Published : 04/11/2021 12:33 IST

దీపాల కాంతుల్లో వెలిగే దేశాలెన్నో..!

చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణించాలనే సందేశాన్నిచ్చే పండగే దీపావళి. దీపాల వరుసలు, మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులు.. అమావాస్యకే అరుదైన అందాన్ని తీసుకొస్తాయి. చిన్నాపెద్దా అంతా ఒకచోట చేరి దీపాల వెలుగుల మధ్య బాణసంచా కాలుస్తూ.. ఉత్సాహంగా ఈ పండగ జరుపుకొంటారు. ఆత్మీయులకు బహుమతులు అందిస్తూ.. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇలా మనదేశంలో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో కూడా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. మరి, వెలుగుల పండగ దీపావళిని ఏయే దేశాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందామా..

శ్రీలంకలో..

మనదేశంలో పాటించే మత సంప్రదాయాలే కాస్త ఇంచుమించుగా శ్రీలంకలోనూ దర్శనమిస్తాయి. ఇక్కడి మాదిరిగానే అక్కడ కూడా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి. రామాయణ కాలం నాటి ఎన్నో చిహ్నాలు సైతం శ్రీలంకలో మనం చూడచ్చు. ఇక్కడ దీపావళి ఎంతో ముఖ్యమైన పండగ. ఈ పర్వదినాన మనదేశంలో మాదిరిగానే శ్రీలంకలో సైతం లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. నూనెతో దీపాలు వెలిగించి బాణసంచా కాలుస్తారు. అలాగే పంచదారతో బొమ్మల రూపంలో స్వీట్స్ తయారుచేస్తారు. వీటిని మిసిరి అని పిలుస్తారు. ఇలా తయారుచేసిన తీపి పదార్థాలను ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే అందరూ కలసి సామూహిక భోజనాలు చేయడం ఇక్కడి సంప్రదాయం.

నేపాల్‌లో..

మన పొరుగు దేశమైన నేపాల్‌లో కూడా హిందూ మత సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తారు. అక్కడ కూడా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. నేపాలీయులు ఈ పండగను 'తిహార్' అని పిలుస్తారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవితో పాటుగా గణేశుణ్ని పూజించడం వారి ఆచారం. ఐదురోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ప్రతి రోజుకీ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆవుపైనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వసించే నేపాలీయులు తొలి రోజు ఆవుకి పూజలు చేస్తారు. ఆవుకోసం ప్రత్యేకంగా వంటలు తయారుచేసి పెడుతుంటారు. రెండో రోజు మాత్రం భైరవుడి వాహనమైన శునకాన్ని పూజిస్తారు. శునకం కోసమే ప్రత్యేకంగా ఎన్నో వంటకాలు సిద్ధం చేసి ఆహారంగా అందిస్తారు. మూడో రోజు ఇంటి పరిసరాలన్నింటినీ దీపాలతో అలంకరించి బాణసంచా కాలుస్తారు. నాలుగోరోజు దీర్ఘాయుష్షు ప్రసాదించమని కోరుతూ యముణ్ని పూజిస్తారు. ఐదో రోజుని 'భయ్యా దూజ్' పేరుతో జరుపుకొంటారు. ఈరోజు సోదరులు సంతోషంతో జీవితాన్ని గడపాలని కోరుతూ సోదరీమణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

మలేషియాలో..

మలేషియాలో ఉన్న జనాభాలో సుమారు 8% మంది హిందూ మతాన్ని పాటించే వారుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మలేషియాలో దీపావళిని జరుపుకొంటారు. అయితే దాన్ని 'హరి దీవాలీ' పేరుతో పిలుస్తుంటారు అక్కడి ప్రజలు. ఉదయాన్నే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేసి ఆలయాలను సందర్శిస్తారు. ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపు దేశవ్యాప్తంగా ఈ పండగ జరుపుకొంటారు.

మారిషస్‌లో..

రావణసంహారం అనంతరం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంతో పాటు సత్యభామ చేసిన నరకాసుర వధకు గుర్తుగా మారిషస్‌లో ఈ పండగను జరుపుకొంటారు. మారిషస్‌లో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు.. కాబట్టి ఇక్కడ మనం జరుపుకొన్న పద్ధతిలోనే అక్కడి వారు దీపావళి వేడుకల్ని నిర్వహిస్తారు. ఉదయాన్నే పూజలు నిర్వహించి కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి సరదాగా పండగ సంబరాల్లో మునిగితేలుతారు. మట్టితో తయారుచేసిన దీపాలను వెలిగించి ఇంటిని సుందరంగా అలంకరిస్తారు. అంతేకాదు ఇతర మతాల వారిని సైతం ఇంటికి ఆహ్వానించి పండగ జరుపుకొంటారు.

థాయ్‌లాండ్‌లో..

థాయ్‌లాండ్ సైతం భిన్నమైన సంస్కృతికి నిలయం. అక్కడ అక్టోబర్ - నవంబర్ మాసాల్లో 'లామ్ క్రియోంగ్' పేరుతో దీపావళిని జరుపుకొంటారు. ఇది కూడా దీపావళి లాంటి పండగే. ఇక్కడ మనం మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే.. అక్కడ వారు అరిటాకులతో చేసిన ప్రమిదల్లో వెలిగించి నదిలో వదులుతారు. స్వీట్లను పంచుతూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటారు.

జపాన్‌లో..

సుఖసంతోషాలు, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించే పండగగా జపాన్ వాసులు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు జపనీయులు తమ ఇళ్లను శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు ధరిస్తారు. పెరటి తోటలు, ఉద్యానవనాల్లో ఉన్న చెట్లకు విద్యుద్దీపాలు, పేపర్ లాంతర్లతో అలంకరిస్తారు. ఆ కాంతిలో చక్కటి సంగీతానికి తగినట్టుగా నృత్యం చేస్తూ.. రాత్రంతా ఆనందంగా గడుపుతారు. దీపావళి సందర్భంగా జపాన్‌లోని యోకోహోమాలో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. దీన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు వస్తారు.

ఇవే కాకుండా.. భారతీయులు ఎక్కువగా నివసించే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతాయి. అక్కడ జరుపుకొనే పండగల్లో ఆయా దేశాల అధినేతలు సైతం పాల్గొనడం గమనించదగ్గ అంశం. ఇండోనేషియాలోని బాలీ దీవుల్లో సైతం దీపావళి సంబరాలు అంబరాన్నంటుతాయి.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి