Beauty Tips: అందుకే వీరికి మొటిమలు రావట!

కొంతమంది అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది. నిజానికి వారు పాటించే రోజువారీ అలవాట్లతోనే న్యాచురల్‌ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. మరి, అవేంటో తెలుసుకుందామా...

Published : 19 Jul 2023 12:35 IST

కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్‌ మాయాజాలం లేకుండానే న్యాచురల్‌ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది. నిజానికి ఈ మహిమంతా చికిత్సలు, చిట్కాల్లో కాదు.. వారు పాటించే రోజువారీ అలవాట్లలో ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?!

ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు.. ఈ రెండు సందర్భాల్లో ముఖం శుభ్రపరచుకునే వారు చాలా తక్కువమంది. ముఖంపై మొటిమలు రావడానికి ఈ నిర్లక్ష్యమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ఈ రెండు సందర్భాలతో పాటు.. చెమట ఎక్కువగా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖం శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఫలితంగా ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోవు.. తద్వారా మొటిమలూ ఏర్పడవు. అయితే ఈ క్రమంలో చర్మతత్వానికి సరిపడే ఫేస్‌వాష్‌ను ఎంచుకోవడమూ ముఖ్యమే!

పబ్లిక్‌ టాయిలెట్‌ కంటే మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌ మాట్లాడేటప్పుడు, మొబైల్‌ను తాకిన చేతులతోనే ముఖాన్ని తడుముకోవడం వల్ల ఈ క్రిములు ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయి. ఈ సమస్య దరిచేరకుండా.. ఫోన్‌ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

చేతుల్ని పదే పదే ముఖానికి తాకించే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఫలితంగా చేతులకున్న క్రిములు, మురికి ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయి. అందుకే ముఖం కడుక్కునేటప్పుడు తప్ప అసలు చేతుల్ని ముఖానికి తాకించకుండా జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు.

రోజూ వాడే క్రమంలో మన చర్మం, జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు దిండు కవర్ల పైకి చేరుతుంది. అది వాతావరణంలోని దుమ్మును ఆకర్షిస్తుంది. ఈ అపరిశుభ్రమైన దిండ్లనే వారాల తరబడి వాడడం, ఇతరులు వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయి. కాబట్టి వారానికోసారైనా దిండ్ల కవర్లను మార్చుకోవడం, ఎవరి దిండు వారే వాడుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

మొటిమల బెడద లేని వారు.. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరిస్తారట! ఈ క్రమంలో కాయగూరలు, ఆలివ్‌ నూనె, తృణ ధాన్యాలు, తక్కువ మొత్తంలో మాంసం.. వంటివి తీసుకుంటారట! వీటి ద్వారా చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంటున్నారు నిపుణులు.

అధిక బరువూ మొటిమల సమస్యకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీరి శరీరంలో ఆండ్రోజెన్లు, ఇన్సులిన్‌ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

కుదుళ్లలో ఉత్పత్తయ్యే సహజ నూనెలు ముఖంపై చర్మ రంధ్రాల్ని మూసుకుపోయేలా చేసే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే కుదుళ్లు జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడమంటున్నారు. ఈ క్రమంలో వారానికోసారి లేదా రెండుసార్లు తలస్నానం చేయడం వల్ల మొటిమల సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.

ఎదిగే అమ్మాయిల్లో మొటిమల సమస్యకు పాలు తాగే అలవాటు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. పాలలో ఉండే ఆండ్రోజెన్‌ హార్మోన్లే ఇందుకు కారణమవుతాయట! అందుకే సాధారణ పాలకు బదులుగా కొబ్బరి పాలను తీసుకుంటే ఈ సమస్య ఉండదంటున్నారు. కొబ్బరి పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

లిప్‌స్టికే కదా అని కొంతమంది దీన్ని తమ ఫ్రెండ్స్‌తో పంచుకుంటుంటారు. మేకప్‌ బ్రష్‌ మార్చినా.. అవే మేకప్‌ ఉత్పత్తులు వాడుతుంటారు. మొటిమలకు ఇదీ ఓ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని ఎవరితోనూ పంచుకోకుండా, ఎవరివీ ఉపయోగించకుండా జాగ్రత్తపడడం మంచిది. అలాగే మేకప్‌ బ్రష్‌లను కూడా నిర్ణీత వ్యవధుల్లో శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు.

కొన్ని రకాల సౌందర్య, ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగానూ తర్వాతి తరాల వారికి వస్తుంటాయి. అయితే ముందు తరాల వారికి మొటిమల సమస్య లేకపోతే.. తర్వాతి తరాల వారికీ మొటిమల ముప్పు తప్పే అవకాశాలున్నాయంటున్నారు. అది కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తేనే!

కొంతమందిలో సీబమ్‌ (చర్మం విడుదల చేసే సహజసిద్ధమైన నూనెలు) ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి చర్మం పదే పదే జిడ్డుగా మారుతుంది. ఇది కూడా మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి ముఖంపై ఉత్పత్తయ్యే సహజ నూనెల్ని అదుపు చేసుకోవాలంటే.. ఎప్పటికప్పుడు ముఖం శుభ్రం చేసుకోవడంతో పాటు ఆహార నియమాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.

ముఖంపై మొటిమలు, మచ్చలు రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణమేనట. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం.. వంటివి సాధన చేయడం ముఖ్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని