Viral Video: తల్లీకూతుళ్లిద్దరూ ఎయిర్‌హోస్టెస్‌లుగా.. ఒకే ఫ్లైట్‌లో..!
మాతృ దినోత్సవం సందర్భంగా.. అమ్మపై మన మనసు లోతుల్లో దాగున్న ప్రేమను విభిన్న రకాలుగా వ్యక్తం చేయడం, బహుమతులిచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేయడం పరిపాటే! అయితే విలువైన కానుకలతో పని లేకుండా, గ్రీటింగ్ కార్డుల అవసరం లేకుండానే....
(Photos: Twitter)
మాతృ దినోత్సవం సందర్భంగా.. అమ్మపై మన మనసు లోతుల్లో దాగున్న ప్రేమను విభిన్న రకాలుగా వ్యక్తం చేయడం, బహుమతులిచ్చి ఆమెను సర్‌ప్రైజ్ చేయడం పరిపాటే! అయితే విలువైన కానుకలతో పని లేకుండా, గ్రీటింగ్ కార్డుల అవసరం లేకుండానే అమ్మకు మర్చిపోలేని బహుమతిచ్చిందో కూతురు. అది కూడా విధుల్లో నిమగ్నమై ఉండగానే! తల్లీకూతుళ్ల ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
పిల్లలకు ఉన్నత భవిష్యత్తును అందించాలని తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. తాను ఉద్యోగం చేస్తూనే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. నచ్చిన రంగాల్లో వారిని ప్రోత్సహిస్తుంది. ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగి నబీరా ఇరాం షమ్సీ తల్లి ఇరాం షమ్సీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తాను ఈ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తూనే.. తన కూతురికీ ఈ రంగమంటే ఆసక్తి అని తెలుసుకొని ఈ దిశగా ఆమెను ప్రోత్సహించింది. ఈ ప్రేరణతోనే నబీరానూ ఈ దిశగా వెన్నుతట్టింది.
ఆరేళ్ల కల నెరవేరింది!
గత కొన్నేళ్ల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తోన్న తన తల్లి స్ఫూర్తితోనే తానూ ఆరేళ్ల క్రితం ఈ సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా విధుల్లో చేరానంటోంది నబీరా. అయితే ఒకే సంస్థలో, ఇద్దరూ ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగంలోనే ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా విధుల్లో కలిసి పనిచేసింది లేదు. కానీ ఆ కోరిక ఈ ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా తీరిందంటోంది నబీరా. ఈ ప్రత్యేకమైన రోజున.. తల్లీబిడ్డలిద్దరికీ ఒకే విమానంలో ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీ పడింది. ఇలా అనుకోకుండా తన కోరిక నెరవేరినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది నబీరా.
‘ఒకే సంస్థలో పనిచేస్తున్నా.. అమ్మతో కలిసి పనిచేసే అవకాశం రావాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నా. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ఆ కోరిక నెరవేరింది. అమ్మను ఇలా నాతో పాటు ఇదే విమానంలో, ఒకే తరహా యూనిఫాంలో చూడడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఆరేళ్ల నుంచి తను ఇలా మైక్ పట్టుకొని అనౌన్స్ చేయడం చూశాను.. కానీ ఇప్పుడు తన తరఫున నేను అనౌన్స్ చేసే రోజు వచ్చింది. ఇలా తనతో విధుల్లో భాగం పంచుకున్నందుకు తను గర్వపడుతుందనుకుంటున్నా.. నేల నుంచి ఆకాశం దాకా.. నా జీవితంలో అడుగడుగునా అమ్మ ప్రోత్సాహం ఎంతో! హ్యాపీ మదర్స్ డే అమ్మా!’ అంటూ తన తల్లిని అందరికీ పరిచయం చేస్తూ ఎమోషనల్ అయింది నబీరా. ఇక తన కూతురి పక్కనే నిల్చొని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది నబీరా తల్లి. నబీరాను దగ్గరకు తీసుకొని ముద్దాడింది.. ఇలా ఈ తల్లీకూతుళ్ల ప్రేమను చూసిన ప్రయాణికులు చప్పట్లతో వారిని ప్రశంసించారు.
తల్లీబిడ్డల ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన ఈ వీడియోను ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది నెటిజన్లు ‘హృదయానికి హత్తుకునే ప్రేమ ఇది!’ అని రీట్వీట్లు చేస్తున్నారు. మరికొంతమంది.. తమ తల్లితో తమకున్న అనుబంధాన్ని, తమ కెరీర్ ఉన్నతిలో ఆమె ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.