బతుకు ‘కళ’ నేర్పిస్తోన్న టీచరమ్మ!

‘అన్నం పెడితే ఆ రోజుకు వాళ్ల పొట్ట నిండుతుంది. అదే వాళ్లకు వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తే... జీవితాంతం ఆ ఆసరాతో బతుకుతారు’ అంటారు ఓర్నా సంస్థ వ్యవస్థాపకురాలు జుంకీ అయ్యంగార్‌. మహారాష్ట్రలోని నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలకు జూట్, కాంతా ఎంబ్రాయిడరీతో గృహోపకరణాలూ, యాక్సెసరీల తయారీలో శిక్షణ ఇచ్చి, అనేకమంది మహిళలను ఉపాధి బాట పట్టిస్తోందీమె.

Published : 06 Jul 2024 02:16 IST

‘అన్నం పెడితే ఆ రోజుకు వాళ్ల పొట్ట నిండుతుంది. అదే వాళ్లకు వృత్తి నైపుణ్యాలు నేర్పిస్తే... జీవితాంతం ఆ ఆసరాతో బతుకుతారు’ అంటారు ఓర్నా సంస్థ వ్యవస్థాపకురాలు జుంకీ అయ్యంగార్‌. మహారాష్ట్రలోని నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలకు జూట్, కాంతా ఎంబ్రాయిడరీతో గృహోపకరణాలూ, యాక్సెసరీల తయారీలో శిక్షణ ఇచ్చి, అనేకమంది మహిళలను ఉపాధి బాట పట్టిస్తోందీమె.

‘ఓర్నా..నా భావోద్వేగంలోంచి వచ్చిన ఆలోచన. రోజూ మా ఇంటి ముందు నుంచి సుందర్‌బాయి అనే మహిళ కట్టెల మోపు తలపై పెట్టుకుని వెళ్తుండేది. వెళ్తూ వెళ్తూ చిరునవ్వుతో పలకరించేది. నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా అదృష్టం కొద్దీ బాగా చదువుకునే అవకాశం వచ్చింది. ఆమెకు ఆ అవకాశం రాక అలా ఉండిపోయింది. అందుకే అలాంటి వారికి ఏదైనా చేయాలనుకున్నా. 57ఏళ్ల వయసులో 2018లో ‘ఓర్నా’ ఎంటర్‌ప్రైజ్‌ను ప్రారంభించా. ఇది నా జీవితానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుందని భావించా’ అంటారు 63ఏళ్ల జుంకీ.

ఐఐటీ పాఠాలే...

మెకానికల్‌ ఇంజినీర్‌ అయిన జుంకీ... ఐఐటీ బాంబేలో ఐడీసీ (ఇండస్ట్రియల్‌ డిజైన్‌ సెంటర్‌)లో మాస్టర్స్‌ పూర్తిచేశారు. ఆ తరవాత అమెరికాలో హ్యూమన్‌ సెంటర్డ్‌ డిజైన్‌లో ఎంఎస్‌ చదివారు. ప్రస్తుతం ఐఐటీ కాన్పుర్, జోధ్‌పూర్‌లలో ప్రొడక్ట్‌ డిజైన్‌ను బోధిస్తున్నారు. ఐఐటీ విద్యార్థులకు చెప్పే డిజైనింగ్‌ పాఠాలే మహారాష్ట్రలోని గ్రామీణ యువతకూ బోధిస్తున్నారు జుంకీ. కుటుంబానికి మహిళలే వెన్నెముక అని నమ్మిన ఈమె, వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలనుకున్నారు ఖండాలా. కాన్పూర్‌ దేహాత్‌... గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులూ, రైతు మహిళలకు ఎంబ్రాయిడరీ బ్యాక్‌ప్యాక్‌లు, టొటే బ్యాగులూ, టీ టవల్స్, బాటిల్‌ హోల్డర్లూ వంటి ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. వాళ్లలో కొంతమందికి అసలు ఇంటినీ, గ్రామాన్నీ వదిలి వచ్చే వెసులుబాటు ఉండదు. అటువంటి వాళ్లకు మెటీరియళ్లను తీసుకెళ్లి ఇంటి వద్దే పనిచేసుకునే ఏర్పాటునీ చేశారు. అసలు కుట్టుపనే తెలియని వారికి ‘రెడీ టు స్యూ’ కిట్లను అందించి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

రాజీలేకుండా...

కొత్తగా నేర్చుకున్న వాళ్లయినా సరే... నాణ్యత, డిజైనుల్లో రాజీ పడకుండా, గంటల కొద్దీ సమయం వెచ్చించి, ఓపిగ్గా నేర్పిస్తున్నారు. మరి... పర్యావరణానికీ హాని కలగకూడదు కదా! అందుకే స్క్రాప్‌తోనూ ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. ప్యాకేజింగ్‌ కోసం కూడా అప్‌సైకిల్‌ చేసిన చీరలనే ఉపయోగిస్తున్నారు. ఈ బ్రాండ్‌ ఉత్పత్తులను యూఎస్‌ఏలోని ‘ఎన్‌వై నౌ’ ట్రేడ్‌ షోలో ప్రదర్శనకూ ఉంచితే మంచి ఆదరణ లభించింది. సోషల్‌ ఇంపాక్ట్‌ వర్క్, మార్కెట్‌ ఇంక్యుబేటర్‌గానూ ఎంపికైందీ. అందులోని రెండు ఉత్పత్తులు ‘ది బెస్ట్‌ న్యూ ప్రొడక్ట్‌’గానూ ఎంపికయ్యాయి. అంతేకాదు, గ్రామీణ వ్యాపారుల సాధికారత కోసం పుణెలో జరిగే భీమ్‌తడీ యాత్రకూ ‘ఓర్నా’ డిజైన్లు ఎంపికయ్యాయి. గతేడాది ఈ ఉత్పత్తులను హైదరాబాద్, దిల్లీలో ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శనకు ఉంచారు. బొటిక్‌లకూ, విదేశాలకూ ఎగుమతి చేస్తూ, ఏటా రూ.10-12 లక్షల టర్నోవర్‌ సాధిస్తున్నారు. ఎంబ్రాయిడరీ మాత్రమే కాకుండా, ఆర్డర్లను మేనేజ్‌చేయడం, ఫొటోగ్రఫీ,  అకౌంట్లు చూసుకోవడం, కస్టమర్లతో మాట్లాడడం, వంటి నైపుణ్యాలను మహిళలకు నేర్పిస్తూ ఆర్థిక స్వేచ్ఛ ఉండేలా చూస్తున్నారు జుంకీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్