Updated : 03/12/2022 12:59 IST

పెరుగు.. పొట్టకే కాదు.. జుట్టుకీ..!

పెరుగు.. పొట్టకే కాదు.. జుట్టుకీ మంచిదే అంటున్నారు నిపుణులు. పెరుగుతో కలిపి వేసుకునే కొన్ని హెయిర్ ప్యాక్స్ వివిధ జుట్టు సమస్యలను పోగొట్టి వెంట్రుకలకు బలాన్ని, మెరుపునూ ఇస్తాయి. ఇదిగో ఈ ప్యాక్స్ ఇలాంటివే..

పెరుగు, మినుములతో..

జుట్టు మృదువుగా, బలంగా తయారు కావాలంటే ఈ ప్యాక్ ప్రయత్నించండి.

కావాల్సినవి

⚜ మినుములు - అర కప్పు

⚜ పెరుగు - అర కప్పు

ప్యాక్ ఇలా!

మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.

⚜ ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.

పెరుగు, మెంతులతో..

మీ జుట్టు చివర్లు చిట్లిపోయి ఎక్కువగా జుట్టు రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి..

కావాల్సినవి

⚜ గడ్డ పెరుగు - ఒక కప్పు

⚜ మెంతులు - పావు కప్పు

ప్యాక్ ఇలా!

ముందుగా మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారైన పొడిని పెరుగులో వేసి పేస్ట్‌లా అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు, మాడుకూ పట్టించి గంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేసి కండిషనర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన మెంతుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని అరికడుతుంది.

గుర్తుంచుకోండి..

⚜ ఈ ప్యాక్‌ను పొడిగా ఉన్న జుట్టు పైనే అప్త్లె చేసుకోవాలి.

⚜ వారానికోసారి ఈ ప్యాక్ ట్రై చేయచ్చు.

⚜ వేసుకోవడానికి కనీసం రెండు గంటల ముందే ఈ ప్యాక్ తయారు చేసి పెట్టుకోవాలి.

చూశారుగా.. పెరుగు మీ జుట్టు సమస్యలను ఎలా పోగొడుతుందో.. కాబట్టి ఇలాంటి సహజసిద్ధమైన, సులభంగా తయారు చేసుకునే హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించి ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మీ కురులను కాపాడుకోండి. అయితే ఈ క్రమంలో- తలస్నానానికి ఉపయోగించే షాంపూ గాఢత తక్కువగా ఉండేలా జాగ్రత్తపడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని