లొస్తుంటాం. ఇక కాయిన్స్‌ కలెక్షన్‌ నా హాబీ! ఇప్పటివరకు నేను పర్యటించిన దేశాల తాలూకు కాయిన్స్‌ని సేకరించి విడివిడిగా భద్రపరచుకున్నా. వాటిని ఫ్రేమ్‌ చేయించి పెట్టుకోవాలనేది నా కోరిక.


అది అమ్మ నుంచే నేర్చుకున్నా!

నేను చాలా స్ట్రాంగ్‌ ఉమన్‌ని! ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. మా అమ్మ సింగిల్‌ మదర్‌. నేను, వల్లి చిన్నతనంలో ఉన్నప్పుడే మా నాన్న పోయారు. అయినా అమ్మ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. చదువుకోకపోయినా.. ఏ పరిస్థితినైనా సానుకూలంగా ఎదుర్కొనేది. ఎప్పుడూ నవ్వుతూ, పాజిటివ్‌గా ఉండేది. ఇక మమ్మల్ని పెంచడానికి తనెంతో కష్టపడింది. పచ్చళ్లు చేసి అమ్మేది.. స్కూల్‌ హాస్టల్‌ నడిపింది. కాలేజీ మెస్‌ నడిపింది.. ఇలా తను జీవితానికి ఎదురీదడం చూసి మేమూ స్ఫూర్తి పొందాం. మమ్మల్నీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండేలా పెంచింది. ఇలా అమ్మ ధైర్యం, దృఢత్వమే మా ఇద్దరికీ వచ్చాయి.


ఇష్టపడితే కష్టమనిపించదు!

సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇంటిని, కెరీర్‌ని ఎలా బ్యాలన్స్‌ చేయగలుగుతున్నారు..? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. ఈ రెండింటినీ సమన్వయం చేయడం నాకైతే అంత కష్టంగా ఏమీ అనిపించదు. ఎందుకంటే అటు కెరీర్‌ని, ఇటు గృహిణిగా ఉండటాన్ని.. రెండింటినీ ఇష్టపడతాను, ఆస్వాదిస్తాను కాబట్టి! రోజూ ఉదయం నాలుగున్నరకే నా రోజు ప్రారంభమవుతుంది. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవడం నాకిష్టం. ఇక షూటింగ్‌ ఎక్కడ జరిగినా కనీసం ఒక్క కూరైనా వండుకొని తీసుకెళ్తుంటా. ఆదివారాలు మా కుటుంబ సభ్యులతో కలిసి పాట్‌లక్‌ పార్టీలు చేసుకుంటాం. ఈ నిరంతర షెడ్యూల్‌లో అలసట అనేదే రాదా? అంటే.. మధ్యమధ్యలో విరామం దొరికినప్పుడల్లా కునుకు తీస్తుంటా.. అంతేకానీ పని బిజీలో పడిపోయి నిద్రను అస్సలు త్యాగం చేయను. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కెరీర్‌కి ఎంత ప్రాధాన్యమిస్తానో.. ఇల్లాలిగా, భార్యగా, తల్లిగా ఉండడానికీ అంతే ఇష్టపడతా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్