ఈ ‘స్వర్ణ’ కుమారి వరల్డ్‌ నంబర్‌ వన్!

మరో పాతిక రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ క్రీడల కోసం క్రీడా ప్రపంచంతో పాటు భారత క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ పతకంపై ఆశలు రేకెత్తిస్తూ ఆర్చరీ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సొంతం చేసుకుంది భారత అగ్రశేణి క్రీడాకారిణి దీపికా కుమారి. ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని...ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది.

Published : 28 Jun 2021 21:08 IST

మరో పాతిక రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ క్రీడల కోసం క్రీడా ప్రపంచంతో పాటు భారత క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్‌ పతకంపై ఆశలు రేకెత్తిస్తూ ఆర్చరీ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సొంతం చేసుకుంది భారత అగ్రశేణి క్రీడాకారిణి దీపికా కుమారి. ఒకే ప్రపంచకప్‌లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని...ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. వరల్డ్‌ ఆర్చర్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. తద్వారా టోక్యో విమానం ఎక్కేముందు కొండంత ఆత్మవిశ్వాసం సొంతం చేసుకుంది.

పెళ్లి రోజుకు మూడు రోజుల ముందే!

గతేడాది జూన్‌ 30న ఏడడుగులు నడిచి ఒకటయ్యారు దీపికా కుమారి- అతాను దాస్. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో జంటగా బంగారు పతకం సాధించి తమ మొదటి పెళ్లి రోజును మరింత చిరస్మరణీయంగా మార్చుకున్నారీ లవ్లీ కపుల్‌. ప్యారిస్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ పోటీల్లో మిక్‌్కడ్‌ విభాగంలో జోడీగా బరిలోకి దిగిన దీపిక-అతాను మొదట వెనకబడినా ఆ తర్వాత పుంజుకొంది. అదే దూకుడును కొనసాగిస్తూ పసిడి పతకం సాధించింది.

ఒకే రోజు మూడు స్వర్ణాలు!

అంతకుముందే మహిళల రికర్వ్‌ టీం విభాగంలో అంకితా భకత్‌, కోమలికా బారితో కలిసి స్వర్ణం గెల్చుకుంది దీపిక. ఆ తర్వాత మహిళల వ్యక్తిగత విభాగంలోనూ విజయ దుందుభి మోగించి వరుసగా మూడో పసిడిని ముద్దాడింది. ఈ క్రమంలోనే వరల్డ్‌ నంబర్‌ వన్‌ ఆర్చర్‌గా అవతరించింది. ‘ప్రపంచకప్‌లో మొత్తం 3 బంగారు పతకాలు గెలవడం నాకిదే మొదటిసారి. ఎంతో సంతోషంగా ఉంది. అయితే మున్ముందు ఎన్నో కీలకమైన పోటీలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు కనీసం నెల రోజుల సమయం కూడా లేదు. పైగా ఈ అంతర్జాతీయ క్రీడల్లో ఆర్చరీ విభాగంలో భారతదేశం ఇప్పటివరకు ఒక్క పతకం కూడా గెలవలేదు. అప్పటివరకు నా ఫాంను ఇలాగే కొనసాగిస్తూ మెరుగ్గా రాణిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ స్టార్ ఆర్చర్.

2012లోనే అగ్రస్థానం!

చిన్న వయసు నుంచే ఆర్చరీలో ఆరితేరి.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తోంది దీపిక. రాంచీలోని అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె.. ప్రారంభంలో ఇంట్లోనే వెదురుతో తయారుచేసుకున్న విల్లు, బాణాలతో సాధన చేసేది. 2006లో జంషెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో చేరిన తర్వాత మాత్రమే ప్రొఫెషనల్ ఆర్చర్లు ఉపయోగించే విల్లు, బాణాలను ఉపయోగించడం మొదలుపెట్టింది. జూనియర్ స్థాయి నుంచే తనదైన ప్రతిభతో బాణంలా దూసుకెళ్లిన దీపిక.. అబ్బురపరిచే విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 2009లో క్యాడెట్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ను సాధించిన రెండో భారతీయురాలిగా నిలిచింది దీపిక. 2010 కామన్వెల్త్ క్రీడల్లోనూ తన సత్తా చాటి రెండు స్వర్ణాలను కైవసం చేసుకుంది. ఇక 2012లో జరిగిన ఆర్చరీ వరల్డ్‌కప్ వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్‌గా నిలిచింది. అదే ఏడాది మహిళల రికర్వ్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకుకి చేరుకుంది.

ఒలింపిక్స్‌లో నిరాశే!

ఈ దూకుడుతోనే 2012 లండన్ ఒలింపిక్స్‌కి సైతం అర్హత సాధించడంతో ఆమెపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో దేశానికి కచ్చితంగా పతకం తీసుకొస్తుందనుకున్నారంతా. అయితే దీనికి భిన్నంగా తొలి రౌండ్లోనే నిష్ర్కమించింది దీపిక. ఫలితంగా తీవ్ర నిరాశలో కూరుకుపోయి తన ఫామ్‌ని పూర్తిగా కోల్పోయింది. మొదటి ర్యాంకు నుంచి పంతొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని తన సత్తాను మరోసారి నిరూపించడం ప్రారంభించింది. ప్రపంచకప్‌ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో ఎన్నో పతకాలు గెల్చుకుంది. అదే ఆత్మవిశ్వాసంతో 2016 రియో ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆమెను దురదృష్టం మళ్లీ వెక్కిరించింది. 

మనసిచ్చిన వాడిని మనువాడి!

ఇక ఆర్చరీ క్రీడలోనే రాణిస్తోన్న మరో క్రీడాకారుడు అతాను దాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపిక. మిక్స్‌డ్‌ విభాగంలో జోడీగా పలు టోర్నీల్లో పతకాలు సాధించిన వీరిద్దరూ 2018లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడిన వెంటనే జూన్‌ 30 న రాంచీ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

టోక్యో ఫ్లైట్‌ ఎక్కనున్న ఏకైక ఆర్చర్!

వివిధ ప్రతిష్ఠాత్మక పోటీల్లో దేశానికి పతకాల పంట పండించింది దీపిక. తన అద్భుతమైన విజయాలకు గుర్తింపుగా అర్జున, పద్మశ్రీ పురస్కారాలు అందుకుంది. డోలా బెనర్జీ తర్వాత దీపిక మాత్రమే ఆర్చరీలో వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌ పోటీల కోసం టోక్యో ఫ్లైట్‌ ఎక్కనున్న ఏకైక ఆర్చర్‌ సైతం తనే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఒలింపిక్‌ పతకంతో తిరిగి రావాలనుకుంటోందీ స్టార్‌ ప్లేయర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్