Published : 30/05/2022 19:35 IST

First Period: ఆంటీ చెప్పిన ఆ విషయాలు నాకిప్పటికీ గుర్తే!

నెలసరి.. దీని గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇప్పటికీ చాలామంది సిగ్గుపడుతుంటారు. అంతెందుకు.. కన్న తల్లులు తమ కూతుళ్లకు ఈ విషయాల గురించి చెప్పడానికి వెనకాడుతుంటారు. కానీ అది కరక్ట్‌ కాదంటోంది బాలీవుడ్ డింపుల్‌ బ్యూటీ దీపికా పదుకొణె. టీనేజ్‌ దశలోకి అడుగుపెట్టబోయే అమ్మాయిలకు ముందు నుంచే పిరియడ్స్‌ విషయంలో అవగాహన పెంచే బాధ్యత తల్లే తీసుకోవాలని చెబుతోంది. చిన్నతనంలో పిరియడ్స్‌ గురించి తాను తెలుసుకున్న పలు విషయాల గురించి ఇటీవలే ఓ వేదికగా ప్రస్తావించిందీ చక్కనమ్మ.

ఈ సమాజంలో నెలసరి గురించి ఎన్నో అపోహలున్నాయి. పిరియడ్స్‌ సమయంలో వంటింట్లోకి రాకూడదని, కొన్ని వస్తువులు తాకకూడదని, మగాళ్ల ముందు ఈ విషయాలు మాట్లాడకూడదని.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటివన్నీ పిరియడ్స్‌ అంటే అమ్మాయిల్లో ఏదో తెలియని భయం, ఆందోళనల్ని రేకెత్తిస్తున్నాయని చెబుతోంది దీపిక.

అది తల్లుల బాధ్యతే!

‘తొలిసారి నెలసరి వచ్చినప్పుడు ఏ అమ్మాయైనా భయాందోళనలకు లోనవుతుంది. దీనికి కారణం.. పిరియడ్స్‌ గురించి వాళ్లకు పూర్తిగా అవగాహన కొరవడడమే! చాలామంది తల్లులు దీన్ని కళంకంగా భావించి తమ కూతుళ్లకు దీని గురించి చెప్పడానికి వెనకాడుతుంటారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఇంట్లోని మగాళ్లకు తెలియకుండా మేనేజ్ చేస్తుంటారు. నెలసరి వచ్చిన అమ్మాయిల్ని ఒక గదికే పరిమితం చేస్తుంటారు. వారిపై లేనిపోని ఆంక్షలు విధిస్తుంటారు. ఇవన్నీ నెలసరి అంటే వాళ్లలో ప్రతికూల భావన కలిగేందుకు ప్రేరేపిస్తున్నాయి. తద్వారా ఈ సమయం రాగానే వాళ్లు ఒక రకమైన అసహనానికి లోనవుతుంటారు. ఈ ఫీలింగే నెలసరి దుష్ప్రభావాల తీవ్రత మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందుకే ఇలాంటి అపోహలు, ప్రతికూల ఆలోచనలు లేకుండా అమ్మాయిలు పిరియడ్స్‌ సమయంలోనూ సాధారణంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే తల్లులే ఈ దిశగా చొరవ చూపాలి. చిన్నతనం నుంచే వాళ్లకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా చెప్పాలి. తద్వారా ముందు నుంచే పిరియడ్స్ అంటే ఒక అవగాహన ఏర్పడుతుంది. దీనిపై నెలకొన్న అపోహలు తొలగిపోవాలంటే ఇదే తొలి మెట్టు.’

ఆమె మాటలు మర్చిపోను!

‘నేనూ పెరిగి పెద్దయ్యే క్రమంలో పిరియడ్స్‌ గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకున్నా. నా చిన్నతనంలో ఓ రోజు నేను, మా అమ్మ.. నా ప్రాణ స్నేహితురాలు దివ్య, వాళ్ల అమ్మను కలిశాం. అప్పుడు ఆ ఆంటీనే నెలసరి టాపిక్‌ తీసుకొచ్చారు. మమ్మల్ని కూర్చోబెట్టి.. ‘అసలు పిరియడ్స్‌ అంటే ఏంటి?’, ‘అవి ఎందుకొస్తాయి?’.. వంటి విషయాలన్నీ ఎంతో ఓపిగ్గా, మాకు అర్థమయ్యేలా, నిర్మొహమాటంగా వివరించారు. ఆమె మాటల్ని నేనెప్పటికీ మర్చిపోను. పెరిగే క్రమంలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయాల్లో ఇదీ ఒకటి. ఇలాగే ప్రతి తల్లీ తన కూతురితో నెలసరి గురించి నిర్భయంగా, నిర్మొహమాటంగా పంచుకోవాలి..’ అంటూ చెప్పుకొచ్చిందీ సొగసరి.

అమ్మలూ.. మీ కూతుళ్లకు ఇవి చెప్పండి!

దీపిక చెప్పింది అక్షర సత్యం. చిన్న వయసు నుంచే తల్లులు నెలసరి గురించి తమ కూతుళ్లలో అవగాహన పెంచాలి. ఇదే ఈ సమయంలో ఆడపిల్లలు సౌకర్యంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఈ క్రమంలో తల్లులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు నిపుణులు.

* పిల్లలకు అర్థం చేసుకునే వయసొచ్చినప్పట్నుంచే నెలసరి గురించి ఒక్కో విషయం వారికి వివరించాలి. ఈ క్రమంలో శరీరంలో వచ్చే మార్పులు సహజమేనని చెప్పాలి.

* ఈ విషయం గురించి తల్లీకూతుళ్ల మధ్య జరిగే చర్చ నిర్మొహమాటంగా, సౌకర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే పిల్లలూ తమకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోగలుగుతారు. అలాగే నిరభ్యంతరంగా దీని గురించి మాట్లాడగలుగుతారు.

* నెలసరి గురించి చర్చించేటప్పుడు ఇంట్లో ఉన్న పురుషుల్నీ భాగం చేయాలి. అప్పుడు దీనిపై నెలకొన్న మూసధోరణులు, అపోహలు తొలగిపోతాయి. అమ్మాయిల్లోనూ భయం, బిడియం మాయమై ఏ విషయాన్నైనా ఫ్రీగా పంచుకోగలుగుతారు.

* కొంతమంది తల్లులు నెలసరి గురించి తమ కూతుళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, దాన్ని ఏదో చాటుమాటు వ్యవహారంలా పరిగణిస్తుంటారు. దీనివల్ల వారిలో ఉన్న సందేహాలు, సమస్యలకు సమాధానం దొరకదు. కాబట్టి కూతుళ్లు నెలసరి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేలా, ప్రశ్నలడిగేలా తల్లులు ప్రోత్సహించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

* అమ్మాయిలు తమ నెలసరి సమస్యల గురించి తల్లులకే కాదు.. స్నేహితుల దగ్గరా ప్రస్తావించడానికి మొహమాటపడుతుంటారు. కానీ ఇది కూడదని తల్లులే వారికి వివరించాలి. తోటి స్నేహితులతో దీని గురించి చర్చిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని ప్రోత్సహించే బాధ్యత కూడా మీదే!

* నెలసరి పరిశుభ్రత, ఈ సమయంలో వినియోగించే శ్యానిటరీ ఉత్పత్తుల గురించి కూడా తల్లులు ముందే తమ కూతుళ్లలో అవగాహన పెంచడం ముఖ్యం. తద్వారా వారు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే ఆస్కారం ఉంటుంది.

* నెలసరి సమయంలో అందరూ ఒకేలా ఉండకపోవచ్చు.. కొంతమందిలో మూడ్‌ స్వింగ్స్‌, మరికొందరిలో కడుపునొప్పి, ఇంకొందరిలో అధిక రక్తస్రావం.. ఇలా వివిధ లక్షణాలు కనిపిస్తుంటాయి. సో.. వీటిలో మీ కూతురు ఏ సమస్యతో ఎక్కువగా బాధపడుతుందో తెలుసుకోండి. దాన్ని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఇలాంటి ఆరోగ్యకరమైన చర్చ జరిగినప్పుడే అటు ఆడపిల్లల్లో నెలసరిపై పూర్తి అవగాహన వస్తుంది. ఇటు సమాజంలో నెలకొన్న మూసధోరణులు తొలగిపోతాయి. మరి, ఈ విషయంలో మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి