Published : 13/06/2021 19:05 IST

ఒక ముద్దు.. ఒక హగ్గు.. అన్యోన్యత పెరగడానికి కావాల్సినవెన్నో!

‘నీకన్నా నా సంపాదన ఎక్కువ.. కాబట్టి నువ్వు నా చెప్పుచేతల్లో ఉండాల’న్నట్లుగా ప్రవర్తిస్తుంటుంది అన్విత. అది తన భర్త ఆకాశ్‌కు నచ్చదు.. దాంతో రోజూ ఇంట్లో గొడవలే!
భార్యను బానిసలా చూసే మగాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. వినోద్‌ కూడా అలాంటివాడే! తన భర్త ప్రవర్తనతో రెండేళ్లుగా విసిగిపోయిన రంజని ఇక నా వల్ల కాదని ఈ మధ్యే పుట్టింటికి వెళ్లిపోయింది.
అన్యోన్య దాంపత్యమంటే ఇలా అహం, ఆధిపత్యం కాదు.. ఆప్యాయత, అనురాగం అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. కానీ నేటి యువ జంటల్లో ఇది కొరవడుతోందని చెబుతున్నారు. నిజానికి దంపతుల్లో ఇలాంటి పొరపచ్ఛాలు, గొడవలు, కసుర్లు-విసుర్లు ఉన్నా.. అవి కొంత సమయానికే పరిమితం కావాలని.. అప్పుడే ఆలుమగల అనుబంధం దృఢమవుతుందని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ రోజూ కొన్ని నియమాల్ని పాటిస్తూ.. వాటిని అలవాట్లుగా మార్చుకుంటే భార్యాభర్తల అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి, ఏంటా రిలేషన్‌షిప్‌ చిట్కాలు? మనమూ తెలుసుకుందాం రండి..


ఆరోగ్యంతో అన్యోన్యత!
వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా.. ఇలా కారణమేదైనా చాలామందిలో ఒత్తిడి, ఆందోళనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చాలామంది దంపతుల్లో గొడవలు, పొరపచ్ఛాలకు ఇవే కారణమంటున్నారు నిపుణులు. అందుకే వీటికి చెక్‌ పెట్టాలంటే ముందుగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎవరైతే రోజూ అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటారో వారు మానసికంగా దృఢంగా ఉన్నట్లు ఓ బ్రిటిష్‌ అధ్యయనం రుజువు చేస్తోంది. అంతేకాదు.. ఇలాంటి ఆహారంతో శక్తిస్థాయులు కూడా పెరిగినట్లు.. ఇది అంతిమంగా సానుకూల దృక్పథాన్ని రెట్టింపు చేసినట్లు ఆ అధ్యయనం చెబుతోంది. ఇలా మనలో పాజిటివిటీ ఉంటే ఎదుటివారి ఆలోచనల్నీ మనం సానుకూలంగానే అర్థం చేసుకోవచ్చు. సో.. దంపతులిద్దరూ ఇలా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, సానుకూల దృక్పథంతో ఉంటే ఇక వారి మధ్య ప్రేమ తప్ప మరే ఆలోచన ఉండదని చెప్పకనే చెబుతోందీ అధ్యయనం! 


వాటిని నోట్‌ చేయాల్సిందేనట!
అన్యోన్య దాంపత్య బంధంలో ఎప్పుడూ ప్రేమే కాదు.. చిలిపి తగాదాలూ ఉండాల్సిందేనంటున్నారు నిపుణులు. అయితే గొడవ పడడం, ఆపై ఎవరిది తప్పైతే వారు సారీ చెప్పుకోవడంతో పరిస్థితి సద్దుమణుగుతుంది. దీంతో ఆ తగాదా గురించి మర్చిపోతుంటారు దంపతులు. అయితే ఇలాంటి చిన్న చిన్న గొడవల్ని మాటలతోనే ఆపేయకుండా.. పేపర్‌పై పెట్టమంటోంది నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనం. ఎందుకంటే గొడవపడే సమయంలో తమదే తప్పైనా సరే.. దాన్ని ఒప్పుకునే స్థితిలో వారు ఉండరు.. తమదే కరక్ట్‌ అన్నట్లుగా మాట్లాడతారు. అదే కాసేపయ్యాక తప్పెవరిదో తెలుసుకుంటారు. కాబట్టి ఇలాంటి గొడవలకు అక్షర రూపమిస్తే ఇద్దరి మధ్య గొడవలకు అసలు కారణమేంటి? అందులో ఎవరి తప్పుంది? వంటి విషయాలన్నీ అవగతమవుతాయి. తద్వారా ఆ తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇలా గొడవ పడే దంపతులు తమ తగాదాల్ని నోట్‌ చేసుకోవడం వల్ల వారి భాగస్వాముల్ని మరింత బాగా అర్థం చేసుకోగలరంటోందీ అధ్యయనం! కాబట్టి ఇకపై జరిగే గొడవల్ని అలా వదిలేయకుండా డైరీలో నోట్‌ చేసుకొని మీ మధ్య అన్యోన్యతను రెట్టింపు చేసుకోండి.


ఒక ముద్దు.. ఒక హగ్గు!
భార్యాభర్తల బంధం ఒక భావోద్వేగపూరిత సంబంధం. ఇలా ఇద్దరి మధ్య ఎమోషన్స్‌ ఎప్పటికీ ముడిపడి ఉండాలంటే వారి రొటీన్‌లో రోజూ కౌగిలింతలు, ముద్దులు ఉండాల్సిందేనంటున్నారు నిపుణులు. ఇలా ఒకరినొకరు కౌగిలించుకునే క్రమంలో శరీరంలో ఆక్సిటోసిన్‌ అనే లవ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది దంపతులిద్దరినీ ఎమోషనల్‌గా కలిపి ఉంచుతుంది. ఇక ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌, సెరటోనిన్‌.. అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఇద్దరిలో ఉన్న ఒత్తిడిని దూరం చేసి వారి మధ్య అనుబంధాన్ని మరింతగా పెంచుతాయి. కాబట్టి దంపతులిద్దరూ ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజూ ముద్దులు, కౌగిలింతలకు కాస్త సమయం కేటాయించాలంటున్నారు నిపుణులు.


మీ ప్రశ్న.. వారి సమాధానం!
దంపతులిద్దరూ కలిసి ఎంత సమయం గడిపితే వారి మధ్య అనుబంధం అంతలా దృఢమవుతుందన్న విషయం తెలిసిందే! అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరూ కూర్చొనే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. ఇంటి పని చేస్తూ, వంట పని చేస్తూ, భోంచేసేటప్పుడు.. ఇలా సమయం వృథా కాకుండా కూడా ఒకరితో ఒకరు సమయం గడపచ్చు. అయితే ఈ క్రమంలో ఒకరికొకరు రోజుకో ఆసక్తికరమైన ప్రశ్నను సంధించుకోవాలంటున్నారు నిపుణులు.
ఇందులో భాగంగా.. ‘నాలో నీకు నచ్చిన, నచ్చని అంశాలేంటి?’, ‘నేను నీకిచ్చిన తొలి పుట్టినరోజు కానుకేంటి?’.. వంటి ప్రశ్నలు అడగచ్చు. ఆలోచించాలే కానీ.. ఇలాంటి ప్రశ్నలకు తావే ఉండదు. పైగా ఇలా ఒకరి గురించి మరొకరు సమాధానం రాబట్టే క్రమంలో మధ్యమధ్యలో జోక్స్ వేసుకోవచ్చు.. సరదాగా నవ్వుకోవచ్చు.. ఇలా సరదాగా సాగే సంభాషణ ఇద్దరి మనసుల్ని మరింత దగ్గర చేస్తుందనడంలో సందేహమే లేదు.


వారానికో అరగంట..!
వైవాహిక బంధం శాశ్వతమైనది.. సుఖదుఃఖాల్లో జీవితాంతం ఒకరికొకరు జంటగా ఉండాల్సిన అందమైన బంధం. అలాంటి బంధంలో ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు, అనుమానాలకు తావుండకూడదు. అదే సమయంలో భవిష్యత్‌ ప్రణాళికల విషయంలోనూ ఇద్దరికీ ఒక స్పష్టత ఉండాలి. ఇలా జరగాలంటే కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు! అయితే కొంతమంది దంపతులు ఒకరినొకరు సంప్రదించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఇద్దరి మధ్య పొరపచ్ఛాలు రావడం, అది చినికి చినికి గాలివానలా మారి వారి బంధంలో చిచ్చుపెట్టడం.. వంటివి మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదంటే వారానికోసారి ఓ అరగంట సమయం కేటాయించుకొని భార్యాభర్తలిద్దరూ వ్యక్తిగత ప్రణాళికలు, కుటుంబ ప్రణాళికల గురించి మాట్లాడుకోవాలి. ఈ క్రమంలో గత వారంలో అనుకున్న పనులు పూర్తయ్యాయా? వచ్చే వారం ఇంకా ఎలాంటి విషయాల గురించి ప్లాన్ చేసుకోవాలి.. మొదలైన వాటి గురించి మాట్లాడుకుంటే అన్ని విషయాల్లో ఇద్దరికీ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడడంతో పాటు ఇద్దరి మధ్య అనుబంధమూ రెట్టింపవుతుంది.
ఏంటీ.. ఇవన్నీ చదువుతుంటే మీ దాంపత్య బంధంలో మీరు పాటించే అలవాట్లు, నియమాలు గుర్తొస్తున్నాయా? అయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోండి.. ఇలా మీరు పంచుకునే ఆలోచనలు, ఇచ్చే సలహాలు మరెన్నో జంటలకు ఉపయోగపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని