మీ గుండె పదిలమేనా? చెక్ చేసుకోండి..

గుండె.. శరీరంలో ఇది ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే! అయితే మనకి ఉండే కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట! ఎక్కువ సమయం అదే పనిగా కూర్చుని టీవీ చూడడం దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకపోవడం....

Published : 29 Sep 2022 18:42 IST

గుండె.. శరీరంలో ఇది ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే! అయితే మనకి ఉండే కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయట! ఎక్కువ సమయం అదే పనిగా కూర్చుని టీవీ చూడడం దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోకపోవడం వరకు రకరకాల అలవాట్లు హృదయ సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ సందర్భంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆ చిన్న చిన్న అలవాట్లు ఏంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్య అవయవం గుండె. రక్తం ద్వారా ఆయా శరీర భాగాలకు ఆక్సిజన్ అందించడంలో దీని పాత్ర చాలా కీలకమైంది. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే మనకి ఉండే కొన్ని చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో హృదయం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి దాని పనితీరుని దెబ్బతీసే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

చేతులు కడుగుతున్నారా?

'చేతులు శుభ్రంగా కడుక్కోవాలి' - ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఇది. చిన్నప్పట్నుంచీ ఈ మాట వింటూనే ఉన్నా మొన్నమొన్నటి వరకు దీనిని పాటించింది మాత్రం కొద్దిమందే.. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది చేతులు శుభ్రం చేసుకునే విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారు.. అయినా ఇప్పటికీ ఈ విషయంలో కొంచెం అశ్రద్ధ చేసేవారు లేకపోలేదు.. ఈ క్రమంలో - మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కూడా చేతులను శుభ్రంగా ఉంచుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు.

ప్రత్యేకించి వంట చేసే ముందు, ఆహారం తీసుకునే ముందు, గాయాలకు చికిత్స చేసే ముందు, పెంపుడు జంతువులతో ఆడుకున్నప్పుడు, కాంటాక్ట్ లెన్స్ తీసేటప్పుడు, పెట్టుకునేటప్పుడు; చెత్తని బయట వేసినప్పుడు.. ఇలా కొన్ని పనులు చేసిన తర్వాత మాత్రం తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చేతులపై ఉండే క్రిములు శరీర భాగాల్లోకి చేరి అనారోగ్యం కలిగించే అవకాశాలుంటాయి. ఇది గుండెకూ మంచిది కాదు.

బ్లాక్ టీ తాగుతున్నారా?

టీ, కాఫీ.. కొందరికి ఇవి లేనిదే రోజు అసంపూర్ణం అంటే అతిశయోక్తి కాదు. కానీ ఇంకొందరు మాత్రం వీటిని దరిదాపులకు కూడా రానీయరు. మీరూ అంతేనా? అయితే మీ అలవాటు కాస్త మార్చుకోవాల్సిందే.. ఎందుకంటే రోజుకి 1 లేదా రెండు కప్పుల చొప్పున తీసుకునే బ్లాక్ టీ ద్వారా గుండె ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు గడ్డకట్టిన రక్తకణాలను తొలగించడం ద్వారా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు దాదాపు 25% తగ్గుతాయట!

ఉప్పు తగ్గించారా?

తినే ఆహార పదార్థం రుచిగా ఉండాలంటే తగినంత ఉప్పు వేయాల్సిందే..! అయితే అది ఎంత మితమైతే గుండె ఆరోగ్యం అంత పదిలంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

దంత సంరక్షణ విషయంలో...

కొన్ని అధ్యయనాల ప్రకారం దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉన్నవారిలో హృదయ సంబంధిత సమస్యలు చాలా తక్కువగా తలెత్తాయని తేలిందట! నోట్లో ఉండే రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లు గాలి, నీరు, ఆహారం ద్వారా లోపలి భాగాలకు చేరినప్పుడు వివిధ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చిగుళ్లకు సంబంధించి ఇన్‌ఫెక్షన్లు తలెత్తినప్పుడు అవి మిగతా శరీర భాగాలకు కూడా వ్యాపించి, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం కూడా ఉంటుందట. అందుకే చిగుళ్లు, దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

ఈ అలవాట్లు కూడా..

❀ నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇది హృదయ సంబంధిత సమస్యలకు సంకేతం కూడా కావచ్చట. అందుకే సుదీర్ఘకాలం పాటు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.

❀ మూత్రం వచ్చినప్పుడు వెంటనే టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకొనే అలవాటు కొందరికి ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా గుండె నిమిషానికి కొట్టుకునే సాధారణ స్థాయి కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది. ఇది రక్తపోటు పైన ప్రభావం చూపించి, దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి మూత్రం వచ్చినప్పుడు ఆపుకొనే అలవాటును క్రమంగా మార్చుకోవాలి.

❀ ఎలాంటి దురలవాట్లు లేకుండా, మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో కూడా కొన్ని సందర్భాల్లో గుండె సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. ఈ క్రమంలో రక్తపోటులో వచ్చే హెచ్చుతగ్గులు, శరీరంలోని కొవ్వుస్థాయులు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం ద్వారా గుండె ముప్పుని ముందే పసిగట్టే అవకాశాలు ఉంటాయి. కానీ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ పద్ధతి సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

❀ ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు మన శరీరంలో విడుదలయ్యే కొన్ని హార్మోన్లు కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే యోగా, ప్రాణాయామం, ఇతర వ్యాయామాల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడిని కలిగించే పనులకు, సంఘటనలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

వీటితో పాటు శరీరానికి తగిన శ్రమ కల్పించడం, అంతరాయం లేని ప్రశాంతమైన నిద్ర ఉండేలా జాగ్రత్తపడడం, పోషకాహారం తీసుకోవడం మొదలైన వాటి ద్వారా గుండె ఆరోగ్యాన్ని చక్కగా సంరక్షించుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్