‘ఫేస్‌బుక్‌’తో రెండు రోజుల్లోనే అలా రేపిస్ట్‌ను పట్టుకుంది!

మైనారిటీ కూడా తీరని ఓ అమ్మాయిని మాయ మాటలు చెప్పి మోసగించాడు ఓ యువకుడు. ప్రేమ పేరుతో వల పన్ని గర్భవతిని కూడా చేశాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. ముందు జాగ్రత్తగా పేరు తప్ప మరే వివరాలు బాధితురాలికి తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ క్రమంలో నయవంచకుడి చేతిలో నిలువునా మోసపోయినట్లు గ్రహించిన ఆ బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

Published : 04 Aug 2021 20:01 IST

(Image for Representation)

మైనారిటీ కూడా తీరని ఓ అమ్మాయిని మాయ మాటలు చెప్పి మోసగించాడు ఓ యువకుడు. ప్రేమ పేరుతో వల పన్ని గర్భవతిని కూడా చేశాడు. ఆ తరువాత మొహం చాటేశాడు. ముందు జాగ్రత్తగా పేరు తప్ప మరే వివరాలు బాధితురాలికి తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ క్రమంలో నయవంచకుడి చేతిలో నిలువునా మోసపోయినట్లు గ్రహించిన ఆ బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

రెండు రోజుల్లోనే రేపిస్ట్‌ను పట్టుకుంది!

సాధారణంగా ఇలాంటి కేసులు ఓ కొలిక్కి రావాలంటే చాలా సమయం పడుతుంది. క్షేత్ర స్థాయిలో సాక్ష్యాల సేకరణ, నిందితుల గుర్తింపు, విచారణ... ఇలా ఎన్నో దశలు దాటితే తప్ప అసలు దోషులు బయటపడరు. పైగా ఈ కేసులో యువకుడి పేరు తప్ప ఇతర ఆధారాలేమీ తెలియదు. అయితే దిల్లీలోని దబ్రీ సబ్ ఇన్‌స్పెక్టర్‌ ప్రియాంక సైనీ కేవలం రెండు రోజుల్లోనే ఆ రేపిస్ట్‌ను పట్టుకుంది.

ఫేస్‌బుక్‌ సహాయంతో!

సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగించి అమ్మాయిలను ట్రాప్‌లో పడేస్తుంటారు చాలామంది. దొంగ పేర్లతో నకిలీ అకౌంట్లు సృష్టించి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మైనర్‌ అమ్మాయిని మోసం చేసిన నిందితుడిని పట్టుకోవడానికి ఇదే పద్ధతిని అనుసరించింది ప్రియాంక. సాధారణ దుస్తుల్లో దిగిన తన ఫొటోనే పెట్టి ఓ నకిలీ పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచింది. ఇందులోని ‘సెర్చింగ్‌ టూల్స్‌’ సహాయంతో దిల్లీలో ఆకాశ్‌ అనే పేరున్న వారందరికీ ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపింది. కొంత మంది యాక్సెప్ట్‌ చేస్తే మరికొంతమంది రిజెక్ట్‌ చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్‌ రిక్వెస్టును యాక్సెప్ట్‌ చేసిన వారందరికీ మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించింది.

ఆ ‘ఆకాశ్‌’ ఇతడేనేమో!

ఎస్‌ఐ పంపిన మెసేజ్‌లకు ఎవరూ స్పందించకపోయినా ఒకడు మాత్రం రిప్లై ఇచ్చాడు. దీంతో ‘ఆ ఆకాశ్‌ ఇతడేనేమో?’అని అనుమానించిన ప్రియాంక దీనిని నిర్ధారించుకోవడానికి అతడితో ఛాటింగ్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో ఫోన్‌ నంబర్‌తో పాటు అతని ఫొటోలు, ఇతర వివరాలు కూడా సేకరించింది. బాధితురాలితో మాట్లాడి ఫైనల్‌గా అతడే అసలు ఆకాశ్‌ అని నిర్ధారించుకున్నాక ‘నువ్వు నాకు నచ్చావ్.. ఒకసారి ఇద్దరం కలుద్దామం’ది. ఆ యువకుడు కూడా ‘ఓకే’ అన్నాడు. దీంతో తన బృందాన్ని అప్రమత్తం చేసింది ప్రియాంక. అతడు చెప్పినట్టుగానే మొదట దశరథ్‌ పూరీ మెట్రో స్టేషన్‌కు బయలుదేరింది. తోడుగా మఫ్టీలో పోలీసులను కూడా తీసుకెళ్లింది. అయితే మధ్యలో హఠాత్తుగా ఫోన్‌ చేసి మెట్రో స్టేషన్‌లో వద్దని ద్వారకా సెక్టార్‌ వన్‌కు రమ్మన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి శ్రీ మాతా మందిర్‌ మహవీర్‌ ఎన్‌క్లేవ్‌లో కలుద్దామన్నాడు.

15 నెలల్లో ఆరుగురిని మోసం చేశాడు!

అయితే ఎన్ని లొకేషన్‌లు మార్చినా ప్రియాంక గాలం నుంచి తప్పించుకోలేకపోయాడు ఆకాశ్‌. ఏదో ఊహించుకుంటూ వచ్చిన అతడిని అరెస్ట్‌ చేసి కటాకటాల్లోకి నెట్టింది. ఆ తర్వాత తనదైన శైలిలో విచారణ చేపట్టగా మరికొన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ పేర్లు, చిరునామాలతో చలామణీ అవుతోన్న అతడు గత 15 నెలల్లో ఆరుగురు అమ్మాయిలని ఇలాగే నమ్మించి మోసం చేశాడని తెలిసింది.

సోషల్ మీడియా సహాయంతో ఎంతో తెలివిగా రేపిస్ట్‌ను పట్టుకున్న ప్రియాంకపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉన్నతాధికారులు ఆమె తెలివితేటలను, పనితీరును అభినందిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్