ఇది కథ కాదు!

నల్లపిల్ల, కాకి అంటుంటే రంగు వల్లే అని సరిపెట్టుకుంది. కానీ అవి శ్రుతిమించాయి. వేధింపులు, ఛీత్కారాలు... బలాత్కారాలుగా మారాయి. మగ నీడను చూసినా... సమాజమన్న మాట విన్నా ఒళ్లంతా వణికేది. అలాంటి సంధ్యా నాయర్‌... తన తలరాతను మార్చుకోవడమే కాదు, ఆడపిల్లల్లో ధైర్యాన్నీ నింపుతోంది.

Updated : 02 Jun 2024 07:54 IST

నల్లపిల్ల, కాకి అంటుంటే రంగు వల్లే అని సరిపెట్టుకుంది. కానీ అవి శ్రుతిమించాయి. వేధింపులు, ఛీత్కారాలు... బలాత్కారాలుగా మారాయి. మగ నీడను చూసినా... సమాజమన్న మాట విన్నా ఒళ్లంతా వణికేది. అలాంటి సంధ్యా నాయర్‌... తన తలరాతను మార్చుకోవడమే కాదు, ఆడపిల్లల్లో ధైర్యాన్నీ నింపుతోంది. ఆమె మనోగతమిది!

మ్మ నాలుగిళ్లల్లో పాచిపని చేస్తోంటే నేను తోచిన సాయం చేసేదాన్ని... అందమైన బాల్యమంటే నాకు గుర్తొచ్చే సంఘటన అదే. అప్పటికి అయిదారేళ్లు ఉంటాయేమో! యూనిఫామ్‌లో స్కూలుకి వెళుతున్న వాళ్లని చూసి, నేనూ వెళతానని మారాం చేశా. పాపం అమ్మకు కాస్త భారమే. అయినా నన్ను కాన్వెంట్‌లో చేర్చింది. బోలెడంతమంది స్నేహితులు అవుతారని ఉత్సాహంగా వెళితే ‘నల్లపిల్ల, కాకి’ అంటూ ఏడిపించడం మొదలుపెట్టారు. బాధేసినా తట్టుకున్నా. కానీ ఒకరోజు వాళ్లచూపుల్లో మార్పు. ఈసారి సరదాగా ఆటపట్టించడం కాదు... అసహ్యం కనిపించింది. ఎవరు ఎటునుంచి కొట్టేవారో తెలీదు. రక్తం కారుతున్నా టీచర్లు వాళ్లను ఏమనకపోగా నన్నే చీదరించుకునేవారు. ఆఖరి బెంచీలో కూర్చోబెట్టేవారు. ఒక్కరూ మాట్లాడరు, కలిసి భోజనం చేయరు. ఇలాగైనా స్కూలు వదిలిపోతానని వాళ్ల ఆశ మరి! ఓసారి ఎదురు తిరిగితే ‘మీ అమ్మ వేశ్య’ అన్నారు. టాయ్‌లెట్‌లో నా తల ముంచి ‘ఇదే నీ స్థానమ’న్నారు. వేశ్య అంటే ఏమిటో... నాకీ చిత్రహింసలు ఎందుకో ఆ వయసులో నాకేం అర్థమవలేదు.

తరవాత నెమ్మదిగా నా చుట్టూ గమనించుకున్నాక కాస్త బోధపడింది. అమ్మే కాదు మా చుట్టుపక్కల వాళ్లదీ అదే వృత్తి. నేను పుట్టింది ముంబయిలోని కామటిపురాలో మరి. అమ్మ అక్కడికెలా చేరిందో తెలీదు. కానీ తన గురించి తెలిసీ మిలిటరీలో పనిచేసే నాన్న పెళ్లాడారు. ఫలితమే నేను. ఆయనేమో సరిహద్దుల్లో... మేమక్కడా మిగిలాం. వయసు పెరిగేకొద్దీ నా పరిస్థితి మరింత దిగజారింది. పదేళ్ల వయసులో తొలిసారి బలాత్కారానికి గురయ్యా. తరవాత అది సర్వసాధారణమైంది. నోరు తెరిస్తే చంపేస్తామన్న బెదిరింపులు. ప్రతిరోజూ తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం ఉండేది కాదు. అమ్మకివేమీ తెలియదు. తనకు చెప్పలేక... ఆ బాధ తట్టుకోలేక లోలోపలే ఏడ్చి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. పానిక్‌ అటాక్‌లూ వచ్చేవి. చనిపోవడానికీ ప్రయత్నించి, బతికి బయటపడ్డా. దీనంతటికీ అమ్మే కారణం అనిపించేది. తనంటే అసహ్యం, కోపం. తనే లేకపోతే నాకీ పరిస్థితి ఉండేది కాదనుకునేదాన్ని. ఇంతలో ఫోన్‌... ‘నాన్న ఆరోగ్యం బాగోలేదు. సొంతూరికి చేరా’రని. అలా కేరళ చేరుకున్నాం. అప్పటికి నా పదోతరగతి పూర్తయ్యిందంతే!

నాన్న చనిపోయాక అమ్మ టైలరింగ్‌ చేసేచోట కుదురుకుంది. ఆ డబ్బులతో ఇల్లే గడిచేది కాదు. నా చదువుకీ అంటే కష్టమే. అందుకే నేనూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసేదాన్ని. అలా ఇంటర్, డిగ్రీ చదువుతూ వచ్చా. నరకం నుంచి బయటపడినా... మగవాళ్ల నీడ చూసినా భయపడేదాన్ని. ఓసారి పేపర్‌లో ఒకమ్మాయి ఇంటర్వ్యూ చూశా. తనదీ నాలాంటి కథే. కానీ విదేశాల్లో చదువుతోంది. అది చూశాక ఆమె నాకు ఏదైనా సాయం చేయగలదేమోనన్న ఆశ కలిగింది. ఇంటర్నెట్‌ కెఫేకి వెళ్లి ఫేస్‌బుక్‌లో ఆమె ఐడీ వెదికి మరీ నా జీవితం గురించి రాసుకొచ్చా. బయటపడే మార్గం చెప్పమని కోరా. రోజూ తిరుగు సమాధానం వచ్చిందేమోనన్న ఆశ. అలాగని వెళ్లి చూద్దామంటే కెఫేకి డబ్బులు కట్టాలి. అందుకని బలవంతంగా నన్ను నేను సంభాళించుకొని వారం రోజులయ్యాక వెళితే అవతలి నుంచి రిప్లై ఉంది. తనకి ‘క్రాంతి’ అనే ఎన్‌జీఓ సాయం చేసిందనీ, వాళ్లని సంప్రదించమనీ చెప్పింది. అలాగే చేశా. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. వాళ్లు ముందు నాకు మానసిక చికిత్స అందించారు తరవాత ఉన్నత చదువులకు సాయం చేశారు. కాబట్టే విదేశాల్లో చదువుకోగలిగా. యూనివర్సిటీ ఫర్‌ పీస్‌ నుంచి క్లినికల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ పూర్తిచేశా.

ఇప్పుడు నాలో చాలా మార్పు. అమ్మంటే అసహ్యం లేదు. కష్టాలు పడీ నాకో భవిష్యత్తును ఇవ్వాలనుకున్న తనపై కృతజ్ఞత మాత్రమే ఉంది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో స్థిరపడ్డా. మరో 50 మంది అమ్మాయిలతో కలిసి నాలాంటి వారికి  సాయం చేయడంపై దృష్టిపెట్టా. చాలామంది నా కథను చెప్పమని అడుగుతున్నారు. నేనూ ధైర్యంగా చెబుతున్నా. కారణం... ఎవరూ ఇష్టంగా వేశ్యావృత్తిలోకి రారు. అందరూ అనుకున్నట్టుగా వారి జీవితాలు పూలపాన్పు కాదు. వాళ్ల పిల్లలకీ జీవించే హక్కు ఉందని చెప్పడంతోపాటు నిరాశలో కూరుకుపోయిన నాలాంటి వాళ్లు బయటపడేలా చేయడమే నా ఉద్దేశం!


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్