Deepika: ప్రయోజనాలెన్నో.. అందుకే రోజూ ఈ ఆసనం వేస్తున్నా!

గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందిలో కటి వలయ కండరాలు పట్టేస్తుంటాయి.. పాదాల్లో నీరు చేరి వాపులొస్తుంటాయి.. రోజురోజుకీ పొట్ట పెరిగి పోవడంతో నిల్చున్నా, కూర్చున్నా ఆయాస పడిపోతుంటాం.. ఇలాంటి దుష్ప్రభావాలకు విరుగుడు ఒకే ఒక్క యోగాసనం అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె.

Published : 05 Jul 2024 18:27 IST

(Photos: Instagram)

గర్భిణిగా ఉన్నప్పుడు కొంతమందిలో కటి వలయ కండరాలు పట్టేస్తుంటాయి.. పాదాల్లో నీరు చేరి వాపులొస్తుంటాయి.. రోజురోజుకీ పొట్ట పెరిగి పోవడంతో నిల్చున్నా, కూర్చున్నా ఆయాస పడిపోతుంటాం.. ఇలాంటి దుష్ప్రభావాలకు విరుగుడు ఒకే ఒక్క యోగాసనం అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. త్వరలో అమ్మ కాబోతున్న ఈ ముద్దుగుమ్మ.. రోజూ ఐదు నిమిషాల పాటు ఆ ఆసనం సాధన చేస్తుందట! దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని ఇటీవలే ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది దీప్స్‌. మరి, కాబోయే అమ్మలందరికీ ఉపయోగపడే ఆ యోగాసనమేంటో తెలుసుకుందాం రండి..

ఇటీవలే ‘కల్కి’ చిత్రంతో మన ముందుకొచ్చింది దీపిక. ఈ సినిమాలో తెరపై గర్భిణిగా నటించిన ఆమె.. నిజ జీవితంలోనూ ప్రెగ్నెంటే! ఇలా గర్భంతోనే ఈ సినిమాలో క్లిష్టమైన క్లైమ్యాక్స్‌ సీన్లలోనూ అలవోకగా నటించిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా ఉండే దీప్స్‌.. ప్రెగ్నెన్సీలోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తోంది. అయితే ఇందుకు తాను చేసే వ్యాయామాలూ ఓ కారణమంటూ ఇటీవలే ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టిందీ కాబోయే అమ్మ.

విపరీత కరణి.. ఐదు నిమిషాలు!

ప్రతి ఒక్కరికీ స్వీయ ప్రేమ ముఖ్యం! గర్భిణులకు ఇది మరింత అవసరం. ఈ క్రమంలోనే ఎవరికి వారు స్వయంగా తమ శారీరక, మానసిక ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యమివ్వాలంటోంది దీపిక. జూన్‌ 24 - జులై 24.. ఈ నెల రోజుల పాటు ‘సెల్ఫ్‌ కేర్‌ మంత్‌’ జరుపుకొంటోన్న నేపథ్యంలో.. తన సెల్ఫ్‌ కేర్‌ రొటీన్‌ గురించి పంచుకుందీ బాలీవుడ్‌ బ్యూటీ. యోగాసనాల్లో భాగంగా ‘విపరీత కరణి’ ఆసనం వేసిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. దీనివల్ల కలిగే ప్రయోజనాల్నీ ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో షేర్‌ చేసుకుంది.

‘నేను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని. ఊహ తెలిసినప్పట్నుంచి వ్యాయామాల్ని నా జీవనశైలిలో భాగం చేసుకున్నా. ఎక్సర్‌సైజ్‌ చేసిన ప్రతిసారీ ఫిట్‌గా ఉన్నానన్న ఫీలింగ్‌ నాకు కలుగుతుంటుంది. అలా అనిపించనప్పుడల్లా యోగాసనాలు సాధన చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఫిట్‌నెస్ రొటీన్‌లో ఒక యోగాసనం తప్పకుండా ఉంటుంది. అదే ‘విపరీత కరణి’. రోజూ ఐదు నిమిషాల పాటు ఈ ఆసనం ప్రాక్టీస్‌ చేస్తున్నా. గర్భం దాల్చినప్పట్నుంచి ఈ ఆసనానికి మరింత ప్రాధాన్యమిస్తున్నా. ఎందుకంటే ఇది చాలా సింపుల్‌గా వేసే ఆసనం.. పైగా గర్భిణులకు దీంతో బోలెడన్ని ప్రయోజనాలూ చేకూరతాయి..’

గర్భిణులకు మేలు!

‘ఇందులో భాగంగా.. యోగా మ్యాట్‌ను గోడకు చేరువగా వేసుకొని దానిపై వెల్లకిలా పడుకోవాలి. గర్భిణులు నడుం భాగంలో సపోర్ట్‌ కోసం దిండు/కుషన్‌ వంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి గోడకు ఆనించాలి. చూడ్డానికి శరీరం ‘L-షేప్‌’లో కనిపించే ఈ భంగిమలో కనీసం ఐదు నిమిషాల పాటు కదలకుండా అలాగే ఉండాలి. ఇది శారీరక-మానసిక ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థను దృఢం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఒత్తిడినీ దూరం చేస్తుందీ ప్రాచీన యోగాసనం.

గర్భిణులు రోజూ ఐదు నిమిషాలు ఈ ఆసనం వేయడం వల్ల..

ఆయాసం తగ్గుతుంది.

కండరాలు, కీళ్లలో ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది.

పాదాల్లో నీరు చేరి వాపు రాకుండా జాగ్రత్తపడచ్చు.

పొట్ట పెరిగే కొద్దీ వెన్నెముక, వీపు, పిరుదులపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.

శరీరం నీటిని నిలుపుకోవడాన్ని తగ్గిస్తుంది. తద్వారా శరీరం ఉబ్బినట్లుగా కనిపించదు..’


ఎప్పుడు చేస్తే మంచిది?!

‘గర్భిణులే కాదు.. ఇతరులూ ఈ ఆసనం సాధన చేయచ్చు. అయితే ఉదయం సాధన చేసే వారికి, రాత్రి పడుకునే ముందు ఈ ఆసనం వేసే వారికి విభిన్న ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

ఉదయాన్నే సాధన చేసే వారిలో..

శోషరస, కేంద్ర నాడీ వ్యవస్థలోని గ్లింఫాటిక్‌ వ్యవస్థల పనితీరును మెరుగుపరిచి.. తద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ ఆసనం సహకరిస్తుంది.

శరీర పైభాగానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేయడంతో పాటు శోషరసాన్ని సరఫరా చేయడంలో ఇది తోడ్పడుతుంది.

శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి.

తుంటి, తొడ కండరాలు దృఢమై.. అవి ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.

ఇక రాత్రి పడుకునే ముందు సాధన చేసే వారిలో..

నాడీ వ్యవస్థ పనితీరును ప్రేరేపించి.. సుఖంగా నిద్ర పట్టేలా చేస్తుంది..

జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

రోజంతా అలసిపోయిన కాళ్లకు విశ్రాంతిని అందిస్తుంది.

అయితే గ్లకోమా వంటి కంటి సమస్యలు, అధిక రక్తపోటు, హెర్నియా.. తదితర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. అలాగే సాధన చేయాలనుకునే వారు, గర్భిణులు.. ముందుగా ఒకసారి నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవడం ముఖ్యం..’ అంటూ చెప్పుకొచ్చింది దీప్స్.

ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. తన భార్య పెట్టిన ఈ పోస్ట్‌పై స్పందించిన రణ్‌వీర్.. ‘ఈ ఆసనం ఓ మ్యాజిక్ లాగా పనిచేస్తుంది..’ అంటూ కామెంట్‌ పెట్టాడు. అంటే.. దగ్గరుండి మరీ తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ. ఇక సెప్టెంబర్‌లో ఈ జంట తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతోంది.


నెలసరి నొప్పులకూ..!

విపరీత కరణి ఆసనం రోజూ సాధన చేయడం వల్ల మహిళల్లో బహుళ ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు.

⚛ ఈ ఆసనం వల్ల కటి వలయ కండరాలకు, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. తద్వారా ప్రత్యుత్పత్తి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ఈ ఆసనం వేసినప్పుడు శరీరానికి వ్యతిరేక దిశలో ఒత్తిడి తగలడం వల్ల థైరాయిడ్‌ గ్రంథికి రక్తప్రసరణ చక్కగా అందుతుంది. ఫలితంగా హైపో/హైపర్‌ థైరాయిడ్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

⚛ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు రక్తప్రసరణ బాగా జరిగి నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందీ యోగాసనం.

⚛ నడుం కింది భాగంలో నొప్పి కొంతమంది మహిళల్ని ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ 5-20 నిమిషాల పాటు విపరీత కరణి ఆసనం సాధన చేస్తే కొన్ని రోజుల్లోనే నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు.

⚛ తలనొప్పిని తగ్గించుకోవాలన్నా, శరీరాన్ని పునరుత్తేజితం చేసుకోవాలన్నా ఈ ఆసనం చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు.

అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు- ఎవరైనా సరే దీనిని సాధన చేసేముందు ఒకసారి నిపుణుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్