యాసిడ్ దాడి బాధితులకు స్వయం ఉపాధి చూపిస్తూ..!

ఆమ్ల దాడి బాధితుల వెతలు వర్ణనాతీతం! తమ పొరపాటు లేకపోయినా తమపై జరిగిన దాడికి ఓవైపు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే.. మరోవైపు వ్యక్తిగతంగానూ ఎంతో బాధను భరిస్తారు.

Updated : 23 Aug 2023 19:22 IST

(Photos: Instagram)

ఆమ్ల దాడి బాధితుల వెతలు వర్ణనాతీతం! తమ పొరపాటు లేకపోయినా తమపై జరిగిన దాడికి ఓవైపు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే.. మరోవైపు వ్యక్తిగతంగానూ ఎంతో బాధను భరిస్తారు. తమ ఒంటికి సబ్బు వాడినా, సౌందర్య ఉత్పత్తి వాడినా.. అందులోని రసాయనాలు వారి చర్మాన్ని మరింత గాయపరుస్తుంటాయి. యాసిడ్‌ దాడి బాధితుల ఇలాంటి సమస్యల్ని దగ్గర్నుంచి గమనించింది 17 ఏళ్ల సిమర్‌ సంగ్లా. వాళ్ల ఒంటికి సాంత్వననిచ్చేలా సహజసిద్ధమైన సబ్బులు తయారుచేయడం ప్రారంభించిందామె.. అక్కడితో ఆగిపోకుండా.. ఇవే నైపుణ్యాల్ని వారికి పంచుతూ.. ఆమ్ల దాడి బాధితులకు స్వయం ఉపాధి చూపుతోంది. ఒక్క ప్రయత్నం వందల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందంటోన్న సిమర్‌.. అసలు ఈ మంచి పనిని ఎలా ప్రారంభించిందో తెలుసుకుందాం రండి..

దిల్లీకి చెందిన సిమర్‌ ప్రస్తుతం స్థానిక మోడ్రన్‌ స్కూల్‌ వసంత్‌ విహార్‌లో 12వ తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచే ఆమెకు సామాజిక స్పృహ ఎక్కువ. ఈ క్రమంలోనే అవసరంలో ఉన్న వారికి తన వంతుగా ఏదో ఒక సహాయం అందించేది. అయితే తన ఇంట్లో పనిచేసే పనిమనిషి కూతురు ఓసారి ఆమ్ల దాడికి గురైంది. ఆమె ఒంటికి బయట దొరికే సబ్బులు పడక.. ఎంతో ఇబ్బంది పడేది. ఇది గమనించిన సిమర్‌.. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపాలనుకుంది.

సేఫ్‌ కేవ్‌.. ఆలోచన అలా!

‘మా పనిమనిషి ఆమ్ల దాడి బాధితురాలైన తన కూతురి గురించి పదే పదే చెబుతూ బాధపడేది. ఏ సబ్బు వాడినా దురద రావడం, చర్మం ఎరుపెక్కడంతో సమస్య రెట్టింపయ్యేదని చెప్పేది. నిజానికి ఆమ్ల దాడి గురించి వినడమే తప్ప.. వాళ్ల సమస్యలు ఎలా ఉంటాయో తాను చెప్తే తప్ప నేను అర్థం చేసుకోలేకపోయా. అయితే ఈ సమస్యకు ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నా. ఈ క్రమంలోనే ఆమ్ల దాడి బాధితులు, వాళ్లు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకునేందుకు చిన్నపాటి పరిశోధనే చేశా. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా వందలాది మంది ఆమ్లదాడి బాధితులున్నారని, ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతుందని అర్థమైంది. ఆపై యాసిడ్‌ దాడి బాధితుల సంక్షేమం కోసం పనిచేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థను సందర్శించా. వ్యక్తిగతంగాను, సమాజం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే.. తమ కాళ్లపై తాము నిలబడిన ఎంతోమంది యాసిడ్ దాడి బాధితుల జీవన పోరాటం నన్ను ఆలోచనలో పడేసింది. నేనూ ఇలాంటి ఎన్జీవోనే నెలకొల్పాలనుకున్నా. ఇలా ప్రారంభమైందే - సేఫ్‌ కేవ్‌’.. అంటోన్న సిమర్‌.. గతేడాదే దీన్ని ప్రారంభించింది.

సహజ సబ్బులు.. షాంపూలు!

తన ఎన్జీవో ద్వారా ఆమ్ల దాడి బాధితుల చర్మానికి సరిపడేలా.. సహజసిద్ధమైన సబ్బులు తయారుచేయాలనుకుంది సిమర్‌. ఇందుకోసం వారి చర్మానికి హాని కలిగించని, ఆ గాయాల్ని నయం చేసే కొన్ని న్యాచురల్‌ ఉత్పత్తుల్ని గుర్తించింది.. ఆపై చర్మ సంబంధిత నిపుణుల సూచనలతో సబ్బుల తయారీ ప్రారంభించింది. వివిధ రకాల ఔషధ గుణాలున్న పసుపు, కలబంద, కీరాదోస, కుంకుమ పువ్వు, పూరేకలు, చందనం, తేనె.. వంటి సహజ పదార్థాల్ని ఉపయోగించి సబ్బులు, ఫేస్‌వాష్‌, మసాజ్‌ ఆయిల్స్‌, ఫేస్‌ మాస్కులు, షాంపూలు.. వంటివి తయారుచేస్తోంది. అంతేకాదు.. ఈ ఏడాది రంగుల పండగ హోలీకీ న్యాచురల్‌ కలర్స్‌ తయారుచేసి.. ఆమ్ల దాడి బాధితుల్లో పండగ వెలుగులు నింపింది. సిమర్‌ చేస్తోన్న ఈ మంచి పనిలో ఆమె తల్లి సీమా, ఆంటీ డైజీ కూడా భాగమయ్యారు. వాళ్లూ ఆయా సౌందర్యోత్పత్తుల తయారీలో సిమర్‌కు సహాయం చేస్తున్నారు.

శిక్షణతో స్వయం ఉపాధి!

ఆమ్ల దాడి బాధితుల కోసం సహజసిద్ధమైన చర్మ ఉత్పత్తులు తయారుచేయడమే కాదు.. ఈ మెలకువలు నేర్పి.. వారికి స్వయం ఉపాధి మార్గం చూపుతోంది సిమర్‌. ఇందుకోసం ‘ఏక్‌ సఫర్‌’ పేరిట వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తూ వారికి సహజసిద్ధమైన సబ్బులు, షాంపూలు, ఇతర చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో శిక్షణనిస్తోంది. అంతేకాదు.. ఇలా వారు తయారుచేసిన ఈ ఉత్పత్తుల్ని వివిధ మేళాల్లో ప్రదర్శించే అవకాశం కల్పిస్తూ.. వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేస్తోంది. మరోవైపు మార్కెటింగ్‌ నైపుణ్యాల్నీ నేర్పిస్తూ.. వారే తమ ఉత్పత్తుల్ని స్వయంగా విక్రయించేలా ప్రోత్సహిస్తోంది సిమర్.

‘ఏటా 11-30 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళలు ఆమ్ల దాడికి గురవుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ మానసికంగా కుమిలిపోతున్నారు. ఈ బాధను వారి నుంచి దూరం చేయాలంటే.. వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. అందుకే వారికి ఈ స్వయం ఉపాధి మార్గం చూపించా. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఆమ్లదాడి బాధితులు మా వద్ద శిక్షణ పొందారు. స్వయంగా ఈ ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడమే కాదు.. వారికి తెలిసిన వారికీ ఈ మెలకువలు నేర్పిస్తున్నారు. ఇక నా తోటి విద్యార్థుల్నీ వారి చుట్టూ ఉన్న ఆమ్ల దాడి బాధితుల్లో స్ఫూర్తి నింపేలా ప్రోత్సహిస్తున్నా..’ అంటోందీ మనసున్న అమ్మాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని