మొబైల్ స్క్రీన్.. శుభ్రం చేస్తున్నారా?

కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్‌ మాయాజాలం లేకుండానే న్యాచురల్‌ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది.

Updated : 01 Jun 2024 22:10 IST

కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్‌ మాయాజాలం లేకుండానే న్యాచురల్‌ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది. నిజానికి ఈ మహిమంతా చికిత్సలు, చిట్కాల్లో కాదు.. వారు పాటించే రోజువారీ అలవాట్లలో ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?!

ఉదయం నిద్ర లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు.. ఈ రెండు సందర్భాల్లో ముఖం శుభ్రపరచుకునేవారు చాలా తక్కువమంది. ముఖంపై మొటిమలు రావడానికి ఈ నిర్లక్ష్యమూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అందుకే ఈ రెండు సందర్భాలతో పాటు.. చెమట ఎక్కువగా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖం శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఫలితంగా ముఖంపై దుమ్ము, జిడ్డుదనం తొలగిపోయి చర్మ రంధ్రాలు మూసుకుపోవు.. తద్వారా మొటిమలూ ఏర్పడవు. అయితే ఈ క్రమంలో చర్మతత్వానికి సరిపడే ఫేస్‌వాష్‌ను ఎంచుకోవడమూ ముఖ్యమే!

పబ్లిక్‌ టాయిలెట్‌ కంటే మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌ మాట్లాడేటప్పుడు, మొబైల్‌ను తాకిన చేతులతోనే ముఖాన్ని తడుముకోవడం వల్ల ఈ క్రిములు ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయి. ఈ సమస్య దరిచేరకుండా.. ఫోన్‌ స్క్రీన్‌ను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

చేతుల్ని పదే పదే ముఖానికి తాకించే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఫలితంగా చేతులకున్న క్రిములు, మురికి ముఖం పైకి చేరి మొటిమలకు కారణమవుతాయి. అందుకే ముఖం కడుక్కునేటప్పుడు తప్ప అసలు చేతుల్ని ముఖానికి తాకించకుండా జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు.

రోజూ వాడే క్రమంలో మన చర్మం, జుట్టు కుదుళ్లలో ఉన్న జిడ్డు దిండు కవర్ల పైకి చేరుతుంది. అది వాతావరణంలోని దుమ్మును ఆకర్షిస్తుంది. ఈ అపరిశుభ్రమైన దిండ్లనే వారాల తరబడి వాడడం, ఇతరులు వీటిని ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయి. కాబట్టి వారానికోసారైనా దిండ్ల కవర్లను మార్చుకోవడం, ఎవరి దిండు వారే వాడుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

మొటిమల బెడద లేని వారు.. రోజువారీ తీసుకునే ఆహారం విషయంలోనూ కచ్చితంగా వ్యవహరిస్తారట! ఈ క్రమంలో కాయగూరలు, ఆలివ్‌ నూనె, తృణ ధాన్యాలు, తక్కువ మొత్తంలో మాంసం.. వంటివి తీసుకుంటారట! వీటి ద్వారా చర్మానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయంటున్నారు నిపుణులు.

అధిక బరువూ మొటిమల సమస్యకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీరి శరీరంలో ఆండ్రోజెన్లు, ఇన్సులిన్‌ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్