Published : 13/03/2022 12:58 IST

ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారా?

30 ఏళ్ల మందిర ఇంటిని ఎప్పటికప్పుడు చక్కగా శుభ్రం చేసుకుంటుంది. అయినా ఆమె పిల్లలు మాత్రం తరచూ ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు..

24 ఏళ్ల స్టెల్లాకి ఈ మధ్య తరచూ దగ్గు, జలుబు.. వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి..

వీరే కాదు.. మనలో చాలామంది ఎంత శుభ్రంగా ఉంటూ, ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా తరచూ ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు. మనకి ఉండే కొన్ని రోజువారీ అలవాట్లే ఇందుకు కారణం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ అలవాట్లేంటి? వాటివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది.. మొదలైన వివరాలన్నీ తెలుసుకుందాం రండి..

ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. చాలామంది అందుకు తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తూ ఉంటారు. కానీ మనకి ఉండే కొన్ని అలవాట్లు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణమయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

టీవీ రిమోట్ వాడుతున్నారా?

రోజంతా ఎంత తీరిక లేకుండా గడిపినా ఎంతో కొంత సమయం మాత్రం టీవీ చూడడానికి కేటాయించాల్సిందే..! లేకపోతే కొందరికి రోజు గడిచినట్లు ఉండదు. ఇలా టీవీ చూసే సమయంలో రిమోట్ చేతిలో కచ్చితంగా ఉండి తీరాల్సిందే కదూ! సరే.. 'దాన్ని ఆఖరిసారి ఎప్పుడు శుభ్రం చేశారు?'.. ఆలోచిస్తున్నారా? దీనికి సమాధానం అంత త్వరగా గుర్తుకు రాదు లెండి..! ఎందుకంటే ఇల్లంతా శుభ్రం చేసుకునేవారు కూడా రిమోట్‌కి ఏముంటుందిలే అని పైపైన క్లాత్ పెట్టి తుడిచేస్తారే తప్ప దాన్ని కూడా శుభ్రం చేద్దాం అని అనుకోరు. ఫలితంగా ఇంట్లోని సభ్యులు, ఇంటికి వచ్చిన అతిథులు.. ఇలా అందరి చేతులకీ ఉండే క్రిములు, బ్యాక్టీరియా.. ఆ రిమోట్ పైకి వచ్చి చేరతాయి. ఇక దాన్ని ముట్టుకున్న తర్వాత అవి మన చేతుల పైకి చేరి, ఆహార పదార్థాలు, నీరు ద్వారా శరీరం లోపలికి వెళ్లి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్త్లెనా యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్‌తో రిమోట్‌ని శుభ్రం చేయడం తప్పనిసరని గుర్తుంచుకోండి.

హ్యాండ్ బ్యాగ్ శుభ్రం చేస్తున్నారా??

రోజూ ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్‌కి, మన ఆరోగ్యానికి లింక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉందండీ.. రోజులో అధిక సమయం మనతో ఉండే యాక్సెసరీల్లో హ్యాండ్‌బ్యాగ్/ వ్యాలెట్ కూడా ఒకటి. బయటకు వెళ్లేటప్పుడు మనకి అవసరమయ్యే వస్తువులన్నీ ఇందులో వేసి తీసుకెళ్తుంటాం. అలా వివిధ రకాల వస్తువులు/ ఉత్పత్తుల ద్వారా బ్యాగ్ లోపలి భాగంలో లెక్కలేనన్ని క్రిములు వచ్చి చేరతాయని మీరెప్పుడైనా ఆలోచించారా?? బ్యాగ్ బయటి భాగాన్నైతే వారానికోసారి చక్కగా శుభ్రం చేసుకుంటాం. ఇక లోపలి భాగం శుభ్రం చేయడం అంటే.. అందులో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టి బ్యాగ్ దులిపి, మళ్లీ అన్నీ సర్దేస్తాం.. కానీ ఇది కరక్ట్ కాదు. లోపలి భాగాన్ని కూడా వారానికోసారి యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ ఉపయోగించి తుడుచుకోవాలి. లేదంటే బ్యాగ్‌లో పేరుకొనే వివిధ క్రిముల కారణంగా పలు ఆరోగ్య సమస్యలకు గురికాక తప్పదు.

మరి చేతుల విషయమో..?

ఏదైనా తినే ముందు లేదా తాగే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచి అలవాటు. కరోనా పుణ్యమా అని ఈ విషయంలో ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చిందనుకోండి. అయితే నామమాత్రంగా కాకుండా దీనికి కూడా ఒక క్రమపద్ధతిని అనుసరిస్తేనే ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వీలుంటుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం సబ్బు లేదా శానిటైజర్లను వాడాలన్న విషయం తెలిసిందే. ఇలా కాకుండా మామూలు నీళ్లతో చేతులు శుభ్రం చేసుకున్నా ఎలాంటి ఫలితం ఉండదని; పైగా క్రిములు వ్యాపించి రకరకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతా కీ బోర్డుల్లోనే !

ఆఫీసులో భోజన విరామ సమయంలో కొందరు బయటకు వెళ్లి భోజనం చేస్తే, ఇంకొందరు కూర్చున్న ప్రదేశంలోనే లంచ్ కూడా ముగిస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఆఫీసులో ఉపయోగించే కాఫీ పాట్, కీ బోర్డ్‌లే క్రిములకు ముఖ్య స్థావరాలని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. వీటిని ముట్టుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా మన చేతుల పైకి వ్యాపించి అనారోగ్యాన్ని కలిగిస్తుందట! అందుకే ఆఫీసులో లంచ్ చేసే ముందు తప్పనిసరిగా చేతులు చక్కగా శుభ్రం చేసుకోవాల్సిందే. వీలైతే లంచ్ సమయంలో కూర్చున్న ప్రదేశంలోనే కాకుండా వేరే గదిలో లేదా క్యాంటీన్‌లో భోజనం చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

ఈ అలవాట్లు కూడా..

* బాత్రూంలో ఫోన్ ఉపయోగించడం

* బయట తిరిగిన షూస్‌ని ఇంట్లో ఉంచడం..

* గోళ్లు కొరకడం..

* సరిపడినన్ని నీళ్లు తాగకపోవడం..

* అర్ధరాత్రి ఆహారం తినడం..

* ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వేసుకోవడం..

* సరిగ్గా నిద్రపోకపోవడం..

* తగినంత వ్యాయామం చేయకపోవడం..

ఇలా మనం రోజువారీ చేసే చిన్న చిన్న పనులు లేదా అలవాట్లే మనకి వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. కాబట్టి ఈ అలవాట్లను మానుకుందాం.. అనారోగ్యానికి చెక్ పెడదాం..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని