అలాంటి పిల్లల కోసం.. ‘వన్‌ టీచర్‌.. వన్‌ కాల్‌’!

ప్రభుత్వోద్యోగం, వేల కొద్దీ జీతం, ఇల్లు-పిల్లలు.. ఒక మహిళకు ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?! అయితే ఇవన్నీ ఉన్నా తన జీవితంలో ఎప్పుడూ ఏదో వెలితిగా ఫీలయ్యేది ఉత్తరప్రదేశ్‌ బరేలీకి చెందిన దీప్‌మాలా పాండే. ఇదంతా సమాజ సేవ కోసమేనని ఓ సంఘటన....

Published : 23 Sep 2022 19:54 IST

ప్రభుత్వోద్యోగం, వేల కొద్దీ జీతం, ఇల్లు-పిల్లలు.. ఒక మహిళకు ఇంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?! అయితే ఇవన్నీ ఉన్నా తన జీవితంలో ఎప్పుడూ ఏదో వెలితిగా ఫీలయ్యేది ఉత్తరప్రదేశ్‌ బరేలీకి చెందిన దీప్‌మాలా పాండే. ఇదంతా సమాజ సేవ కోసమేనని ఓ సంఘటన తర్వాత గుర్తించిన ఆమె.. ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల పరిస్థితి చూసి చలించిపోయింది. అందరు పిల్లల్లా వారూ చదువుకోవాలి, అన్ని అంశాల్లో ఆరితేరాలని వారి కోసం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిందామె. దాని ద్వారా అటు విద్యను, ఇటు సామాజిక విలువల్ని నేర్పిస్తూ ఆ చిన్నారుల అభివృద్ధికి కృషి చేస్తోంది. మరి, దీప్‌మాలాను సమాజ సేవ వైపు మళ్లించిన ఆ సంఘటనేంటి? తెలుసుకుందాం రండి..

దీప్‌మాలాది ఉత్తరప్రదేశ్‌ బరేలీ జిల్లాలోని దభౌరా గ్రామం. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆమె.. అక్కడి ఓ స్కూల్లో పనిచేసేది. మంచి జీతం అందుకుంటూ.. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో చీకూచింతా లేకుండా ఉన్నప్పటికీ.. తన జీవితంలో ఏదో వెలితిగా ఫీలయ్యేదామె. సమాజ సేవ కోసం తన మనసు పరితపిస్తోందని ఆ ఊరి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యాక గానీ తెలుసుకోలేకపోయిందామె.

ఆ పిల్లాడిని చూశాకే..!

దభౌరా ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యాక.. అక్కడ చదువుతున్న అన్‌మోల్‌ అనే విద్యార్థి పరిస్థితిని దగ్గర్నుంచి గమనించింది దీప్‌మాలా. ఆ అబ్బాయిలో కొన్ని మానసిక లోపాలున్నాయి. తనకున్న వాక్‌ వైకల్యం కారణంగా అందరు పిల్లల్లా పాఠాలు నేర్చుకోలేడు.. అర్థం చేసుకోలేడు.. అయినా తనను ఎవరూ పట్టించుకోకపోవడం, పిల్లలందరితో కలిసి కూర్చొని ఇబ్బంది పడడం.. ఇవన్నీ దగ్గర్నుంచి గమనించిందీ టీచరమ్మ. ఇలా అన్‌మోల్‌ను చూశాకే.. ఇన్నాళ్లూ తన మనసులో ఉన్న వెలితి ఏంటో గుర్తించానంటోంది దీప్‌మాలా.

‘మాది మధ్య తరగతి కుటుంబం. మంచి ఉద్యోగం సంపాదించినా.. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలన్న ఆలోచన మనసులో ఎప్పుడూ ఉండేది. కానీ దాన్నెలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే అన్‌మోల్‌ అనే విద్యార్థి పరిస్థితిని దగ్గర్నుంచి గమనించానో అప్పుడే డిసైడయ్యా.. ప్రత్యేక అవసరాలున్న పిల్లల అభివృద్ధి కోసం కృషి చేయాలని. అయితే ప్రభుత్వం ఇలాంటి పిల్లల కోసం ఎన్నో పథకాలు, వనరులు అందుబాటులో ఉంచినా.. అవి గ్రామీణ ప్రాంతాల దాకా చేరుకోలేకపోతున్నాయని తెలుసుకున్నా. అందుకే మా రాష్ట్రంలోని ఇలాంటి శారీరక, మానసిక లోపాలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు, విలువలను నేర్పించడానికి కంకణం కట్టుకున్నా..’ అంటారామె.

‘వన్‌ టీచర్‌.. వన్‌ కాల్‌’కు బీజం!

శారీరకంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలున్నప్పటికీ.. ఈ చిన్నారులు కూడా సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవాలని కోరుకుంది దీప్‌మాలా. ఈ క్రమంలోనే ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల్లో లోపాలు, వాళ్ల సమస్యలు, వికలాంగుల హక్కుల చట్టంలోని ప్రధానాంశాలు.. వంటి వాటి గురించి లోతుగా తెలుసుకుందామె. దీన్ని కొనసాగిస్తూనే.. మరోవైపు అన్‌మోల్‌ బాధ్యతనూ తానే తీసుకుంది. ఆ పిల్లాడి అవసరాన్ని బట్టి సంజ్ఞలు, ఇతర బోధనా పద్ధతుల ద్వారా పాఠాలు చెప్పడం మొదలుపెట్టిందీ టీచరమ్మ. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అబ్బాయిలో మార్పు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందంటోందామె.

‘ప్రత్యేక బోధనా పద్ధతులతో అన్‌మోల్‌లో క్రమంగా మార్పు గమనించాను. అతను పాఠాలు నేర్చుకోవడంతో పాటు గతంలో తనకు సాధ్యం కాని ఇతర వ్యాపకాల్లోనూ చురుగ్గా భాగమవడం, పిల్లలందరితో కలిసిపోవడం ఎంతో సానుకూల పరిణామం. ఇదే ‘వన్‌ టీచర్‌.. వన్‌ కాల్‌’ అనే కార్యక్రమానికి తెరతీసింది. ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడం ఎంత ముఖ్యమో వివరిస్తూ.. ఉపాధ్యాయులు ఒక్క ఫోన్‌ కాల్‌తో ఇతర ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం..’ అంటూ చెప్పుకొచ్చారీ టీచరమ్మ.

టీచర్లకూ పాఠాలు..!

ఇలా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు చేయూతనందించడమే కాదు.. వారికి విద్యాబుద్ధులు నేర్పించేలా అక్కడి టీచర్లకూ ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నారు దీప్‌మాలా. ఈ క్రమంలో శారీరక, మానసిక వైకల్యాలున్న చిన్నారులతో ఎలా మెలగాలి? వారిలోని లోపాల్ని ఎలా గుర్తించాలి? వాళ్లకు అనుగుణమైన బోధనా పద్ధతులేంటి? ఇలాంటి అంశాలపై అక్కడి టీచర్లలో అవగాహన కల్పిస్తున్నారామె. ఇప్పటివరకు సుమారు 400 మంది టీచర్లను ఈ దిశగా తీర్చిదిద్దారామె. దీప్‌మాలా చొరవతో ప్రస్తుతం ఆ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు సాధారణ పిల్లలతో కలిసి చదువుకోగలుగుతున్నారు. ప్రస్తుతం దభౌరా ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతోన్న ఆమె.. ‘ఈ సమాజంలోని ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల భవిత మారాలంటే ఏ ఒక్కరో, ఇద్దరి వల్లనో సాధ్యం కాదు.. తలా ఓ చేయి వస్తేనే ఫలితం ఉంటుంది.. కాబట్టి మాటలు, చేతలతో వారిని చిన్నబుచ్చకుండా.. మీ చుట్టూ ఉండే ఇలాంటి చిన్నారులకు చేయూతనందించండి..’ అంటూ తన మాటలతోనూ నలుగురిలో స్ఫూర్తి నింపుతోంది దీప్‌మాలా.

ప్రత్యేక అవసరాలున్న పిల్లల అభివృద్ధి కోసం ఈ టీచరమ్మ చేస్తోన్న కృషి గతేడాది ప్రధాని మోదీని చేరింది. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా ప్రధాని ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్