ఈ క్రేజీ పెళ్లి కాంట్రాక్టుల గురించి విన్నారా?

పెళ్లంటే ఏడేడు జన్మల బంధం.. వివాహ క్రతువులో వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఎన్నెన్నో ప్రమాణాలు చేసుకుంటారు.. వాటికి కట్టుబడి ఉంటామని బాస చేసుకుంటారు. అయితే మొదట్లో కొన్నాళ్ల పాటు వీటిని కచ్చితంగా పాటించినా.. ఆ తర్వాత మాత్రం ఇవి ఒక్కొక్కటిగా.....

Updated : 08 Dec 2022 14:49 IST

(Representational Images)

పెళ్లంటే ఏడేడు జన్మల బంధం.. వివాహ క్రతువులో వేద మంత్రాల సాక్షిగా వధూవరులు ఎన్నెన్నో ప్రమాణాలు చేసుకుంటారు.. వాటికి కట్టుబడి ఉంటామని బాస చేసుకుంటారు. అయితే మొదట్లో కొన్నాళ్ల పాటు వీటిని కచ్చితంగా పాటించినా.. ఆ తర్వాత మాత్రం ఇవి ఒక్కొక్కటిగా కనుమరుగవుతుంటాయి. దాంతో నిండు నూరేళ్ల పాటు దృఢంగా ఉండాల్సిన ఆలుమగల అనుబంధం కాస్తా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. మరి, ఈ గొడవలన్నీ ఎందుకనుకున్నారో ఏమో.. ఓ కొత్త జంట పెళ్లిలోనే ఓ ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంప్‌ పేపర్‌పై తాము సంతకాలు పెట్టడమే కాదు.. ఇద్దరు సాక్షుల సంతకాలు తీసుకొని మరీ ఏడడుగులు నడిచింది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.


వారి అనుభవాలు చూశాక..!

ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్యైనా ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతుంటాయి. వాటిలో ఒకరితో ఒకరు కాకుండా.. ఎవరికి వారు వ్యక్తిగత సమయం కేటాయించుకోవడం కూడా ఒకటి. ముఖ్యంగా భర్త రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, ఈ క్రమంలో తనను కాదని ఈ సమయాన్ని తన స్నేహితులకు కేటాయించడం ఏ భార్యా జీర్ణించుకోలేదు. ఇలా ఈ విషయంలో చాలామంది దంపతుల మధ్య గొడవలు జరగడం మనం చూస్తుంటాం. తన స్నేహితులకూ ఇలాంటి అనుభవాలున్నాయని తెలుసుకుంది కేరళ కోజికోడ్‌లోని పాలక్కడ్‌కు చెందిన అర్చన. ఇలాంటివి తమ దాంపత్య జీవితంలో ఎదురవకూడదని ముందుగానే నిర్ణయించుకుంది. అందుకే ఈ విషయంలో తనకు కాబోయే భర్తతో పెళ్లిలోనే ఓ ఒప్పందం కుదుర్చుకోవాలనుకుందీ కొత్త పెళ్లి కూతురు.

9 గంటల వరకే డెడ్‌లైన్..!

పాలక్కడ్‌లో రఘు అనే అబ్బాయిని ఇటీవలే వివాహమాడిన అర్చన.. పెళ్లిలో భాగంగా తన భర్తతో ఇలా ఒప్పందం చేసుకుంది. ‘పెళ్లయ్యాక నా భర్త రఘు.. వాళ్ల స్నేహితులతో సమయం గడపడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ సమయంలో నేను తనకు కాల్‌ చేయను.. వాళ్లను డిస్టర్బ్‌ చేయను.. కానీ రాత్రి 9 గంటలకల్లా ఇంటికి చేరుకోవాలి.. ఈ ఒప్పందానికి సరే అంటేనే పెళ్లి..’ అంటూ తన మనసులోని మాటల్ని రూ.50 స్టాంప్‌ పేపర్‌పై రాసి సంతకం పెట్టింది అర్చన. అందుకు రఘు కూడా అంగీకరిస్తూ సంతకం చేశాడు. ఇక ఈ ఒప్పంద పత్రంపై మరో ఇద్దరు సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారీ నవ దంపతులు. ఇలా రఘు-అర్చనల పెళ్లి ఒప్పందానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చాలామంది స్పందిస్తూ.. ‘మరైతే మీరు కూడా ఇలా ఒప్పందం చేసుకొని.. మీ ఫ్రెండ్స్‌తో ఫుల్లుగా ఎంజాయ్‌ చేసేయండి..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పుడే కాదు.. గతంలోనూ కొన్ని జంటలు దాంపత్య జీవితానికి సంబంధించి ఇలా క్రేజీ కాంట్రాక్టులు కుదుర్చుకుని వార్తల్లో నిలిచాయి.


నూరేళ్ల కాంట్రాక్ట్‌ ఇది!

సాధారణంగా పెళ్లైన కొన్నేళ్లకు కొన్ని జంటలు.. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కుదరక తరచూ గొడవలు పడుతుంటారు. ‘నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లట్లేదు..’, ‘నాకోసం కనీసం బ్రేక్‌ఫాస్ట్‌ కూడా ప్రిపేర్‌ చేయట్లేదు..’ అంటూ భార్యాభర్తలిద్దరూ కీచులాడుకోవడం చూస్తుంటాం. అయితే ఇలా పెళ్లి తర్వాత గొడవ పడడం కంటే పెళ్లికి ముందే కొన్ని విషయాల్లో ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదనుకున్నట్లున్నారు అసోంకు చెందిన శాంతి-మింటు జంట. అందుకే వివాహం తర్వాత శాంతి తన భర్త నుంచి ఏం ఆశిస్తోంది? అతను తనతో ఎలా ఉండాలనుకుంటోంది? ఇలా తన మనసులోని ఆలోచనలన్నీ ఓ పెద్ద పేపర్‌పై ప్రింట్‌ చేయించింది. ఈ కాంట్రాక్ట్‌ పేపర్‌పై మండపంలోనే, అందరి సమక్షంలో ముందు తాను సంతకం చేసి.. ఆపై వరుడి సంతకం కూడా తీసుకుంది.

ఇంతకీ, ఏంటా కండిషన్లు?!

ఇంతకీ వధువు శాంతి ఈ ఒప్పంద పత్రంలో ప్రింట్‌ చేయించిన ఆ కండిషన్లు ఏంటో మీరే చూడండి..

⚛ నాకు నెలకో పిజ్జా తినిపించాలి.

⚛ ఎక్కువగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.

⚛ లేట్‌నైట్‌ పార్టీలకు ఒప్పుకుంటా.. అయితే అదీ నాతో అయితేనే..!

⚛ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి.. అందుకు రోజూ జిమ్‌కి వెళ్లాలి.

⚛ ఆదివారాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ నువ్వే (వరుడు) ప్రిపేర్‌ చేయాలి.

⚛ నేను హాజరయ్యే పార్టీలు, ప్రత్యేక సందర్భాల్లో నన్ను బాగా ఫొటో తీయాలి.

⚛ ప్రతి 15 రోజులకోసారి నన్ను షాపింగ్‌కి తీసుకెళ్లాలి.

ఇవన్నీ పెళ్లికూతురు శాంతి పెట్టిన నిబంధనలైతే, ఇక పెళ్లి కొడుకు కూడా తన భార్య రోజూ కచ్చితంగా చీరే ధరించాలి అన్న కండిషన్ పెట్టడం, దీనికి శాంతి అంగీకరించడం గమనార్హం. ఇలా ఎనిమిది ఒప్పందాలతో కూడిన ఈ వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ వీడియోను wedlock_photography_assam అనే సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేయగా.. ఆ సమయంలో అది తెగ వైరలైంది.


ఇలా అయితేనే..!

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, టెడెక్స్‌ స్పీకర్‌ అయిన సిమ్రన్ తన కాలేజ్‌ ఫ్రెండ్, వ్యాపారవేత్త అయిన నిఖిల్‌ కబియా జైన్‌ను ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఈ జంట పెళ్లి వేదికపై కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన పెద్ద సైన్‌ బోర్డును వరుడి స్నేహితులు వేదికపైకి తీసుకొచ్చారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టిందీ క్రేజీ పెళ్లికూతురు.

వరుడి కండిషన్లు..!

పెళ్లికూతురికి వరుడు పెట్టిన కండిషన్లు ఇలా ఉన్నాయి..

⚛ ఇంటి పనికి ‘నో’ చెప్పకూడదు.

⚛ రోజూ చీర ధరించాలి.

⚛ రోజూ గంట సమయం పూజకు కేటాయించాలి.

⚛ తక్కువగా మాట్లాడాలి.

⚛ ఫొటోలు తక్కువగా తీసుకోవాలి.

అసలే ఇలాంటి మూసధోరణులకు వ్యతిరేకి అయిన సిమ్రన్‌.. ఇందులో కొన్ని తనకు నచ్చకపోవడంతో ఆ కండిషన్లను ఇలా మార్చేసింది!

⚛ ఇంటి పనులు ఇద్దరం కలిసి చేసుకోవాలి.

⚛ నాకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తులే వేసుకుంటాను.

⚛ నేనెలా మాట్లాడతానో ఇప్పటికే నీకు తెలుసు.. కాబట్టి ఇక పైనా ఇద్దరం అలాగే మాట్లాడుకుందాం.

⚛ నువ్వు ఏ మూడ్‌లో ఉన్నా నా ఫొటోలు, వీడియోలు తీయమని నేను నిన్ను అడుగుతాను.

⚛ నేను నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.

ఇలా సిమ్రన్‌ చేసిన మార్పులకు అంగీకరిస్తూ నిఖిల్‌ కాంట్రాక్ట్‌పై సంతకం చేశాడు. ఆపై సిమ్రన్‌ కూడా చేయడంతో ఇద్దరి పెళ్లికి శుభం కార్డు పడ్డట్లైంది. ఈ వెడ్డింగ్‌ కాంట్రాక్ట్‌ కూడా అప్పుడు వైరల్‌గా మారడంతో చాలామంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ‘ఇలా ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య బంధంలో అసలు గొడవలే రావు..’ అంటూ కామెంట్లు షేర్‌ చేశారు.

సరదాగానో, సీరియస్‌గానో తెలియదు కానీ.. ఇలా కొన్ని జంటలు చేసుకున్న క్రేజీ పెళ్లి కాంట్రాక్టులు మాత్రం చాలామందిని ఆకట్టుకున్నాయి. వీటిని చూసి కొంతమంది తమ పెళ్లిలోనూ ఇలాంటి ఒప్పందాలు చేసుకొని మురిసిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని