Published : 11/10/2021 12:47 IST

దాండియా ఆడదాం... ఫిట్‌నెస్ పెంచుకుందాం..

దాండియా, గర్బా.. గుజరాతీ సంప్రదాయ జానపద నృత్యాల్లో ఇవెంతో ప్రత్యేకమైనవి. బృందావనంలో రాధాకృష్ణుల లీలా వినోదాన్ని, హోలీ సంబరాల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు అక్కడి యువతీయువకులు. దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌తో పాటు, పశ్చిమ భారతదేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తొమ్మిది రోజుల పాటు ఈ నృత్యాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది కాలానుగుణంగా దేశవ్యాప్తం అవడంతో పాటు ప్రపంచం నలుమూలల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఏటా నవరాత్రుల్లో ఈ నృత్యాలను ప్రదర్శిస్తుంటారు. ఇవి కేవలం అందరూ కలిసి ఆనందించడానికి ఆడుకునే ఆటలు మాత్రమే కావు.. ఫిట్‌నెస్‌పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. శరీరంలోని అనవసర కొవ్వులు కరిగి బరువు తగ్గడంతో పాటు.. రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళనలు.. వంటివి మాయమై మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుందీ నృత్యాలతో! ఈ క్రమంలో దాండియా ఆడడం వల్ల ఫిట్‌నెస్‌పరంగా ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి..

పాటకు తగ్గ ఆట!

దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్దఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ.. సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. ఈ క్రమంలో చేతులు, కాళ్లు, భుజాలు, నడుము.. ఇలా శరీరంలోని భాగాలన్నింటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగే ఈ నృత్యం ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది.

నాజూకైన నడుముకు..

కొంతమందికి మిగతా శరీరమంతా ఎలా ఉన్నా, నడుము దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త లావుగా కనిపిస్తుంది. అతిగా కూర్చోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తరచూ తీసుకోవడం.. వంటి పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీన్ని తగ్గించుకుని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే దాండియా ఆడాల్సిందే. ఈ ఆటలో నిల్చున్న చోటే నడుమును కుడివైపుకి, ఎడమవైపుకి తిప్పడం, ముందుకు వంగుతూ లేవడం లాంటి కొన్ని భంగిమలుంటాయి. ఇవి నడుముకు చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆ ప్రదేశంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు క్రమంగా కరిగిపోయి.. నడుము నాజూగ్గా తయారవుతుంది. ఫలితంగా మంచి శరీరాకృతిని కూడా సొంతం చేసుకోవచ్చు.

కాళ్లలో కొవ్వా?

కొంతమందికి తొడలు, కాళ్లు, చేతులు.. వంటి ప్రదేశాల్లో కొవ్వు బాగా పేరుకుపోతుంటుంది. ఇలాంటి వారు కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి సంకోచిస్తుంటారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లోని కొవ్వును కరిగించుకుంటే ఎలాంటి దుస్తులైనా ధరించే వీలుంటుంది. ఇందుకోసం దాండియా ఆట ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నృత్యంలో భాగంగా స్టిక్స్‌ని చేతుల్లో పట్టుకుని ఒకదాంతో మరొకదాన్ని కొట్టడం, కాళ్లు పైకి, కిందికి, ముందుకు, వెనక్కి వూపడం వల్ల.. కాళ్లు, చేతులపై కాస్త ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా ఆయా భాగాల్లోని కొవ్వులు క్రమంగా కరిగిపోయి.. సన్నగా మారతాయి. కాళ్లు, చేతులు.. వంటి భాగాల్లోని అదనపు కొవ్వుల్ని కరిగించుకోవడం కోసం దాండియాని ఆశ్రయించవచ్చు.

మానసిక ప్రశాంతతకు..

రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పొందాలన్నా దాండియా ఆట ఓ చక్కటి మార్గమే. అందుకే ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ ఆటలో పాల్గొంటారు. దాండియా ఆడుతున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు ఉత్పత్తవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక సమస్యలను దూరం చేసి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే ఎంతో సరదాగా సాగే ఈ ఆట ఒత్తిడిని దూరం చేయడంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా అందిస్తుంది.

సంపూర్ణ ఆరోగ్యానికీ!

శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ని సొంతం చేసుకోవడానికి చాలామంది ఎంచుకునే వ్యాయామం ఏరోబిక్స్. అయితే దాండియా ఆట వల్ల కూడా ఏరోబిక్స్ చేసిన ఫలితం దక్కుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తల నుంచి కాలి వేళ్ల వరకు.. శరీరంలోని అన్ని అవయవాలకు సరైన రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే దీన్ని ఎంత వేగంగా ఆడితే గుండె కొట్టుకునే వేగం కూడా అంతగా పెరుగుతుంది. తద్వారా శరీరంలోని చెడు కొవ్వులు కరిగి, మంచి కొవ్వులు పెరుగుతాయి. వీటితో పాటు ఈ ఆట వల్ల శరీరంలోని చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.

ఇలా కూడా!

* దాండియా ఆట వల్ల శరీరానికి మంచి వ్యాయామం అంది, తద్వారా శరీరం అలసటకు గురై రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది. తద్వారా అటు ఆరోగ్యంగా, ఇటు దృఢంగా కూడా ఉండచ్చు.

* అందరూ కలిసి ఆడుకునే ఏ ఆటైనా.. అది వారి మధ్య ఉండే సంబంధబాంధవ్యాలను రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాండియా కూడా అంతే! దాండియా ఫెస్టివల్స్‌లో మనకు పరిచయం ఉన్న వారితో పాటు పరిచయం లేని వారు కూడా ఉంటారు. వారితో కలిసి దాండియా ఆడడం వల్ల పరిచయాలు పెరుగుతాయి. సంబంధాలు బలపడతాయి.

నవరాత్రుల్లో ప్రధానమైన దాండియా నృత్యం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా దాండియా ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకోండి. అయితే ఈ క్రమంలో కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం మరవకండి..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని