Published : 23/11/2021 20:35 IST

ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ని కాపాడుకోవడమెలా..?

మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్తైన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుందనుకుంటే.. ఇక నార్మల్‌గానే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్ ఈ కాలంలో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా ఊడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మన అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందామా..

బ్లో డ్రయర్స్ వద్దు!

చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టును త్వరగా ఆరబెట్టుకోవాలన్న ఆతృతతో బ్లో డ్రయర్స్ ఉపయోగిస్తుంటారు. కానీ అందులో నుంచి వెలువడే వేడి వల్ల కేశాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు.. ఈ వేడి కర్ల్స్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి తలస్నానం చేశాక జుట్టుకు కాసేపు మెత్తటి కాటన్ టవల్ చుట్టుకోవాలి. తద్వారా కేశాలు కాస్త పొడిగా మారతాయి. ఆ తర్వాత సహజసిద్ధంగా ఆరనివ్వాలి. ఈ క్రమంలో దువ్వాలనుకుంటే అందుకు లావుగా ఉండే బ్రిజిల్స్ కలిగిన దువ్వెనను ఉపయోగించడం శ్రేయస్కరం. అలాగే తలస్నానానికి కూడా గాఢత తక్కువగా ఉండే షాంపూను లేదంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన షాంపూలను ఉపయోగించడం రింగుల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

కండిషనింగ్ మరవద్దు..

తలస్నానం చేసిన వెంటనే కండిషనర్ రాసుకోవడం మనలో చాలామందికి అలవాటు. ఇది జుట్టును మృదువుగా మారేలా చేయడంతో పాటు మెరిసేలా చేస్తుంది. అయితే కర్లీ హెయిర్ ఉన్న వారు కూడా ఈ చలికాలంలో తలస్నానం చేసిన వెంటనే జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు కండిషనర్ రాసుకోవాలి. రెండుమూడు నిమిషాలుంచుకొని ఆపై కేశాలను నీటితో కడిగేస్తే సరి. అయితే కర్ల్స్ కాస్త ఎక్కువగా ఉన్న వారు కండిషనర్‌ను ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల జుట్టుకు తగిన పోషణ అందుతుంది.

నూనెల్ని కాస్త వేడి చేయండి..

జుట్టును ఆరోగ్యంగా చేయడంలో నూనెల పాత్ర కూడా కీలకమే. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి అత్యవసర నూనెలతో తరచూ జుట్టుకు మసాజ్ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారకుండా కూడా కాపాడుకోవచ్చు. అయితే చలికాలంలో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి, అది పొడిబారకుండా ఉండడానికి గోరువెచ్చటి నూనెతో మసాజ్ చేయడం తప్పనిసరి. అది కూడా తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టుకు చక్కటి పోషణ లభిస్తుంది. కాబట్టి మనం ఉపయోగించేది ఏ నూనె అయినా సరే.. దాన్ని అప్లై చేసుకునే ముందు కాస్త వేడి చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

కవర్ చేసుకుంటున్నారా?

జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ఈ కాలంలో వీచే చల్లగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది జుట్టు అందాన్ని కాపాడడమే కాదు.. అతివల్ని ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేయడానికీ దోహదం చేస్తుంది.

న్యాచురల్‌గా ట్రై చేయండి..

ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి మరికొన్ని సహజసిద్ధమైన చిట్కాల్ని సైతం ప్రయత్నించచ్చు.

* సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీరు తాగాలనిపించదు. కానీ రింగుల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే బరువును బట్టి రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం మాత్రం మర్చిపోవద్దు.

* అలాగే ఎనిమిది గంటలు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికీ ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండచ్చు.

* అప్పుడప్పుడూ కొన్ని చుక్కల హెయిర్ సీరంను రాసుకోవడం వల్ల కూడా కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవచ్చు.

* కలబంద జుట్టుకు తేమనందించడంలో చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వారానికి రెండు సార్లు కలబంద గుజ్జును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఆపై 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

* రింగుల జుట్టు ఉన్న వారు ఎక్కువగా బాధపడేది చిట్లిన చివర్లతోనే! దానివల్ల కేశాలు నిర్జీవంగా కనిపిస్తాయి కూడా! కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా ఎదగడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది.

* జుట్టు తేమను కోల్పోకుండా చేయడంలో తేనె పాత్ర కీలకం. అందుకే జుట్టుకు పోషణనందించే కండిషనర్లు, డీప్ కండిషనర్లతో పాటు క్లెన్సర్‌లలోనూ కాస్త తేనెను కలుపుకొని అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని