కరివేపాకు ఆరు నెలలైనా పాడవకుండా.. అమ్మ చెప్పిన చిట్కా!

కాలమేదైనా ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. ఫ్రిజ్‌లో నిల్వ చేసినా రెండు మూడు రోజులకు మించి అవి తాజాగా ఉండవు. ఈ క్రమంలో ఎండిపోవడం, రంగు మారిపోవడం, కుళ్లిపోవడం చూస్తుంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్‌ చిట్కాను ప్రయత్నించమంటోంది ఓ దేశీ మామ్‌.

Published : 26 Jun 2024 12:21 IST

(Photos: Instagram)

కాలమేదైనా ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. ఫ్రిజ్‌లో నిల్వ చేసినా రెండు మూడు రోజులకు మించి అవి తాజాగా ఉండవు. ఈ క్రమంలో ఎండిపోవడం, రంగు మారిపోవడం, కుళ్లిపోవడం చూస్తుంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ సింపుల్‌ చిట్కాను ప్రయత్నించమంటోంది ఓ దేశీ మామ్‌. ఈ చిట్కాతో కరివేపాకును ఆరు నెలల పాటు తాజాగా నిల్వ చేసుకోవచ్చంటోంది. అదెలాగో వివరిస్తూ తీసిన వీడియోను ఈ మధ్యే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందామె. అంతే.. లక్షల కొద్దీ వ్యూస్‌తో నెట్టింట్లో ట్రెండింగ్‌గా నిలిచిందీ వీడియో.

వంటలకు సంబంధించిన వివిధ చిట్కాల్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు కొందరు మహిళలు. ధారా అనే మహిళ కూడా ఇలా తనకు తెలిసిన వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలికి సంబంధించిన అంశాలు, వంటలు.. వంటివెన్నో తన ఇన్‌స్టా ఖాతా, యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా పంచుకుంటుంటుంది. ఇద్దరు కవల పిల్లల తల్లైన ఆమె.. ‘twinsbymyside’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ వేదికగా ఈ చిట్కాల్ని పోస్ట్‌ చేస్తూ.. సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకుంది.

ఫ్రీజింగ్‌ పద్ధతిలో..!

ఇలా ఇటీవలే ఓ వంటింటి చిట్కాను ఇన్‌స్టా వేదికగా వీడియో రూపంలో పంచుకుంది ధారా. ఇందులో భాగంగా కరివేపాకును ఆరు నెలల పాటు తాజాగా నిల్వ చేసుకోవడమెలాగో నేర్పించింది. ముందుగా ఆకుల్ని కాడ నుంచి వేరు చేసి.. కొన్ని కొన్ని ఆకుల్ని ఐస్క్యూబ్స్‌ ట్రేలో అమర్చింది. అవి మునిగేలా నీళ్లు నింపి.. మూత పెట్టి ట్రేను ఫ్రీజర్‌లో పెట్టింది. అవి గడ్డకట్టాక.. వాటిని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసింది. ఇక వీటిని కావాలనుకున్నప్పుడు గోరువెచ్చటి నీటిలో వేస్తే సరి.. ఐస్‌ కరిగిపోయి కరివేపాకులు మనం అమర్చినప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో.. ఇప్పుడూ అంతే తాజాగా ఉండడం గమనించచ్చు.

‘మార్కెట్‌ నుంచి తాజాగా తెచ్చిన కరివేపాకుల్ని నిల్వ చేయడం గతంలో నాకు సవాలుగా మారింది. అందుకే ఈ చిట్కాను ప్రయత్నించా. అప్పట్నుంచి నాకు కావాల్సినప్పుడల్లా ఇలా తాజా కరివేపాకుల్ని వంటల్లో ఉపయోగించుకుంటున్నా. ఒక్కోసారి స్టోర్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉండవు.. అందుకే ముందే ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఇలా నిల్వ చేసుకుంటున్నా. మీరూ ఈ చిట్కా పాటించచ్చు..’ అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేసిందీ దేశీ మామ్‌. ఇలా కరివేపాకునే కాదు.. ఇతర ఆకుకూరల్నీ ఇదే తరహాలో నిల్వ చేసుకోవచ్చంటోంది ధారా. ఇలా ఆమె పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. లక్షల కొద్దీ వ్యూస్‌ను సంపాదించి పెట్టింది. చాలామంది మహిళలు స్పందిస్తూ.. ఆకుకూరల్ని తామెలా నిల్వ చేసుకుంటారో వివరించారు. మరికొందరు చిట్కా బాగుందంటూ ధారాను అభినందించారు.


ఇవీ తాజాగా!

ఇదేవిధంగా ఆకుకూరలతో పాటు కాయగూరలు, పండ్లనూ ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోవాలంటే ఈ సింపుల్‌ చిట్కాల్ని పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.

⚛ ఐస్‌ ట్రేలో సగం వరకు కరిగించిన బటర్‌/నెయ్యి పోసి.. అందులో తరిగిన కొత్తిమీర వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు రోజుల తర్వాత ఆ క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. కూరలు ఉడికేటప్పుడు ఈ క్యూబ్స్‌ని అందులో వేస్తే సరి!

⚛ ఆకుకూరలు ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండాలంటే వాటిని కడిగి, ఆరబెట్టి, సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఐస్ ట్రేలలో ముప్పావు వంతు నింపి, ఆకులు మునిగే వరకు నీరు పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. వీటికి ఇతర పదార్థాల వాసన పట్టకుండా ఉండాలంటే ఈ ఐస్‌ ట్రేలకు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ చుడితే సరిపోతుంది.

⚛ పాలకూర, గుమ్మడికాయ, క్యారట్ వంటి వాటిని ప్యూరీ చేసుకుని రెండు రోజుల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. అవి గట్టిపడిన తర్వాత జిప్‌లాక్ కవర్లో భద్రపరచుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మరిగే నీటిలో ఈ క్యూబ్స్ వేసుకుని.. క్షణాల్లో నచ్చిన సూప్‌ తయారు చేసుకోవచ్చు.

⚛ పండ్లను నిల్వ చేయడానికీ ఈ తరహా ఫ్రీజింగ్‌ పద్ధతినే పాటించచ్చు. ఆయా పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఐస్‌ట్రేలో ముప్పావు వంతు వచ్చేలా సెట్‌ చేయాలి. మిగిలిన పావు భాగం నీటితో నింపాలి. రెండు రోజుల తర్వాత గడ్డకట్టిన వీటిని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి ఫ్రీజర్లో భద్రపరచాలి. తినాలనుకున్నప్పుడు ఓ గంట ముందు ఫ్రీజర్‌లోంచి తీస్తే తాజా పండ్లు రడీ..! స్మూతీ చేసుకోవాలంటే ఫ్రీజర్‌లోంచి తీసిన వెంటనే మిక్సీ పట్టుకోవచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్