Published : 07/09/2021 18:18 IST

వాళ్ల కోసం 321 స్మార్ట్ ఫోన్లు సేకరించి..!

(Photo: Twitter)

‘గురువంటే విద్యా దానం చేయడమే కాదు.. ఈ క్రమంలో విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం కూడా తమ విధే..’ అంటారు దిల్లీ ప్రభుత్వ పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ భారతీ కర్లా. ఈ కరోనా వేళ డిజిటల్‌ సదుపాయాల్లేక ఆన్‌లైన్‌ క్లాసులకు దూరమైన చిన్నారులకు వందలాది స్మార్ట్‌ ఫోన్లు అందించారామె. ఇలా ఈ ప్రతికూల సమయంలోనూ అవసరంలో ఉన్న చిన్నారులకు అండగా నిలిచారు. ఇందుకు ప్రతిగా ఇటీవలే ‘రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారం’ అందుకున్నారు కర్లా. వృత్తిలో భాగంగా మనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ఎంత గొప్ప విషయమో.. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం అంతకంటే సంతృప్తితో కూడుకున్నది అంటారామె.

భారతీ కర్లా.. దిల్లీ రోహిణి సెక్టార్‌-8 లోని సర్వోదయ విద్యాలయ వైస్‌ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. టీచర్‌ అంటే కేవలం చదువు చెప్పడమే కాదు.. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సమస్యల్ని తొలగించినప్పుడే పిల్లలు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతారు అంటారు కర్లా. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు తమ పాఠశాల విద్యార్థుల వెతల్ని దూరం చేస్తుంటారామె.

అప్పుడొచ్చింది ఐడియా!

కరోనా సమయంలో పిల్లలందరూ ఇంటికే పరిమితమైనా.. డిజిటల్‌ క్లాసులకు హాజరయ్యే క్రమంలో వారికి స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ అందుబాటులో ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకునేవారు. అయితే ఈ క్రమంలో చాలామంది విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు లేక ఇబ్బంది పడడం గమనించిన కర్లా.. వాటిని సేకరించే పనికి పూనుకున్నానంటున్నారు.

‘ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాక చాలామంది చిన్నారుల వద్ద స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌ లేవన్న విషయం తెలుసుకున్నా. అంతేకాదు.. అప్పటికప్పుడు వాటిని కొనే స్థోమత కూడా వారికి లేదు. ఇక ఆ సమయంలోనే మా స్కూల్‌ విద్యార్థి కరోనా కారణంగా తన తండ్రిని కోల్పోయాడు. దాంతో అతడికి ఒక స్మార్ట్ ఫోన్‌ అందించా. మిగతా వాళ్లకూ ఈ సదుపాయం కల్పించి వారిని ఆన్‌లైన్‌ క్లాసులు మిస్సవ్వకుండా చూడాలని అప్పుడనిపించింది.. ఈ క్రమంలోనే మా స్కూల్‌ టీచర్లందరికీ ఫోన్లు చేసి.. వాళ్ల దగ్గర, వాళ్లకు తెలిసిన వాళ్ల దగ్గర అదనంగా ఉన్న స్మార్ట్ ఫోన్లను సేకరించమన్నా. ఇటు నేనూ ఇదే పనిలో మునిగిపోయా..’ అంటూ తన ఐడియా గురించి చెప్పుకొచ్చారు కర్లా.

అదంత సులభం కాలేదు!

అదనంగా ఉన్నా సరే.. స్మార్ట్ ఫోన్‌ కావాలనగానే ఎవరైనా ఎందుకిస్తారు? తను, తన కొలీగ్స్‌ మొబైల్స్‌ సేకరించే క్రమంలోనూ చాలామంది ఇవ్వడానికి నిరాకరించారని చెబుతున్నారు కర్లా.

‘పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్లైతే సేకరించాలనుకున్నా.. కానీ అదంత సులభంగా ఏమీ జరగలేదు. వాళ్ల దగ్గర అదనంగా ఉన్నా సరే.. చాలామంది ఇందుకు ససేమిరా అన్నారు. బతిమాలో, బామాలో వాళ్లను ఒప్పించాం.. మరికొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయం చేశారు. ఇలా మొత్తంగా సుమారు 321 స్మార్ట్ ఫోన్లు సేకరించాను. వాటిని అవసరంలో ఉన్న చిన్నారులకు అందించా..’ అంటూ పంచుకున్నారామె. ఇక మరికొంతమందికి వర్క్‌షీట్లు అందించి వారి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తపడుతున్నారామె.

అస్సలు ఊహించలేదు!

పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసుల్ని దగ్గర చేయడానికి వందలాది స్మార్ట్‌ఫోన్లు సేకరించి అందించినందుకుగాను ఇటీవలే ‘రాష్ట్ర ఉపాధ్యాయ పురస్కారం’ అందుకున్నారు కర్లా. అయితే ఓ టీచర్‌గా తన విద్యార్థులకు సహాయపడడానికే ఇలా చేశాను తప్ప అవార్డు వస్తుందని ఊహించలేదంటున్నారామె.

‘నిజానికి నేను ఈ అవార్డు కోసం అప్లై చేయలేదు. అలాంటిది ఇందుకు నేను నామినేట్‌ అవడం.. అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇక ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఈ గుర్తింపు రావడం మరింత గర్వంగా ఉంది. పిల్లల కోసం నేను చేసిందంతా నా వృత్తిలో భాగమే.. అది నా బాధ్యత! అయినా ఇందుకు ప్రతిగా అవార్డు రావడమనేది అదో అద్భుతమైన ఫీలింగ్‌’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారీ దిల్లీ టీచర్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని