Published : 24/12/2022 15:17 IST

ఈ కేక్స్‌తో ‘క్రిస్మస్‌’ ఎంతో స్పెషల్!

క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది అందమైన క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ గిఫ్ట్స్, నోరూరించే స్పెషల్ వంటకాలు.. ఇలా ఎన్నో! ఇక ప్రత్యేకించి కేక్స్ గురించి చెప్పే పనే లేదు. నోరూరించే కేక్ లేకుండా క్రిస్మస్ పూర్తి కాదు.. అయితే బయట ఎన్ని రకాల కేక్స్ అందుబాటులో ఉన్నా, కొంతమందికి మాత్రం ఇంట్లో స్వయంగా కేక్ తయారు చేయకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది.. అలాంటివారి కోసమే ఈ వెరైటీ కేక్స్..!

ఎగ్‌నాగ్‌ కేక్

కావల్సినవి

వెన్న - అర కప్పు

చక్కెర – ఒకటింపావు కప్పు

గుడ్లు - మూడు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - అర టీస్పూన్

రమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్

మైదా - రెండు కప్పులు

ఉప్పు - టీస్పూన్

ఎగ్‌నాగ్‌ - కప్పు

ఫ్రాస్టింగ్‌ కోసం

మైదా - పావు కప్పు

ఉప్పు - చిటికెడు

ఎగ్‌నాగ్‌ - ఒకటిన్నర కప్పులు

వెన్న – కప్పు

చక్కెర - ఒకటిన్నర కప్పులు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - ఒకటిన్నర టీస్పూన్

రెడ్‌ జెల్‌ ఫుడ్‌ కలర్‌ - 3-4 చుక్కలు (ఆప్షనల్)

ముందుగా ఎగ్‌నాగ్‌ ఎలా తయారు చేయాలో చూద్దాం..

కావల్సినవి

గుడ్లు - నాలుగు (తెల్లసొన, పచ్చసొన వేరుచేసి పెట్టుకోవాలి)

చక్కెర - ముప్పావు కప్పు

పాలు - అరలీటర్

హెవీ క్రీం - కప్పు

రమ్‌ - 100 ఎంఎల్

జాజికాయ పొడి - టీస్పూన్

దాల్చిన చెక్క పొడి - కొద్దిగా

తయారీ

ముందుగా పచ్చసొనలను తీసుకొని బీట్ చేసుకొని, అందులో ముప్పావు కప్పు చక్కెర కొద్దికొద్దిగా వేస్తూ కరిగిపోయేవరకూ బీట్ చేసుకోవాలి. అందులో పాలు, క్రీం, రమ్, జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌లో ఎగ్ వైట్స్ తీసుకొని బీట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ చక్కెర వేసి అది కరిగే వరకు బీట్ చేసుకోవాలి. ఇందాక తయారుచేసుకున్న మిశ్రమంలో ఈ ఎగ్‌వైట్స్‌ని కూడా కలుపుకొని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అంతే.. ఎగ్‌నాగ్‌ రడీ..

ఎగ్‌నాగ్‌ కేక్‌ తయారీ

ముందుగా ఒక గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెరను వేసి కలుపుకోవాలి. గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా బీట్‌ చేసుకొని, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, రమ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌లను వేసి కలుపుకోవాలి. దీనిలో మైదా మిశ్రమం, ఎగ్‌నాగ్‌ కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కేక్‌ మిశ్రమాన్ని బేకింగ్‌ ప్యాన్‌లో వేసి ఒవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ వద్ద 25-30 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. కేక్‌ను టూత్‌పిక్‌తో చెక్‌ చేశాక బయటకు తీసి చల్లారనివ్వాలి.

ఇప్పుడు ఫ్రాస్టింగ్‌ కోసం, ఒక ప్యాన్‌లో మైదా, ఉప్పు, ఎగ్‌నాగ్‌ వేసి సన్నని మంట మీద కలుపుకోవాలి. ఇది కాస్త ఉడికి చిక్కబడ్డాక స్టవ్‌ ఆఫ్‌ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో వెన్న, చక్కెరను బాగా కలుపుకొని వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, చల్లబడ్డ ఎగ్‌నాగ్‌ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ఫుడ్‌ కలర్‌ వేసి కలుపుకొంటే ఫ్రాస్టింగ్‌ రడీ.. ఈ ఫ్రాస్టింగ్‌ను బేక్‌ చేసుకున్న కేక్‌ పైభాగం మొత్తం అప్లై చేసుకుంటే సరి.. క్రిస్మస్‌ స్పెషల్‌ ఎగ్‌నాగ్‌ కేక్‌ సిద్ధం..!


ఫ్లోర్‌లెస్‌ చాక్లెట్‌ కేక్

కావల్సినవి

డార్క్‌ చాక్లెట్‌ - 200 గ్రాములు

వెన్న – 200 గ్రాములు

కాఫీ పొడి - టీస్పూన్

గుడ్లు - ఆరు

చక్కెర – 250 గ్రాములు

కొకోవా పౌడర్‌ - 100 గ్రాములు

ఉప్పు - చిటికెడు

స్ట్రాబెర్రీలు - 5-10

తయారీ

ముందుగా ఒవెన్‌ను 160 డిగ్రీల వద్ద ప్రీహీట్‌ చేసుకోవాలి. ఆపై స్టవ్‌పై ఒక ప్యాన్‌లో డార్క్‌ చాక్లెట్‌, వెన్నను కలిపి కరిగించుకోవాలి. ఇప్పుడు కాఫీ పొడి వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. గుడ్లని పగలగొట్టి తెల్లసొనని, పచ్చసొనని వేరువేరు గిన్నెల్లో పెట్టుకోవాలి.

ఇప్పుడు గుడ్ల తెల్లసొనని బాగా బీట్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆపై గుడ్ల పచ్చసొనని, చక్కెరను కలిపి 5-10 నిమిషాల పాటు బాగా గిలక్కొట్టాలి. ఇందులో ఉప్పు, ముప్పావు భాగం కొకోవా పౌడర్‌ వేసి కలుపుకోవాలి. దీనిలో ముందుగా కరిగించుకొన్న చాక్లెట్‌, వెన్న మిశ్రమం వేసి 5 నిమిషాల పాటు కలపాలి. చివరిగా, బీట్‌ చేసుకున్న గుడ్ల తెల్లసొనను ఇందులో వేసి బాగా కలుపుకొని, బేకింగ్‌ ట్రేలోకి పోసి 50-60 నిమిషాల వరకు ఒవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. ఇప్పుడు కేక్‌ను ఒవెన్‌లో నుంచి బయటకు తీసి చల్లార్చుకొని మిగిలిన కొకోవా పౌడర్‌ను కేక్‌పై చల్లుకొని, స్ట్రాబెర్రీలతో గార్నిష్‌ చేసుకుంటే సరి. యమ్మీ ఫ్లోర్‌లెస్‌ చాక్లెట్‌ కేక్‌ రెడీ..! ఇందులో ఎలాంటి పిండీ కలపకపోవడం దీని ప్రత్యేకత..


ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్

కావల్సినవి

మజ్జిగ – కప్పు

బేకింగ్‌ సోడా - టీస్పూన్

వెన్న – కప్పు

చక్కెర – రెండు కప్పులు

గుడ్లు - అయిదు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్

కోకొనట్‌ ఫ్లేక్స్ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది) - కప్పు

మైదా - రెండు కప్పులు

బేకింగ్‌ పౌడర్‌ - టీస్పూన్

బేకింగ్‌ ప్యాన్లు - మూడు

ఫ్రాస్టింగ్‌ కోసం

క్రీం చీజ్‌ - కప్పు

వెన్న – అర కప్పు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్

విప్డ్‌ క్రీం (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది) - రెండు టేబుల్‌ స్పూన్లు

చక్కెర పొడి– నాలుగు కప్పులు

తరిగిన వాల్‌నట్స్‌ - అర కప్పు

స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి) - కప్పు

తయారీ

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో మజ్జిగ, బేకింగ్‌ సోడాని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెర వేసి బాగా కలుపుకొని, గుడ్లు ఒకొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, కోకోనట్‌ ఫ్లేక్స్‌, బేకింగ్‌ పౌడర్‌, మైదా, మజ్జిగ వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్‌ ప్యాన్లను కొద్దిగా వెన్నతో గ్రీజ్‌ చేసుకొని, ఈ కేక్‌ మిశ్రమాన్ని అన్నిట్లోనూ సమానంగా పోసుకొని, ఒవెన్‌లో 30-35 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి. టూత్‌పిక్‌తో గుచ్చితే కేక్‌ మిశ్రమం అంటుకోకుండా వస్తే, కేక్‌ తయారైనట్లే. ఇప్పుడు కేక్స్‌ను ఒవెన్‌లోనుంచి బయటకు తీసి చల్లార్చుకోవాలి.

ఈలోపు ఫ్రాస్టింగ్‌ తయారుచేసుకోవాలి. దీనికోసం, క్రీం చీజ్‌, వెన్న, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, విప్డ్‌ క్రీం, పొడిగా చేసిన చక్కెర వేసి బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. తరువాత, తరిగిన వాల్‌నట్స్‌, స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్‌ వేసి కలుపుకొంటే ఫ్రాస్టింగ్‌ క్రీం సిద్ధం..
ఇప్పుడు ఒక కేక్‌ను ప్లేట్‌లోకి తీసుకొని తయారుచేసుకున్న క్రీంను కేక్‌పై అప్లై చేసుకోవాలి. దీనిపై మరో కేక్‌ను పెట్టుకొని క్రీంను అప్లై చేసుకొని, దీనిపై మూడవ కేక్‌ను పెట్టి క్రీంను కేక్‌ అన్ని వైపులా గార్నిష్‌ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్‌ రడీ!


వెనీలా బన్ట్ కేక్

కావల్సినవి

వెన్న – మూడు కప్పులు

చక్కెర – రెండు కప్పులు

గుడ్లు - నాలుగు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టేబుల్‌స్పూన్

ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్

మైదా - మూడు కప్పులు

కార్న్‌స్టార్చ్‌ - ఆరు టేబుల్‌ స్పూన్లు

బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు

ఉప్పు - చిటికెడు

పాలు - కప్పు

బన్ట్‌ ప్యాన్‌ (ఇదొక కేక్‌ ప్యాన్‌, మార్కెట్‌లో దొరుకుతుంది)

కేక్‌పై గ్లేజ్‌ కోసం

చక్కెర పొడి - రెండున్నర కప్పులు

పాలు - 5 టేబుల్‌ స్పూన్లు

వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - అర టీస్పూన్

ఉప్పు - చిటికెడు

తయారీ

ముందుగా ఒవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మైదా, కార్న్‌స్టార్చ్‌, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు, మరొక గిన్నెలో వెన్న, చక్కెర వేసి బాగా కలుపుకొని, గుడ్లు ఒక్కొక్కటిగా వేసి కలపాలి. ఆపై, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఆల్మండ్ ఎక్స్‌ట్రాక్ట్‌, మైదా మిశ్రమం, పాలు వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. ఈ కేక్‌ మిశ్రమాన్ని బన్ట్‌ ప్యాన్‌లో వేసుకొని గంట పాటు బేక్‌ చేసుకోవాలి. ఈలోపు కేక్‌పై గ్లేజ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో చక్కెర పొడి, పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఉప్పు వేసి బాగా కలుపుకొంటే గ్లేజ్‌ సిద్ధం. ఇప్పుడు తయారు చేసుకున్న కేక్‌ను బయటకు తీసి దానిపై ఈ గ్లేజ్‌ను పోసుకుంటే సరి.. నోరూరించే వెనీలా బన్ట్‌ కేక్‌ సిద్ధం..!

మరి ఎంతో రుచికరమైన ఈ కేక్స్‌ని మీరు కూడా ట్రై చేసి, ఈ క్రిస్మస్‌ పండగను మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోండి..

హ్యాపీ క్రిస్మస్..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని