XL to XS : ఐదు నెలల్లో 25 కిలోలు తగ్గా!

పిల్లలు, కుటుంబ బాధ్యతల ధ్యాసలో పడి మహిళలు తమ గురించి అసలు పట్టించుకోరు. ఆరోగ్యం గురించిన ఆలోచనే వారికి రాదు. ఇదిగో ఈ నిర్లక్ష్యమే ఎన్నో అనారోగ్యాలకు, అధిక బరువుకు కారణమవుతుందంటున్నారు దిల్లీకి చెందిన న్యూట్రిషనిస్ట్‌ సిమ్రన్‌ చోప్రా.

Published : 28 Aug 2021 16:37 IST

(Photo: Instagram)

పిల్లలు, కుటుంబ బాధ్యతల ధ్యాసలో పడి మహిళలు తమ గురించి అసలు పట్టించుకోరు. ఆరోగ్యం గురించిన ఆలోచనే వారికి రాదు. ఇదిగో ఈ నిర్లక్ష్యమే ఎన్నో అనారోగ్యాలకు, అధిక బరువుకు కారణమవుతుందంటున్నారు దిల్లీకి చెందిన న్యూట్రిషనిస్ట్‌ సిమ్రన్‌ చోప్రా. అనారోగ్యకరమైన జీవనశైలి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో సుమారు 25 కిలోల బరువు పెరిగిన ఆమె.. తన శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా జరిగిందంటోంది. కాస్త ఆలస్యంగానైనా ఈ మార్పును గుర్తించి తిరిగి బరువు తగ్గడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఐదు నెలల్లో సుమారు 25 కిలోలు తగ్గి స్లిమ్‌గా మారడమే కాదు.. ‘Nourish With Sim’ అనే స్టార్టప్‌ను ప్రారంభించి.. ఈ వేదికగా ఆరోగ్యం, ఫిట్నెస్‌ విషయాల్లో మహిళల్ని చైతన్యపరుస్తోంది. అలాగని దీన్ని తను వ్యాపారంగా పరిగణించట్లేదని, ఇతర మహిళల్లో మార్పు కోసమే దీన్ని ప్రారంభించానంటోన్న సిమ్రన్‌.. తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

కాలేజ్‌ డేస్‌ అంటేనే మనకు ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో ఎంతో ఎంజాయ్‌మెంట్‌ ఉంటుంది. ఈ సరదాల్లో పడిపోయి మనం మన శరీరాన్నే నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇక చదువు పూర్తయ్యాక ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఈ బాధ్యతలతోనే సరిపోతుంది. ఎనిమిదేళ్ల క్రితం వరకు నా పరిస్థితీ ఇదే! శారీరక బరువు గురించి కాస్త అవగాహన ఉన్నా అది ఇతర అనారోగ్యాల్ని తెచ్చిపెడుతుందన్న విషయంపై అప్పటికి నాకు అంత అవగాహన లేదు. ఇది క్రమంగా పీసీఓఎస్‌ సమస్యకు దారితీసింది. దీనికి తోడు గర్భిణిగా ఉన్న సమయంలో జెస్టేషనల్‌ డయాబెటిస్‌, బిడ్డ పుట్టాక ప్రసవానంతర ఒత్తిడి.. అంతిమంగా ఇవన్నీ నేను దాదాపు 25 కిలోల దాకా బరువు పెరిగేలా చేశాయి.

అద్దంలో చూసుకోలేకపోయేదాన్ని!

మా బాబుకు మూడు నెలల వయసున్నప్పుడు ఉన్నట్లుండి ఒక రోజు విపరీతమైన వెన్ను నొప్పి వేధించింది. కనీసం లేచి డైపర్‌ మార్చడానికి కూడా నా శరీరం సహకరించేది కాదు. దీనికి తోడు నా అధిక బరువును చూసి ఇరుగు పొరుగు వాళ్లు చేసే కామెంట్లు నా మనసు మీద ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో కనీసం అద్దంలో కూడా నా మొహం నేను చూసుకోకపోయేదాన్ని. ఓ సినిమాకో, అలా దగ్గర్లోని షాపుకో, బంధువుల ఫంక్షన్లకో వెళ్లడానికి కూడా నా మనసు అంగీకరించేది కాదు. అలా నాలుగ్గోడల మధ్యే చాలా రోజులు గడిపాను. ఇలా క్రమంగా దెబ్బతింటూ వచ్చిన నా ఆత్మవిశ్వాసం నేను అసంపూర్ణం అన్న భావనలోకి నన్ను నెట్టేసింది. ఏం చేసినా తప్పనిపించేది. ప్రపంచమంతా ఒకటి.. నేనొక్కదాన్నే ఒకటి అన్న ఫీలింగ్‌ కలిగేది. మరోవైపు.. పీసీఓఎస్‌ కారణంగా జుట్టు రాలడం, అవాంఛిత రోమాలు, మొటిమలు వేధించేవి. నడుంనొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇక్కడే నా ఆలోచనల్లో మార్పొచ్చిందని చెప్పాలి.

ఆ ఆలోచనే నన్ను మార్చింది!

నడుంనొప్పితో మూడోసారి ఆస్పత్రిలో చేరినప్పుడు.. ‘నా పరిస్థితేంటి ఇలా తయారైంది.. ఓ తల్లిగా నేను పూర్తి ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడే నా బిడ్డను చూసుకోగలను. అలాంటిది అనవసరమైన ఆలోచనలతో నా ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటున్నా’ అని రియలైజయ్యా. నిజానికి ఈ ఆలోచనే నాలో మార్పు తెచ్చిందని చెప్తా. అప్పట్నుంచే నా వెయిట్‌ లాస్‌ జర్నీ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఓ ఇన్‌స్ట్రక్టర్‌ను నియమించుకున్నా. ఆహారంలో మార్పులు చేసుకున్నా.. అప్పటిదాకా అలవాటు లేని ఫిట్‌నెస్‌ రొటీన్‌ని నా జీవనశైలిలో చేర్చుకున్నా.

వాటిని వదల్లేదు!

బరువు తగ్గాలంటే డైటింగ్‌ చేయడం, తక్కువ సమయంలో నాజూగ్గా మారాలని ఫ్యాడ్‌ డైట్స్‌ ఫాలో అవ్వడం.. వంటివేవీ నేను చేయలేదు. రోజూ తీసుకునే ఆహారమే కానీ అందులో కాయగూరలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చా. అలాగే నేనో పెద్ద ఫుడీని! నూడుల్స్‌, పాస్తా, బర్గర్స్‌ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అలాగని బరువు తగ్గే క్రమంలోనూ నేను వాటిని పక్కన పెట్టలేదు. తినాలనిపించినప్పుడల్లా వాటిని హెల్దీగా తింటూనే కాసేపు అదనంగా వ్యాయామం చేసేదాన్ని. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నేను బరువు తగ్గడమే కాదు.. పీసీఓఎస్‌ సమస్యనూ అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేస్తూనే నా ఇన్‌స్ట్రక్టర్‌ సహాయంతో డైట్‌ని ప్లాన్‌ చేసుకున్నా.

* ఉదయం గ్లాసు గోరువెచ్చటి నీటితో రోజును ప్రారంభించేదాన్ని.

* బ్రేక్‌ఫాస్ట్‌ కోసం గుడ్లు-కాయగూరలు-టోస్ట్‌, ఇడ్లీ-సాంబార్‌, ఓట్స్‌.. వంటివి తీసుకునేదాన్ని. సాంబార్‌లో కాయగూరల్ని ఎక్కువగా వాడేదాన్ని.

* మధ్యాహ్న భోజనంలో.. అన్నం/చిరుధాన్యాలు, ఏదో ఒక కూర, పప్పు/రాజ్మా/కాబూలీ శెనగలు.. వంటివి తీసుకునేదాన్ని. అలాగే వీటితో పాటు కప్పు పెరుగు ఉండాల్సిందే!

* సాయంత్రం ఏదో ఒక పండు తీసుకునేదాన్ని.


* రాత్రి భోజనంలో చాలా ప్రయోగాలే చేశా. నూడుల్స్‌, పాస్తా, బర్గర్స్‌.. వంటివి తినేదాన్ని. అదేంటి అవి ఆరోగ్యానికి మంచివి కాదు కదా అనుకుంటున్నారా? అయితే నేను స్వయంగా తయారుచేసుకునే ఈ వంటకాల్లో కాయగూరలు, గ్రిల్డ్‌ చికెన్‌.. ఎక్కువగా వాడేదాన్ని. నిజానికి ఇలా మనకు నచ్చిన పదార్థాలు హెల్దీగా తినడం వల్ల జంక్ ఫుడ్‌ తినాలన్న ఆలోచనే రాదు.

* ఇక నేను బరువు తగ్గడానికి తోడ్పడిన మరో రెండు అంశాలేంటంటే.. ఒకటి - ఎంత బిజీగా ఉన్నా నా కుటుంబంతో కలిసి సరదాగా మాట్లాడుతూ భోంచేయడం, రెండోది - 80/10/10 రూల్‌ ఫాలో అవడం.. అంటే నేను తీసుకునే ఆహారంలో 80 శాతం దాకా కాయగూరలు, పండ్లు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్లు ఉండేలా చూసుకున్నా.

* చక్కెరలు, బేకరీ ఐటమ్స్‌, మైదాతో చేసిన పదార్థాలకు పూర్తి దూరంగా ఉన్నా.. కూరల్లో కూడా ఉప్పును మితంగా వాడేదాన్ని.

 

జిమ్‌కి వెళ్లలేదు!

బరువు తగ్గాలంటే జిమ్‌కే వెళ్లాలని లేదు.. ఇంట్లోనూ వ్యాయామాలు చేసి తగ్గించుకోవచ్చు. నేనూ అలాగే చేశాను. ఎందుకంటే బాబును చూసుకునే క్రమంలో నాకు జిమ్‌కి వెళ్లే సమయం దొరకలేదు. అందుకే ఇంట్లోనే కచ్చితంగా అరగంట పాటు వ్యాయామాలు చేయడానికి వెచ్చించా.

* కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌.. ఈ మూడూ రోజు విడిచి రోజు సాధన చేసేదాన్ని.

* రోజుకు పదివేల అడుగులు వేసేదాన్ని.. మూడు లీటర్ల నీళ్లు తాగేదాన్ని.

* పావుగంట పాటు ధ్యానం చేయడానికి కేటాయించా. అప్పుడప్పుడూ పుస్తకాలు చదవడం, మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల ఒత్తిళ్లన్నీ మాయమై మనసుకు ప్రశాంతంగా అనిపించేది.

* రోజుకు అరగంట పాటు మొబైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసేదాన్ని.

* ఇక రాత్రుళ్లు కనీసం ఏడు గంటలు నిద్రపోయేదాన్ని.

మార్పు కనిపించింది!

ఈ చిట్కాలన్నీ పాటిస్తున్న క్రమంలో కొన్నాళ్లకు నాలో మార్పు రావడం గమనించా. క్రమంగా బరువు తగ్గుతున్నానని నాకు అర్థమైంది. అంతకుముందు వేసుకున్న దుస్తులే వదులుగా, సౌకర్యవంతంగా అనిపించేవి. జీన్స్‌ కూడా ఎంతో కంఫర్టబుల్‌గా ధరించేదాన్ని. నిజానికి ఈ పాజిటివ్‌ మార్పులన్నీ నన్ను మరింతగా ప్రోత్సహించాయి. ఐదు నెలల్లో సుమారు 25 కిలోల దాకా తగ్గి.. XL సైజు నుంచి XS సైజుకు చేరుకున్నా. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా, అందంగా ఉన్నానన్న భావన కలిగేది. ఇక ఇప్పుడు బరువు తగ్గాను కదా అని వీటిని పక్కన పెట్టలేదు.. నేటికీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం కొనసాగిస్తున్నా.

అది వ్యాపారం కాదు!

స్లిమ్‌గా మారాక నా శరీరం, మనసు రెండూ నా అధీనంలోకి వచ్చాయి. నేనొక్కదాన్నే కాదు.. నాలా బాధపడే వారు చుట్టూ ఎంతోమంది ఉంటారన్న విషయం గ్రహించా. నా వెయిట్‌ లాస్‌ స్టోరీ వాళ్లలో స్ఫూర్తి నింపుతుందనిపించింది. అందుకే ‘Nourish With Sim’ అనే స్టార్టప్‌ని ప్రారంభించా. దీని ద్వారా బరువు తగ్గేందుకు, పీసీఓఎస్ వంటి అనారోగ్యాల నుంచి బయటపడేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో అందరితో పంచుకుంటున్నా. ఆపై న్యూట్రిషనిస్ట్‌గా మారి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, అందం.. వంటి అంశాల్లో అందరిలో అవగాహన పెంచేందుకు నా వెబ్‌సైట్‌ను, సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నా. ఇలా నేనిచ్చే చిట్కాలే కాదు.. ఇతర మహిళలూ తమ ఫిట్‌నెస్‌, వెయిట్‌ లాస్‌ సీక్రెట్స్‌ని నా ఇన్‌స్టా పేజీ ద్వారా పంచుకోవచ్చు. అలా ఇప్పటికి చాలామంది తమ స్ఫూర్తిదాయక కథల్ని ఈ వేదికగా పంచుకున్నారు. ఎంతోమందిలో ప్రేరణ కలిగించారు. మహిళలంటే కుటుంబానికే కాదు.. తమ ఆరోగ్యానికీ ప్రాధాన్యమివ్వాలన్న విషయం తెలియజేశారు. అలాగని నేను దీన్ని వ్యాపారంగా పరిగణించట్లేదు. ఇతరుల్లో స్ఫూర్తి నింపే ఓ వారధిగా భావిస్తున్నా.

ఆఖరుగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఓ వర్కింగ్‌ మదర్‌గా ఇంటిని, పనిని బ్యాలన్స్‌ చేసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు! ఇప్పుడు చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే మనం ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లయితే మనపై మనకు ప్రేమ పెరుగుతుంది. అదే జరిగితే ఎలాంటి సవాలునైనా ఒత్తిడి లేకుండా ఎదుర్కోగలుగుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్