Titas Sadhu : అప్పుడు స్కోర్ కీపర్.. ఇప్పుడు ఛాంపియన్!
మహిళల క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌తో సమానంగా ఆదరిస్తున్నారు భారతీయులు. ఈ అభిమానంతోనే వాళ్లు ఏ టోర్నీలో పాల్గొన్నా కప్పుతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడూ ఇదే కాంక్షించారు.
(Photos: Instagram)
మహిళల క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌తో సమానంగా ఆదరిస్తున్నారు భారతీయులు. ఈ అభిమానంతోనే వాళ్లు ఏ టోర్నీలో పాల్గొన్నా కప్పుతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి అడుగుపెట్టినప్పుడూ ఇదే కాంక్షించారు. ఇలా కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల ఆకాంక్షను నెరవేర్చుతూ తాజాగా స్వర్ణ పతకం సాధించారు మన అమ్మాయిలు. ఈ జర్నీలో జట్టు సభ్యులందరి పాత్ర కీలకమే అయినా.. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తన బౌలింగ్‌తో మాయచేసింది యువ పేసర్ టిటాస్ సాధు. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన ఆమె.. ఇప్పుడు ఆసియా క్రీడల స్టార్‌గా మారిపోయింది. ఈ క్రమంలో ఈ యువ ఛాంపియన్ క్రికెట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం..
అరంగేట్రంలోనే స్వర్ణం!
చైనాలోని హంగ్‌ఝౌలో ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. అయితే పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం సాధించి కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల మనసులు కొల్లగొట్టింది భారత మహిళల జట్టు. ఈ క్రీడల్లో భాగంగా మ్యాచ్ మ్యాచ్‌కు తన ప్రదర్శనను మెరుగుపరచుకుంటూ వచ్చిన మన అమ్మాయిలు.. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకే పరిమితమైంది. తుది మ్యాచ్‌లో తన బౌలింగ్ మాయాజాలంతో లంక టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టిన 18 ఏళ్ల పేసర్ టిటాస్ సాధు.. జట్టు విజయంలో, తద్వారా స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆరు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఈ యువ పేసర్ బౌలింగ్‌ను అటు ప్రముఖులు, ఇటు క్రికెట్ ప్రేమికులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఆసియా క్రీడల స్టార్, పేస్ సెన్సేషన్ అంటూ కొనియాడుతున్నారు.
చదువుల తల్లి!
టిటాస్ పశ్చిమ బంగలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచి చదువు, ఇతర వ్యాపకాల్లో రాణించేదామె. పదో తరగతిలో 93 శాతం మార్కులతో పాసైన ఆమె ప్రతిభను చూసి.. భవిష్యత్తులో ఏ ఉన్నతోద్యోగంలోనో స్థిరపడుతుందేమో అనుకున్నారంతా! కానీ చదువుతో పాటు ఆటల్లోనూ తనకు ప్రావీణ్యం ఉందని నిరూపించుకుంది టిటాస్. ఓవైపు స్కూల్లో టాపర్‌గా నిలుస్తూనే.. మరోవైపు పరుగు, ఈత వంటి క్రీడల్లో రాణించేది. అయితే ఆటలపై మక్కువ తన రక్తంలోనే ఉందంటోందీ యువ ప్లేయర్.
‘నాకు చిన్నతనం నుంచి చదువంటే ప్రాణం. ఆటలపైనా అంతటి మక్కువనే చూపేదాన్ని. ఇందుకు కారణం మా నాన్నే. గతంలో తను క్రీడాకారుడిగా రాణించారు. ప్రస్తుతం హూగ్లీలో సొంతంగా ఓ క్రికెట్ అకాడమీ నడుపుతున్నారు. నాన్నను చూస్తూ పెరిగిన నాకు క్రీడలపై ఆసక్తి కలిగింది. ఈ క్రమంలో పరుగు, ఈత, క్రికెట్.. వంటి క్రీడల్లో మెరుగ్గా రాణించేదాన్ని. అయితే వివిధ క్రీడల్లో నైపుణ్యాలున్నా నా మనసు క్రికెట్‌నే కోరుకుంది. మాకంటూ సొంతంగా ఓ క్రికెట్ క్లబ్ ఉంది. చిన్నప్పుడు అందులోనే స్కోర్ కీపర్ (స్కోర్ రికార్డ్ చేసే వ్యక్తి)గా ఉండేదాన్ని. అక్కడే తొలిసారి నాకు క్రికెట్ పరిచయమైంది..’ అంటూ చెబుతోంది టిటాస్.
ఝులన్ ప్రశంసలు!
తన తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో శిక్షణ తీసుకున్న టిటాస్.. 13 ఏళ్ల వయసులో స్టేట్ ట్రయల్స్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ అందులో ఎంపిక కాలేదు. అయినా జట్టులోకి రావడానికి తన ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదామె. ఇక 16 ఏళ్ల వయసులో ఈ యువ పేసర్ బౌలింగ్ నైపుణ్యాలు సీనియర్ ప్లేయర్ ఝులన్ గోస్వామిని ఆకట్టుకున్నాయి. దీంతో ‘తనో అద్భుతమైన పేసర్.. భవిష్యత్తులో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది..’ అంటూ ఆమె ప్రశంసలు అందుకుంది టిటాస్. ఝులన్ ప్రోత్సాహంతో అదే ఏడాది సీనియర్ బెంగాల్ జట్టుకు ఎంపికైందామె. ఇక అప్పట్నుంచి వెనుతిరిగి చూడలేదు టిటాస్. పేసర్‌గా ఇటు బాల్‌తో రాణిస్తూనే.. కీలక సమయంలో బ్యాట్ ఝుళిపించగలదీ బెంగాల్ ప్లేయర్. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన మహిళల ప్రిమియర్ లీగ్‌లో ‘దిల్లీ క్యాపిటల్స్’ జట్టు తరఫున ఆడింది టిటాస్. ఇక ఈ ఏడాది జనవరిలో జరిగిన తొలి ‘అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్’లో భారత మహిళల జట్టు తరపున ఆడిన ఈ యువ పేసర్.. జట్టు విజేతగా నిలవడంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ మరోసారి తన బౌలింగ్ మాయాజాలంతో టీమిండియా స్వర్ణం నెగ్గడంలో ముఖ్య భూమిక పోషించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.